Begin typing your search above and press return to search.

గూగుల్ లో తానేం వెతికింది చెప్పిన ఏపీ హైకోర్టు జడ్జి!

By:  Tupaki Desk   |   31 Dec 2020 4:30 AM GMT
గూగుల్ లో తానేం వెతికింది చెప్పిన ఏపీ హైకోర్టు జడ్జి!
X
గడిచిన కొద్దికాలంగా ఏపీలో చోటు చేసుకుంటున్న పరిణామాల గురించి తెలిసిందే. హైకోర్టు తీరుపై ఏపీలోని జగన్ ప్రభుత్వం కొన్ని ఆరోపణలు చేయటం తెలిసిందే. అదే సమయంలో.. తమపై చేస్తున్న విమర్శలపై ఏపీ హైకోర్టు ఘాటుగానే స్పందిస్తోంది. ఇంతవరకు తమకు ఎదురుకాని అనుభవం ఏపీలో ఎదురవుతుందన్న వ్యాఖ్యను చేస్తున్నారు. సుప్రీం కోర్టు నెంబరు 2 జడ్జిగా ఉన్న జస్టిస్ రమణపై సీఎం జగన్ రాసిన లేఖ పెను సంచలనంగా మారటం తెలిసిందే.

దీనిపై భారీ ఎత్తున చర్చ జరిగింది. ఇదిలా ఉంటే.. ఒక పిటిషన్ విచారణ సందర్భంగా ఏపీ హైకోర్టు జడ్జి జస్టిస్ రాకేశ్ కుమార్ చేసిన వ్యాఖ్య ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. సుప్రీంకోర్టు జడ్జిలపై లేఖ రాసేంతవరకు సీఎం జగన్మోహన్ రెడ్డి గురించి తనకు పెద్దగా తెలియది.. ఆ లేఖ తర్వాత ఆయన గురించి తెలుసుకోవాలన్న ఆసక్తి కలిగిందని పేర్కొన్నారు. ఈ సందర్భంగా తానేం చేసింది చెప్పారు.

ఆయనేం చెప్పారన్నది మా మాటల్లో కాకుండా.. ఆయనేం అన్నారన్న విషయాన్ని కొన్ని ప్రముఖ మీడియా సంస్థలు ప్రచురించిన వెర్బాటమ్ (ఏమన్నారో అవే మాటల్ని వారి మాటల్లో కోట్ చేసి రాయటం)ను మీకు ఇస్తున్నాం. ఇదంతా ఎందుకంటే.. ఇప్పుడున్న డిజిటల్ ప్రపంచంలో.. ఎవరికి వారు అసలుకు కొంత పైత్యం రంగరించి కీలక సమాచారాన్ని అందిస్తున్నారు. దీని వల్ల అనవసరమైన కన్ఫ్యూజన్ పెరుగుతోంది. దీని నివారణ కోసం.. ఉన్నది ఉన్నట్లుగా.. ఏం చెప్పారో.. అది మాత్రమే పాఠకులకు సమాచారం అందించాలన్నది మా ప్రయత్నం.

ఇందులో భాగంగా ఏపీ హైకోర్టు జడ్జి జస్టిస్ రాకేశ్ కుమార్ మాటల్లో చెబితే (ముఖ్య మీడియా సంస్థల్లో పేర్కొన్నది యథాతధంగా ఇస్తున్నాం) ‘‘గూగుల్‌లో ఖైదీ నం. 6093 అని కొడితే సమాచారం వస్తుందని చెప్పారు. నేను అలాగే చేశాను. ఆ వివరాలు ఉత్తర్వుల్లో పొందుపరుస్తున్నాను. రాష్ట్ర సీఎం 11 సీబీఐ, ఆరు ఈడీ, మరో 18 ఐపీసీ కేసుల్లో నిందితుడని తెలిసింది. ఈ కేసులు చాలా కాలం నుంచి పెండింగ్‌లో ఉన్నాయి. కేసుల విచారణ వేగవంతం అయిన తరువాత, ఇందులో చాలా కేసుల్లో రాష్ట్ర పోలీసులు వివిధ కారణాలతో దర్యాప్తు చేయకుండా మూసివేత నివేదిక వేశారు. దీని బట్టే రాష్ట్రంలో రూల్‌ ఆఫ్‌ లా అమలు చేయకుండా రాష్ట్ర డీజీపీ ప్రభుత్వం ఆదేశించినట్లు పనిచేస్తున్నారని తెలుస్తోంది’’ అని ఒక ప్రధాన మీడియా సంస్థ పేర్కొంటే.. మరో ప్రముఖ మీడియా సంస్థ ఏమని పేర్కొన్నదంటే..

‘‘ముఖ్యమంత్రి రాసిన లేఖ ప్రచురితమయ్యే వరకు ఆయన గురించి నాకు పెద్దగా తెలియదు. ఆ లేఖ తర్వాత ఆయన గురించి తెలుసుకోవాలన్న ఉత్సుకత పెరిగింది. గూగుల్ లో ఖైదీ నంబరు 6093 అని కొడితే చాలా సమాచారం వస్తుందని ఎవరో చెప్పారు. నేను అలా చేసేసరికి దిగ్భ్రాంతి కలిగించే సమాచారం లభించింది. నేను డౌన్ లోడ్ చేసిన సమాచారాన్ని ఇక్కడ పొందుపరుస్తున్నాను. ఆ తర్వాత కొంత సాధికారిక సమాచారం .
తెప్పించుకున్నాను. జగన్ పై 11 సీబీఐ కేసులు, 6 ఈడీ కేసులు, ఐపీసీ సెక్షన్ కింద నమోదు చేసిన మరో 18 కేసులు ఉన్నట్లుగా తెలిసింది. ఆ కేసులన్నీ దీర్ఘకాలంగా పెండింగ్ లో ఉండగా సుప్రీంకోర్టు ఉత్తర్వులు వెలువడిన తర్వాత ఒకరోజు వాటిలో కొన్ని తప్పుడు కేసులని.. వాస్తవాల నమోదులో పొరపాటు జరిగిందని, చర్యలు నిలిపివేశామన్న కారణాలతో పోలీసులు వాటిని మూసేశారు. డీజీపీ సారథ్యంలోని పోలీసులు రాష్ట్ర ప్రభుత్వ కనుసన్నల్లో ఎలా పని చేస్తున్నారో చెప్పటానికి ఇదే నిదర్శనం’’