Begin typing your search above and press return to search.

దీక్షతో పవన్ ఏమి సాధిస్తారు ?

By:  Tupaki Desk   |   12 Dec 2021 8:30 AM GMT
దీక్షతో పవన్ ఏమి సాధిస్తారు ?
X
విశాఖపట్నం స్టీల్ ఫ్యాక్టరీ ప్రైవేటీకరణ నిర్ణయానికి నిరసనగా జనసేన అధినేత పవన్ కల్యాణ్ ఈరోజు దీక్షకు కూర్చోబోతున్నారు. మంగళగిరిలోని తమ పార్టీ కార్యాలయంలో ఉదయం 10-సాయంత్రం 5 గంటల మధ్య దీక్ష చేయబోతున్నారు. అంతా బాగానే ఉందికానీ పవన్ దీక్ష వల్ల రాష్ట్రానికి జరిగే ఉపయోగం ఏమిటి ? అనేదే ఎవరికీ అర్ధం కావటంలేదు. తన పార్టీ కార్యాలయంలో పవన్ దీక్ష చేస్తే ఏమవుతుంది ? ఎక్కడైనా పబ్లిక్ ప్లేసులో దీక్ష చేస్తే మామూలు జనాలు కూడా పెద్దఎత్తున పార్టిసిపేట్ చేసే అవకాశం ఉంది.

పబ్లిక్ ప్లేసులో కాకపోయినా కనీసం వైజాగ్ లో స్టీల్ ప్లాంట్ కార్మికులు, ఉద్యోగుల సంఘాల నేతలు దీక్షలు చేస్తున్న దగ్గరే పవన్ దీక్షకు కూర్చున్నా ఎఫెక్టుంటుంది. ఎలాగంటే ఉత్తరాంధ్రలోని జనాలు కనీసం వైజాగ్ లోని జనాలు, ప్రజాసంఘాలు, ఇతర పార్టీల నేతలయినా పవన్ తో పాటు దీక్షలోపాల్గొనే అవకాశాలుండేవి. ఇటు పబ్లిక్ ప్లేసులోను కాకుండా అటు వైజాగ్ లోను కాకుండా మధ్యలో తన పార్టీ కార్యాలయంలో దీక్ష చేయటం వల్ల ఎలాంటి ఉపయోగం ఉండదని అందరికీ తెలుసు.

ఇక్కడ గమనించాల్సిన విషయం ఏమిటంటే వైజాగ్ స్టీల్ ఫ్యాక్టరీని ప్రైవేటుపరం చేయాలని నిర్ణయం తీసుకున్నది బీజేపీ నేతృత్వంలోని ఎన్డీయే ప్రభుత్వం. బీజేపీకి జనసేన మిత్రపక్షం. వైజాగ్ స్టీల్ ఫ్యాక్టరీ ప్రైవేటీకరణను పవన్ నిజంగానే వ్యతిరేకిస్తుంటే ఢిల్లీకి వెళ్ళి ప్రధానమంత్రి నరేంద్రమోడితో ఎందుకు మాట్లాడకూడదు ? కాదు కూడదని మోడి అన్నపుడు రాష్ట్ర ప్రయోజనాల కోసమని బీజేపీతో పొత్తును పవన్ ఎందుకు తెంచుకోకూడదు ?

ఇలాంటి పనులు చేస్తే పవన్ను జనాలు కాస్తయినా నమ్ముతారు. అంతేకానీ వైజాగ్ స్టీల్స్ ప్రైవేటీకరణతో ఎలాంటి సంబంధంలేని రాష్ట్రప్రభుత్వాన్ని నిందించటంలోనే పవన్ చిత్తశుద్ది అర్ధమైపోతోంది. మోడిని నిలదీయలేక జనాలను మోసం చేయటంలో భాగంగా జగన్మోహన్ రెడ్డిని పవన్ తప్పుపడుతున్నారు. ఇపుడు చేస్తున్న దీక్ష కూడా రాష్ట్రప్రభుత్వ వైఖరికి నిరసనగానే కానీ మోడి నిర్ణయానికి వ్యతిరేకంగా కాదని అందరు గుర్తించాలి.

మోడి నిర్ణయం మారాలంటే ఢిల్లీలో వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా రైతుసంఘాలు ఉద్యమించినట్లుగా అన్నీ పార్టీలు కలవాలి. రాష్ట్రంలోని అన్నీ పార్టీలు కలవటం అయ్యేపని కాదు. పైగా రాజకీయంగా ఏపీని మోడి ఎప్పుడో వదిలేసుకున్నారు. రాష్ట్రానికి ఎంతచేసినా, ఏమీ చేయకపోయినా బీజేపీ బలపడేదేమీ లేదని మోడికి ఎప్పుడో అర్ధమైపోయింది. అందుకనే ఏపీ ప్రయోజనాలను వరుసగా దెబ్బ కొడుతున్నారు. కేంద్రంలోని తన సీటుకే ఎసరొస్తుందని మోడి భయపడితే మాత్రమే ఏపీ ప్రయోజనాల గురించి ఆలోచిస్తారు. ఎంత వీలైతే అంత తొందరగా ఆపని జరగాలని మనం కోరుకోవాలంతే.