Begin typing your search above and press return to search.

డొనాల్డ్ ట్రంప్ ఓటమికి అసలు కారణాలేంటి?

By:  Tupaki Desk   |   8 Nov 2020 7:50 AM GMT
డొనాల్డ్ ట్రంప్ ఓటమికి అసలు కారణాలేంటి?
X
కర్ణుడి చావుకు కారణాలు ఎన్నో అన్నట్టుగా ట్రంప్ రెండోసారి అమెరికా అధ్యక్షుడిగా గెలవలేక ఓటమిపాలయ్యారు. ఒకసారి అమెరికా అధ్యక్షుడైన వారంతా రెండోసారి కూడా అయ్యారు. తమ పాలనదక్షతతో ప్రజల మెప్పు పొంది ఇలా అయ్యారు. అయితే ట్రంప్ మాత్రం ఒక్కసారికే తీవ్ర విమర్శలు ఎదుర్కొని ఎన్నికల్లో ఓడిపోయారు. నాలుగేళ్లకే పరిమితమయ్యారు. ఇంతకీ ట్రంప్ ఓటమికి అసలు కారణాలేంటి? ట్రంప్ ఎందుకు ఓడిపోయాడంటే ఆయన స్వయంకృతాపరాధమే కనిపిస్తోంది.

ప్రధానంగా చూస్తే ట్రంపు దుందుడుకు స్వభావమే ఆయన కొంపముంచింది. అమెరికా ఫస్ట్ నినాదం, చైనాపై దూకుడు.. ఇరాన్ పై దండయాత్ర, కీప్ అమెరికా గ్రేట్, లాంటివి ట్రంప్ కు వర్కవుట్ కాలేదు. అవే నినాదాలు ఆయనకు ఓటమిని తెచ్చిపెట్టాయి. ఎగ్జిట్ పోల్స్ చెప్పినట్టు ట్రంప్ ఎగ్జిట్ అయిపోయాడు. ట్రంప్ చేసిన తప్పిదాలే ఆయన కొంప ముంచాయంటారు.

ట్రంప్ ఫెయిల్యూర్ ఖచ్చితంగా ప్రజలు అనుభవించారు. కరోనా కట్టడిలో వైఫల్యం.. దాన్నుంచి లాక్డౌన్.. దేశ ఆర్థిక వ్యవస్థ కుదేలుకావడానికి కారణమైంది. భారీగా ఉద్యోగాలు పోయాయి. కంపెనీలు రోడ్డున పడ్డాయి. ఉద్యోగాలు కోల్పోయి అమెరికన్లు ఆర్థిక ఇబ్బందులుపడ్డారు. ట్రంప్ వలసవాదులపై నిషేధం కూడా నిరుద్యోగిత మరింత పెరగడానికి కారణమైంది.వీటన్నింటిని అరికట్టడం.. మెరుగైన పాలన అందించడంలో క్లిష్ట సమయంలో ట్రంప్ పాలన వైఫల్యం కొట్టొచ్చినట్టు కనిపించింది. మొత్తంగా అన్నింట్లోనూ ఉదాసీనత.. మొండితనం.. ముక్కుసూటితనమే ట్రంప్ ఓటమికి కారణంగా విశ్లేషకులు చెబుతున్నారు.

బిజినెస్‌ మ్యాన్‌గా ఎన్నో విజయాలు సాధించిన ట్రంప్‌ ఎలాంటి రాజకీయ అనుభవం లేకుండా అధ్యక్షుడిగా ఎన్నికయ్యారు. దీంతో ఆయన కొన్ని విషయాల్లో నిర్ణయాలు తీసుకోవడం వివాదాస్పదమైంది. ఐరోపా, ఆస్ట్రేలియా, జపాన్‌ వంటి దేశాలో అమెరికాతో కలిసి పనిచేసేవి. కానీ ట్రంప్‌ ఐరోపా దేశాలను దూరంగా పెట్టడంతో వ్యాపారాల్లో నష్టాలు సంభవించాయి. ఐరోపా దేశాల నుంచి వచ్చే స్టీల్‌, ఆటోమొబైల్‌ వంటి వాటిపై ఈ ప్రభావం భారీగా చూపాయి. ఇక నాటో వంటి కూటముల్లోని దేశాలను చిన్నచూపు చూడడం వంటి చర్యలు ట్రంప్‌ ఓటమికి కారణాలుగా చెప్పుకుంటున్నారు.

గత సంవత్సరంలో నల్లజాతీయుడు జార్జిప్లాయిడ్‌ హత్య ఘటనపై దేశవ్యాప్తంగా నిరసన వ్యక్తమైంది. ట్రంప్‌ గెలిచినప్పటి నుంచి నల్లజాతీయులకు వ్యతిరేకంగానే ఉంటున్నారు. ఈ సంఘటనను సామరస్యంగా పరిష్కరించాల్సింది పోయి వివాదానికి ఆజ్యం పోశారు. ఆందోలనకారులను దేశీయ ఉగ్రవాదులంటూ కామెంట్‌ చేయడంతో నల్లజాతీయులు ట్రంప్‌పై ఆగ్రహం వ్యక్తం చేశారు. దీంతో ఈ ఆందోళన వైట్‌హౌజ్‌ వరకు వెళ్లడంతో ఆయన బంకర్‌లో దాక్కోవాల్సిన పరిస్థితి వచ్చింది. అప్పటి నుంచి ట్రంప్‌పై నల్లజాతీయులు వ్యతిరేకంగానే ఉన్నారు.

ట్రంప్ గెలిచినప్పటి నుంచి ట్రంప్‌ ఒక ప్రత్యేక వ్యక్తిగా పేరుతెచ్చుకునా వివాదాస్పదుడనే ముద్ర పడింది. ఆయన చేసే ప్రసంగాలే పెద్దపెద్ద వివాదాలకు దారి తీశాయి. ఇక ప్రతీ విషయాన్ని సామరస్యంగా కాకుండా ప్రాక్టికల్‌గా ఆలోచించడంతో ఇతరులకు ఇబ్బందిగా మారేది. దేశ ప్రజల బాగోగుల కంటే కార్పొరేట్‌ వ్యవస్థపైనే ఆయన ఎక్కువగా ఆలోచించేవారు. దీంతో సగటు అమెరికన్‌కు ట్రంప్‌ వ్యవహార శైలి నచ్చలేదు. అందుకే ఆయనను మొదటి నుంచి వ్యతిరేకిస్తున్నారు. ఈ ఫలితమే ఆయనను అధ్యక్ష గద్దె నుంచి దింపేలా చేసింది.

చైనాలో పుట్టిన కరోనా వైరస్‌ ఆ తరువాత ప్రపంచవ్యాప్తంగా విస్తరించింది. అయితే ఈ వైరస్‌ పుట్టిన కొన్ని నెలల తరువాత అమెరికాలో ప్రవేశించింది. అంతకుముందే చైనాపై వైరస్‌ను కట్టడి చేయలేదని విమర్శలు చేసిన ట్రంప్‌ తన దేశం దగ్గరికి వచ్చే సరికి ఎలాంటి జాగ్రత్తలు తీసుకోలేదు. పైగా మాస్క్‌ కూడా పెట్టుకోనవసరం లేదనట్లుగా వ్యవహరించారు. కానీ చివరికి ట్రంప్‌నకే వైరస్‌ తాకింది. అయితే వైట్‌హౌజ్‌లోని మహమ్మారి వ్యాధుల వ్యాప్తి సమయంలో స్పందించే అత్యవసర బృందాన్ని 2018లో రద్దు చేశారు. ఇది కరోనా విషయంలో పెద్ద తప్పిదమైనట్లయింది. మరోవైపు అంటువ్యాధుల నిపుణుడైన అంతోనీ ఫౌచీని ట్రంప్‌ తరుచూ విమర్శించసాగారు. పార్టీలతో సంబంధం లేకుండా అమెరికాలో ఆరుగురు అధ్యక్షుల వద్ద పౌచీ పనిచేశారు. ఆయనకు అభిమాన సంఘాలున్నాయంటే అతిశయోక్తి కాదు. దీంతో ఇది కూడా వ్యతిరేకత వచ్చిందంటున్నారు.

ఇలా ట్రంప్ కు రాజకీయ అనుభవం లేకపోవడం.. దూకుడైన నిర్ణయాలు.. ఎవ్వరూ చెప్పినా వినేవ్యక్తి కాకపోవడం.. అస్తవ్యస్థ పాలన నిర్ణయాలు.. ప్రజల ప్రాణాలకు రక్షణ చర్యలు చేపట్టకపోవడంతో ఈ పరిస్థితి తెచ్చుకున్నారు.చివరకు అమెరికా ప్రజల చేతిలో ఓడిపోయారు.