Begin typing your search above and press return to search.

రూపాయి పతనంపై పార్లమెంటులో కేంద్రం ఏం చెప్పింది?

By:  Tupaki Desk   |   19 July 2022 3:40 AM GMT
రూపాయి పతనంపై పార్లమెంటులో కేంద్రం ఏం చెప్పింది?
X
క్యాలెండర్లో మారే తేదీలతో పోటీ పడుతూ డాలర్ తో రూపాయి మారకం విలువ అంతకంతకూ తగ్గిపోతున్న వైనం కొత్త ఆందోళనలకు గురి చేస్తోంది. గతంలో ఎప్పుడూ లేనంత దారుణంగా రూపాయి బలం బలహీనమవుతోంది. దీనిపై పెద్ద ఎత్తున ఆందోళనతో పాటు.. దీనికి సరైన సమాధానం చెప్పలేక కేంద్రం కిందా మీదా పడుతోంది. తాను గుజరాత్ ముఖ్యమంత్రిగా ఉన్న వేళలో.. రూపాయి పతనంపై మోడీ చేసిన వ్యాఖ్యల్ని ప్రస్తావిస్తూ.. ఇప్పుడు అంతకంతకూ తగ్గిపోతున్న రూపాయి విలువపై పలువురు ప్రశ్నల వర్షం కురిపిస్తున్నారు.

రూపాయి పతనం ఈ స్థాయిలో చూడలేదంటూ మండిపడుతున్నారు. ఇలాంటి వేళ.. పార్లమెంటులో దీనికి సంబంధించిన ప్రశ్నల్ని సంధించారు లోక్ సభ ఎంపీలు. భారత కరెన్సీ పతనం మీద వివరాలు వెల్లడించాలన్న ఎంపీలు దీపక్ బైజ్.. విజయ్ వసంత్ ల ప్రశ్నలకు సమాధానంగా భారత ప్రభుత్వం అధికారిక వివరాల్ని వెల్లడించింది. జూన్ 30వ తేదీకి ఒక డాలర్ కు సమానంగా రూ.78.94గా ఉందని పేర్కొంది. ఈ సమాధానం చెప్పిన సోమవారం రికార్డు స్థాయిలో డాలర్ తో రూపాయి మారకం విలువ రూ.80కు చేరుకొని.. ఆ తర్వాత నాలుగైదు పైసలు తగ్గటం గమనార్హం.

2014 నుంచి పరిశీలిస్తే రూపాయిల మారకం విలువ ఇప్పటివరకు 25 శాతం పడిపోయినట్లు పేర్కొన్నారు. గడిచిన ఎనిమిదేళ్లలో భారత రూపాయి విలువ రూ.16.08 (జూన్ 30 లెక్కలోకి తీసుకుంటే.. అదే జులై 18ను పరిగణలోకి తీసుకుంటే అది మరింత ఎక్కువగా ఉంటుంది) పడినట్లుగా వెల్లడించింది. పడిపోయిన రూపాయి మారకం విలువను శాతంలో చూస్తే.. ఇది 25.39 శాతం క్షీణతకు సమానమని పేర్కొంది.

ఆర్బీఐ లెక్కల ప్రకారం 2014 లో రూపాయి మారకం అమెరికా డాలర్ కురూ.63.33గా ఉండగా.. 2018 డిసెంబరు 31 నాటికి రూ.69.79కు పడిపోయినట్ల పేర్కొన్నారు. 2019 డిసెంబరు 31 నాటికి దీని విలువ రూ.70 మార్కు దాటి పడిపోయిందని చెప్పారు.

రూపాయి విలువ తగ్గిపోవటానికి అంతర్జాతీయ అంశాలు.. రష్యా.. ఉక్రెయిన్ యుద్ధం.. క్రూడాయిల్ ధరలు చుక్కలకు చేరటం లాంటి అంశాలుగా పేర్కొంది. విదేశీ పోర్టు ఫోలియో మదుపరులు భారత ఈక్విటీ నుంచి సుమారు 14 బిలియన్ డాలర్లను వెనక్కి తీసుకున్నట్లుగా పేర్కొన్నారు.

అంతర్జాతీయంగా చూస్తే.. ఒక్క భారత్ రూపాయి మాత్రమే తగ్గలేదని.. బ్రిటిష్ పౌండ్.. జపాన్ యన్.. యూరప్ యూరోలు కూడా భారీగా పతనమైన విషయాన్ని ప్రస్తావిస్తూ.. ఇవన్నీ కూడా రూపాయి కంటే ఎక్కువగా క్షీణించినట్లుగా పేర్కొన్నారు. అంటే.. పౌండ్.. యెన్.. యూరోల విలువ తగ్గితే రూపాయి విలువ కూడా తగ్గొచ్చా? రూపాయి విలువతో ఆయా దేశాలతో పోలిక చేసి చూసుకున్నప్పుడు.. డెవలప్ మెంట్ విషయంలో ఆ దేశాలతో ఎందుకు పోలిక పెట్టుకోమన్న సందేహం మదిలో మెదలక మానదు.