Begin typing your search above and press return to search.

మాజీ జేడీ పిటిష‌న్ కు జ‌గ‌న్ ఏం చెప్పారంటే..?

By:  Tupaki Desk   |   22 Aug 2021 4:30 PM GMT
మాజీ జేడీ పిటిష‌న్ కు జ‌గ‌న్ ఏం చెప్పారంటే..?
X
మాజీ జేడీ అంటే.. జ‌గ‌న్ ను అరెస్ట్ చేసిన సీబీఐ మాజీ జేడీ ల‌క్ష్మీనారాయ‌ణే క‌దా. ల‌క్ష్మీనారాయ‌ణ పిటిష‌న్ దాఖ‌లు చేస్తే.. జ‌గ‌న్ ఎందుకు కౌంట‌ర్ దాఖ‌లు చేయాలి? ఎందుకంటే.. ఏపీ సీఎంగా ఉన్నారు కాబట్టి మాజీ జేడీ ల‌క్ష్మీనారాయ‌ణే కాదు.. మ‌రెవ‌రు ఏపీ స‌ర్కారును వివ‌ర‌ణ కోరుతూ పిటిష‌న్ దాఖ‌లు చేసినా.. దానికి సీఎం హోదాలో ఉన్న కార‌ణంగా జ‌గ‌న్ నుంచి కౌంట‌ర్ దాఖ‌లు కావాల్సిందే. ఇప్పుడిదే జ‌రిగింది. విశాఖ ఉక్కు ప్రైవేటీక‌ర‌ణ వ్య‌వ‌హారంపై ల‌క్ష్మీనారాయ‌ణ పిటిష‌న్ దాఖ‌లు చేసిన సంగ‌తి తెలిసిందే. దీనిపై శ‌నివారం జ‌రిగిన విచార‌ణ సంద‌ర్భంగా జ‌గ‌న్ స‌ర్కారు త‌ర‌ఫున ప‌రిశ్ర‌మ‌ల శాఖ ముఖ్య కార్య‌ద‌ర్శి హైకోర్టులో కౌంట‌ర్ దాఖ‌లు చేశారు.

ఈ కౌంట‌ర్ లో జ‌గ‌న్ స‌ర్కారు ఏం చెప్పింద‌న్న విష‌యానికి వ‌స్తే.. ప్రైవేటీకరణ నిర్ణయంపై పునరాలోచించి, సంస్థను లాభాలబాట పట్టించేందుకు కేంద్రం ప్రత్యామ్నాయాలను అన్వేషించాల్సిన అవసరం ఉందని జ‌గ‌న్ స‌ర్కారు అభిప్రాయ‌ప‌డింది. విశాఖ ఉక్కు పరిశ్రమ కార్యకలాపాల్ని కొనసాగనివ్వాలని.. ఇన్‌పుట్‌ ఖర్చును తగ్గించేందుకు క్యాప్టివ్‌ ఇనుప ఖనిజ (ఐరన్‌ ఓర్‌) గనులను కేటాయించాలని కోరింది. ఆర్థికపరమైన పునర్‌వ్యవస్థీకరణ చర్యలను చేపట్టాలని సూచిస్తూ సీఎం జగన్ కేంద్రానికి లేఖలు రాశారని తెలిపింది. రాష్ట్ర ప్రభుత్వం లేవనెత్తిన అంశాలను ఎక్కడా పరిగణనలోకి తీసుకున్నట్లు కేంద్రం దాఖలు చేసిన అఫిడవిట్‌లో వెల్లడించలేదని తెలిపింది.

విశాఖ స్టీల్ ప్లాంట్ దేశంలో సముద్ర తీరాన ఉన్న మొదటి సమీకృత ఉక్కు కర్మాగారం అనీ.. రాష్ట్రంలోని అతి పెద్ద ప్రభుత్వ రంగ పరిశ్రమ అని కూడా జ‌గ‌న్ స‌ర్కారు ప్రస్తావించింది. 20వేల మందికిపైగా నేరుగా ఉద్యోగాలను, అనేక వేల మందికి పరోక్షంగా ఉపాధి కల్పిస్తోందన్నారు. పరిశ్రమ ఏర్పాటు కోసం 32 మంది ప్రాణత్యాగం చేశారని తెలిపిన ప్ర‌భుత్వం.. ప్రస్తుతం విశాఖ ఉక్కు పరిశ్రమకు 7.3 మిలియన్‌ టన్నుల ఉత్పత్తి సామర్థ్యం ఉందని తెలిపింది. విశాఖ ఉక్కు పైవేటీకరణ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ ఏపీ అసెంబ్లీలో తీర్మానం చేసిన విష‌యాన్ని కూడా గుర్తు చేసింది. పరిశ్రమను లాభాల బాట పట్టించేందుకు ముఖ్యమంత్రి చేసిన సూచనలను కేంద్రం పరిగణనలోకి తీసుకోవాలని కోరింది. విశాఖ ఉక్కు పరిశ్రమకు ముడి ఇనుము గనులను కేటాయిస్తే ఉత్పత్తి వ్యయం తగ్గి నెలకు రూ.200 కోట్ల లాభాల్ని ఆర్జించగలుగుతుందని అఫిడవిట్‌లో ప్రభుత్వం తెలిపింది. లక్ష్మీనారాయ‌ణ పిటిష‌న్ ద్వారా క‌ర్మాగారాన్ని కాపాడుకునే దిశ‌గా జ‌గ‌న్ స‌ర్కారు రాసిన లేఖ‌, దానికి కేంద్రం స్పందించని వైనం కోర్టు సాక్షిగా బ‌య‌ట‌ప‌డింద‌న్న చ‌ర్చ జ‌రుగుతోంది.