Begin typing your search above and press return to search.

సీఎం జగన్ హాజరైన పంచాంగ శ్రవణ కార్యక్రమంలో పండితులు ఏం చెప్పారు?

By:  Tupaki Desk   |   22 March 2023 7:05 PM GMT
సీఎం జగన్ హాజరైన పంచాంగ శ్రవణ కార్యక్రమంలో పండితులు ఏం చెప్పారు?
X
ముప్ఫై.. నలభై ఏళ్ల క్రితం పరిస్థితులు ఎలా ఉండేవి? ఇప్పుడు ఎలా ఉంటాయనటానికి ఉగాది వేళ నిర్వహించే పంచాంగ శ్రవణాన్ని ఒక పెద్ద ఉదాహరణగా చెప్పొచ్చు. ఇప్పుడు ఉన్నట్లే గతంలోనూ ముఖ్యమంత్రులు ఉండేవారు. ఇప్పటిమాదిరే అప్పట్లోనూ స్వామిభక్తి.. పాలకుల మీద ప్రేమాభిమానాలు.. భయం భక్తులు ఉండేవి. కాకుంటే.. అవన్నీ ఉన్నప్పటికీ.. తాము నమ్మిన విధానాన్ని అంతో ఇంతో బయటకు చెప్పే విషయంలో అస్సలు వెనుకాడేవారు కాదు. ఇప్పటి మాదిరి ఉత్త భజన తప్పించి.. అసలు విషయాల్ని పక్కన పెట్టేసే తీరు ఉండేది కాదు. నిప్పు లాంటి నిజాన్ని కాలిపోయేలా కాకున్నా.. చురుకు పుట్టేలా లేదంటే కాస్తంత చుర్రు పుట్టేలా చెప్పేందుకు వెనుకాడేవారు కాదు.

కానీ.. కొన్నేళ్లుగా ఆ పరిస్థితుల్లో పూర్తి మార్పు వచ్చేసింది. ఏపీలో అయితే పరిస్థితి మరింతగా మారిందని చెప్పాలి. ఇందుకు నిదర్శనంగా ఉగాది వేళ ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి సతీసమేతంగా హాజరైన పంచాంగ శ్రవణ కార్యక్రమాన్ని చెప్పాలి. పంచాంగ శ్రవణం వేళ.. పాలకులకు ఎదురయ్యే కష్టనష్టాల గురించి ప్రస్తావన.. ఒకలాంటి సందేశం ఇవ్వటం కనిపిస్తుంది.

అందుకు భిన్నంగా ఏపీ పంచాంగ శ్రవణం సాగింది. తాడేపల్లిలోని ముఖ్యమంత్రి నివాసంలోనే పంచాంగ శ్రవణంలో పాల్గొన్న ఆయనకు పండితులు పండుగ శుభాకాంక్షలు తెలియజేశారు. పంచాంగ పఠనాన్ని కప్పగంతు సుబ్బరాయ సోమయాజి చేపట్టారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కేంద్ర.. రాష్ట్ర ప్రభుత్వాల మధ్య సత్ సంబంధాలు ఏర్పడతాయని.. శ్రామికులు.. కర్షకులకు మంచి ఫలితాలు ఉంటాయన్నారు.

పారిశ్రామిక వాతావరణం రాష్ట్రంలో ఏర్పడుతుందన్న ఆయన.. అందుకు అనుకూల వాతావరణం ఏర్పడుతుందన్నారు. ఆహార ఉత్పత్తులతో ముడిపడిన వ్యాపారాలు బాగుంటాయని పేర్కొన్నారు. ఆయన నోటి నుంచి వచ్చిన పంచాంగ పఠనం మొత్తం సానుకూల అంశాలే తప్పించి.. ఒక్క ప్రతికూల అంశాన్ని ప్రస్తావించలేదు. ఇదంతా చూసిన వారు.. పంచాంగ పఠనం ఫార్సుగా మార్చేస్తున్నారన్న మాట పలువురి నోట వినిపించటం గమనార్హం



నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.