Begin typing your search above and press return to search.

షాకింగ్‌.. ప్రధాని మోడీకి ఉల్లి రైతుల సెగ.. ఏం చేశారంటే!

By:  Tupaki Desk   |   7 March 2023 11:00 AM GMT
షాకింగ్‌.. ప్రధాని మోడీకి ఉల్లి రైతుల సెగ.. ఏం చేశారంటే!
X
పడిపోతున్న ధరలపై తమ నిరసనను తెలపడానికి మహారాష్ట్ర రైతులు వినూత్న చర్యకు దిగారు. మహారాష్ట్రలోని అహ్మద్‌నగర్‌ కు చెందిన రైతుల బృందం ప్రధాని నరేంద్ర మోడీకి ఉల్లిపాయలను పోస్ట్‌ ద్వారా పంపింది. అలాగే విదేశాలకు ఉల్లిపాయల ఎగుమతిపై ఉన్న నిషేధాన్ని ఎత్తివేయాలని రైతులు డిమాండ్‌ చేశారు.

ఉల్లి, ఇతర వ్యవసాయోత్పత్తుల ఎగుమతిపై విధించిన నిషేధాన్ని కేంద్ర ప్రభుత్వం వెంటనే ఎత్తివేయాలని రైతులు డిమాండ్‌ చేస్తున్నారు. నిషేధాన్ని ఎత్తేస్తే అంతర్జాతీయ మార్కెట్‌ కు ఉల్లిని పంపడానికి అవకాశం ఉంటుందని ఉల్లి రైతులు చెబుతున్నారు. అలాగే గత ఏడాది ఉత్పత్తులను విక్రయించిన రైతులకు పరిహారంగా క్వింటాల్‌కు రూ. 1,000 ఇవ్వాలని ఉల్లి రైతులు కేంద్ర ప్రభుత్వాన్ని కోరుతున్నారు.

'ఇన్‌పుట్‌ ఖర్చు చాలా ఎక్కువగా ఉంది. రైతులు... ఎరువులు, పురుగుమందులు, పెట్రోల్, డీజిల్‌ కోసం ప్రపంచ మార్కెట్‌ ధరల ప్రకారం చెల్లించాల్సి వస్తోంది. అయితే, ఉల్లిపాయలను మాత్రం మన దేశ ధరలకు అమ్మాల్సి వస్తోంది' అని ఒక రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

కాగా ఇటీవల మహారాష్ట్రలోని నాసిక్‌ జిల్లాలో ఒక రైతు ఉల్లికి ధర పడిపోవడంతో ప్రభుత్వ విధానాలకు నిరసనగా తన ఉల్లి పంటకు నిప్పుపెట్టిన సంగతి తెలిసిందే.

మహారాష్ట్రలో నాసిక్‌ లోని అతిపెద్ద హోల్‌ సేల్‌ ఉల్లి మార్కెట్‌ అయిన లాసల్‌ గావ్‌ లోని అగ్రికల్చర్‌ ప్రొడ్యూస్‌ మార్కెట్‌ కమిటీ ఆసియాలోనే అతిపెద్దది. ధర పడిపోవడంతో ఉల్లిపాయ సాగుదారులు సంక్షోభంలో చిక్కుకున్నారు. సాగు ఖర్చులు కూడా రాకపోవడంతో తీవ్రంగా ఇబ్బందులు పడుతున్నారు.

దీంతో ఉల్లి రైతుల కష్టాలను కేంద్ర ప్రభుత్వానికి తెలిపేందుకు అహ్మద్‌ నగర్‌ కు చెందిన రైతుల బృందం ఉల్లిపాయలను ప్రధాని నరేంద్ర మోడీకి పోస్టులో పంపింది. ఉల్లి పంట ఎగుమతిపై నిషేధాన్ని ఎత్తివేయాలని డిమాండ్‌ చేశారు.

ఉల్లి ధరలు తగ్గుముఖం పట్టడంతో నాసిక్‌ జిల్లాతో పాటు మహారాష్ట్రలోని రైతులు ఆగ్రహానికి గురై ఆందోళనలకు దిగుతున్నారు.

మహారాష్ట్ర రాజ్య కాండ ఉత్పాదక్‌ సంఘటన (ఎంఆర్‌కేయూఎస్‌).. ఫిబ్రవరి 27న లాసల్‌ గావ్‌ మార్కెట్‌ లో ఉల్లిపాయల వేలాన్ని నిలిపివేసింది. గత వారంలో చందవాడ్‌ జిల్లాలోని ఇతర ప్రాంతాలలో, రాష్ట్రవ్యాప్తంగా ఇలాంటి ఆందోళనలు జరిగాయి.

అలాగే రెండు రోజుల క్రితం నాసిక్‌ జిల్లా నిఫాద్‌ తాలూకాలోని శిరస్‌ గావ్‌ లో ఆగ్రహించిన రైతులు కేంద్ర మంత్రి భారతి పవార్‌ను ఘెరావ్‌ చేశారు. ఉల్లి ఎగుమతులు పెంచామని కేంద్రం చెబుతున్నా ఉల్లి పంటకు ఎందుకు మంచి ధర రావడం లేదని రైతులు ప్రశ్నించారు.



నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.