Begin typing your search above and press return to search.

సెకండ్.. థర్డ్ వేవ్ పై హైదరాబాదీ శాస్త్రవేత్త చెప్పిందేమిటి?

By:  Tupaki Desk   |   10 Nov 2020 6:15 AM GMT
సెకండ్.. థర్డ్ వేవ్ పై హైదరాబాదీ శాస్త్రవేత్త చెప్పిందేమిటి?
X
దేశంలో చాలామంది శాస్త్రవేత్తలు ఉన్నప్పటికి.. అత్యుత్తమ శాస్త్రవేత్తల్లో ఒకరు డాక్టర్ అక్కినెపల్లి రఘురామ్. ప్రపంచంలోనే అత్యుత్తమ రెండు శాతం ఫార్మకాలజిస్ట్‌లలో ఆయన ఒకరు అలాంటి ఆయన.. తాజాగా ఒక మీడియా సంస్థకు ప్రత్యేక ఇంటర్వ్యూ ఇచ్చారు. కరోనా వైరస్ పై పలు ఆసక్తికర అంశాల్ని వెల్లడించారు. ఒకసారి వైరస్ సోకిన వారికి రెండోసారి రాదన్నది అబద్దమని.. అది ఉత్త అపోహ మాత్రమేనని తేల్చారు. వైరస్ కారణంగా వచ్చే రోగనిరోధక శక్తి తాత్కాలికమేనని.. కాబట్టి రెండోసారి వైరస్ సోకే అవకాశం ఉందని స్పష్టం చేశారు.

చైనాలో పుట్టినట్లు చెబుతున్న కరోనా వైరస్.. జంతువుల నుంచో.. మనుషుల నుంచే సహజసిద్ధంగాపుట్టినట్లుగా మాత్రం కనిపించటం లేదన్న ఆయన.. ఏదో చేయబోతే మరేదో అయినట్లుగా చెబుతున్నారు. ఒకసారి వైరస్ సోకిన వారు.. రెండోసారి వైరస్ సోకటానికి అవకాశాలుచాలానే ఉన్నాయని.. రెండోసారి ఇన్ ఫెక్ట్ అయ్యే వారికిలో పరిస్థితి తీవ్రంగా ఉంటుందన్నారు. ఒకసారి వైరస్ వచ్చిన వారు మళ్లీ తమకు రాదనే భ్రమ ఏ మాత్రం మంచిది కాదన్నారు. అదే సమయంలో వైరస్ రాని వారు.. తమకేం కాదని ఊరుకోవటం కూడా సరికాదన్నారు.

ఇతర రాష్ట్రాలతో పోలిస్తే.. తెలంగాణలో కేసుల సంఖ్య తక్కువేనని.. రికవరీ రేటు కూడా ఎక్కువేనని చెప్పారు. తెలంగాణలో.. మరీ ముఖ్యంగా హైదరాబాద్ ప్రజల్లో నిర్లక్ష్యం చాలా ఎక్కువగా.. కొట్టొచ్చినట్లుగా కనిపిస్తోందన్నారు. తాను రెండేళ్ల క్రితం జపాన్ కు వెళితే.. అక్కడి ప్రజలు విధిగా ముఖానికి మాస్కు పెట్టుకుంటారని.. విపత్తులు ఎక్కువగా ఉండటంతో ఈ అలవాటు వారిలో ఎక్కువని చెప్పారు.

అలాంటి తీరు మన దగ్గర కనిపించదన్నారు. కరోనా వైరస్ పోయిందన్న భావన తప్పని.. అలాంటి పరిస్థితితో మొదటికే మోసం వస్తుందన్నారు. కేరళలో ఇలాంటి పరిస్థితే ఎదురైందన్న ఆయన.. ముఖానికి మాస్కు తప్పనిసరి అని.. శానిటైజర్ ను కూడా తప్పక వాడాలన్నారు. అందరూ చెబుతున్నట్లుగా మన దేశంలో సెకండ్ వేవ్ తీవ్రత ఉంటుందని చెప్పలేనన్నారు. సెకండ్ వేవ్ కానీ.. థర్డ్ వేవ్ కానీ.. ప్రజల వ్యవహారశైలిపై ఆధారపడి ఉంటుందని.. జాగ్రత్తలు తీసుకుంటే ఈ ముప్పు నుంచి తప్పించుకోవచ్చని చెబుతున్నారు.