Begin typing your search above and press return to search.

నీతులు చెప్పే అసద్.. 9 ఏళ్లలో పాతబస్తీకి సాధించిందేంటి?

By:  Tupaki Desk   |   24 Jun 2023 10:00 AM GMT
నీతులు చెప్పే అసద్.. 9 ఏళ్లలో పాతబస్తీకి సాధించిందేంటి?
X
జాతీయస్థాయి లో ఏదైనా పరిణామం చోటు చేసుకున్నంతనే సీన్లోకి వచ్చే మజ్లిస్ అధినేత అసదుద్దీన్ ఓవైసీ మాటల్ని విన్నంతనే గురివింద గుర్తుకు వచ్చేలా చేస్తారు. తాజాగా విపక్షాల భేటీ పై పలు అభ్యంతరాలు వ్యక్తం చేస్తున్న ఆయన.. ఈ సందర్భంగా పలు వ్యాఖ్యలు చేశారు. ఉద్దవ్ ఠాక్రే నాయకత్వం వహిస్తున్న శివసేన లౌకిక పార్టీనా? అన్న ప్రశ్ననే తీసుకోండి. మరి.. అసద్ నిర్వహించే మజ్లిస్ పార్టీ లౌకిక పార్టీనా? అన్న ప్రశ్న ఎదురవుతుంది? దీనికి ఏమని బదులిస్తారు?

నితీశ్ గురించి విమర్శలు చేసే ఆయన.. బిహార్ ముఖ్యమంత్రి కమిట్ మెంట్ గురించి ప్రశ్నిస్తారు. సరే.. ఆయన చెప్పిందే నిజమని భావిద్దాం. మరి.. నితీశ్ కాకుండా ప్రత్యామ్నం ఎవరు? ఆయన మదిలో ఎవరు ఉన్నట్లు? ఆర్టికల్ 370ను రద్దు చేయటానికి కేజ్రీవాల్ మద్దతు తెలపలేదా? అని ప్రశ్నిస్తున్న అసద్.. మరి.. అదే కేజ్రీవాల్ తో కలిసి భుజం.. భుజం రాసుకుపూసు కు తిరుగుతున్న కేసీఆర్ తో అసద్ ఎందుకు కలిసి తిరుగుతున్నట్లు? ఆయన్ను మిత్రుడిగా ఎందుకు అంగీకరిస్తున్నట్లు?

చెప్పే మాటల కు.. చేసే పనుల కు ఏ మాత్రం సంబంధం లేదన్నట్లుగా ఉండే అసద్ లాంటి వారు నీతులు చెబితే ఏం బాగుంటుంది? బాబ్రీ మసీద్ ను కూలదోయటానికి మేం గర్వంగా భావిస్తున్నామని ఉద్దవ్ అన్న పాతమాటల్ని ప్రస్తావిస్తున్న అసద్.. తన సోదరుడు కమ్ తమ పార్టీ ఎమ్మెల్యేగా వ్యవహరిస్తున్న అక్బరుద్దీన్ చేసిన '15 నిమిషాలు అవకాశం ఇస్తే ఈ దేశంలో వారు లేకుండా చేస్తా' అన్న మాటల కు ఈ రోజు వరకైనా పశ్చాత్తాపాన్ని.. క్షమాపణల్ని కానీ చెప్పారా? ఒక దేశం లోని మెజార్టీ ప్రజల్ని కేవలం 15 నిమిషాలు టైమిస్తే తుదముట్టించేస్తానని చెప్పిన తన తమ్ముడి పై ఇప్పటి వరకు అసద్ ఎందుకు చర్యలు తీసుకోలేదు? అన్న ప్రశ్నకు బదులివ్వాలి కదా?

ఇవన్నీ ఒక ఎత్తు. ఈ రోజుకి తనకు రాజకీయంగా జీవనాన్ని అందిస్తున్న హైదరాబాద్ పాత బస్తీ ప్రజల కు అసద్ చేసిందేమిటి? అద్భుతాలు అక్కర్లేదు. గడిచిన తొమ్మిదేళ్ల లో ఆయన పాతబస్తీకి మెట్రో రైలును తీసుకురాలేకపోయారు. ముఖ్యమంత్రికి అత్యంత సన్నిహితుడిగా ఉండే ఓవైసీ.. తనకు అధికారాన్ని కట్టబెట్టే పాతబస్తీ ప్రజల ఫ్యూచర్ కోసం మెట్రో రైలు ను ఎందుకు తేలేకపోయారు? తాను.. తన పార్టీ ప్రాతినిధ్యం వహించే హైదరాబాద్ 7 అసెంబ్లీ నియోజకవర్గాల్లో విద్యుత్ బిల్లుల చెల్లింపులు అత్యంత తక్కువగా ఉండటాన్ని ఎలా సమర్థించుకుంటారు? అంతేనా.. నల్లా బిల్లుల చెల్లింపులు సైతం జరగని తీరుకు ఏమని చెబుతారు?

పాతబస్తీ లో హెల్మెట్ లేకుండా త్రిపుల్స్.. నలుగురు ఒకే బైక్ మీద ప్రయాణించే వారి మీద హైదరాబాద్ పోలీసులు చలానాలు విధించకపోవటాన్ని ఏమంటారు? ఎలా చూస్తారు? ఒకవేళ.. చేసినా తూతూ మంత్రంగా మాత్రమే చేసే చర్యల కు సమాధానం ఏమిటి? జాతీయ రాజకీయాల గురించి తరచూ సుభాషితాలు పలికే అసద్.. ముందు తాను గెలిచిన ఏడు అసెంబ్లీ నియోజకవర్గాల్లోని డెవలప్ మెంట్ గురించి మాట్లాడాల్సిన అవసరం ఉంది. అంతకు మించి వాటి ని బాగు చేయాలన్న ఫోకస్ మరింత ముఖ్యం. ముందు.. ఆ పని చేసి దేశం గురించి.. దేశ రాజకీయాల గురించి లెక్చర్లు ఇస్తే బాగుంటుంది.