Begin typing your search above and press return to search.

స్థానిక ఎన్నికలపై ఏపీ సర్కారుకు హైకోర్టు ఏం చెప్పింది?

By:  Tupaki Desk   |   29 Dec 2020 10:30 AM GMT
స్థానిక ఎన్నికలపై ఏపీ సర్కారుకు హైకోర్టు ఏం చెప్పింది?
X
వ్యవస్థల మధ్య పోరు ఏ మాత్రం మంచిది కాదు. దురదృష్టవశాత్తు ఏపీలోని రాష్ట్ర ఎన్నికల సంఘానికి.. సర్కారుకు మధ్య పేచీ అంతకంతకూ ముదురుతోంది. తాను స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణకు సానుకూలంగా ఉన్న వేళ.. ఎన్నికల్ని వాయిదా వేస్తూ తీసుకున్న నిర్ణయంతో గొడవ మొదలైంది. అది అంతకంతకూ పెరుగుతూ పోవటమే కాదు.. ప్రతి చిన్న విషయానికి కోర్టుల్ని ఆశ్రయిస్తున్న వైనంతో ఈ రెండు వ్యవస్థల మధ్య పేచీ పలు మలుపులు తిరుగుతోంది. ఏ కరోనా పేరు చెప్పి గతంలో స్థానిక ఎన్నికల్ని వాయిదా వేశారో.. అప్పుడు అదే మహమ్మారి పూర్తిగా నివారణ కాక ముందే.. ఎన్నికల్ని ఎలా నిర్వహిస్తారన్న ప్రశ్నను సంధిస్తోంది జగన్ సర్కారు. రాష్ట్ర ఎన్నిక కమిషనర్ నిమ్మగడ్డతో పెరిగిన దూరం అంతకంతకూ పెరుగుతుందే తప్పించి తగ్గని పరిస్థితి.

వెనక్కు తగ్గని నిమ్మగడ్డ

రాష్ట్ర ప్రభుత్వానికి ఏ మాత్రం తీసిపోని రీతిలో నిమ్మగడ్డ వ్యవహరిస్తుండటంతో స్థానిక ఎన్నికల వ్యవహారం కోర్టు ఆదేశాల నడుమ నలుగుతోంది. తాజాగా ఏపీ హైకోర్టు కీలక ఆదేశాల్ని జారీ చేసింది. ఏపీలో స్థానిక ఎన్నికల నిర్వహణ అంశంపై ప్రభుత్వం.. రాష్ట్ర ఎన్నికల కమిషనర్ లు సమావేశం కావాలని చెప్పింది. స్థానిక ఎన్నికల నిర్వహణకు ఉన్న అడ్డంకుల్ని ప్రభుత్వం ఎన్నికల కమిషన్ కు చెప్పాలని పేర్కొంది.

మళ్లీ ఈసీ - అధికారుల మీటింగ్ ఏర్పాటుచేసిన కోర్టు

మూడు రోజుల్లోపు ముగ్గురు ప్రిన్సిపల్ సెక్రటరీ స్థాయి అధికారులు రాష్ట్ర ఎన్నికల కమిషనర్ ను కలవాలని చెప్పిన కోర్టు.. సమావేశం ఎక్కడ జరుగుతుందన్న విషయాన్ని నిమ్మగడ్డ తెలియజేస్తారని చెప్పింది. అప్పటికి వీరి మధ్య చర్చలు కొలిక్కి రాకుంటే.. ఇరు వర్గాల వాదనలు తాము వింటామని పేర్కొంది. హైకోర్టు తాజా ఆదేశాల నేపథ్యంలో జగన్ సర్కారు ఎలా స్పందిస్తారన్నది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. కోర్టు పేర్కొన్న దాని ప్రకారం ప్రభుత్వం నిమ్మగడ్డకు వెళ్లాల్సి ఉంది. అందుకు సీఎం జగన్ మొగ్గు చూపుతారా? లేదంటే.. సమావేశానికి సంబంధించి అధికారులు వెళ్లకుండా ఉండేలా మరో పిటిషన్ దాఖలు చేస్తారా? అన్నది ప్రశ్నగా మారింది. ఏమైనా.. మరో మూడు రోజుల్లో ఈ అంశంపై స్పష్టత వస్తుందని చెప్పక తప్పదు.