Begin typing your search above and press return to search.

కమ్మలు రగులుతున్నారు... ఏం చేయబోతున్నారు...?

By:  Tupaki Desk   |   27 Aug 2022 2:30 PM GMT
కమ్మలు రగులుతున్నారు... ఏం చేయబోతున్నారు...?
X
కమ్మ సామాజికవర్గం అంటే అతి బలమైన వర్గంగా సమాజంలో ఉంది. వారి ఓటింగ్ శాతం ఎంత అన్నది కాదు కానీ వారి టాలెంట్ ఇక్కడ చర్చ. వారు అన్ని రంగాల్లో కీలకంగా ఉన్నారు. వారు ఏ రంగంలో లేరు అన్న ప్రశ్న మాత్రమే వేసుకోవాలి. స్వాతంత్రానికి పూర్వం ఉద్యమంలో కూడా వారు కనిపిస్తారు. ఇక స్వాతంత్రం వచ్చాక వారు ప్రజల తరఫున పోరాడే బాధ్యతలను తీసుకున్నారు. అలా కనుక చూస్తే ఎక్కువ మంది నాడు కమ్యూనిస్టు పార్టీలలో కనిపించారు.

ఉమ్మడి ఏపీలో కాంగ్రెస్ కి ధీటుగా కమ్యూనిస్టులు కూడా అధికారం కోసం పోటీ పడిన సందర్భాలు మొదట్లో ఉన్నాయి. ఆ తరువాత కమ్యూనిస్టు పార్టీ చీలిపోవడంతో కాంగ్రెస్ లో కమ్మలు సర్దుకున్నారు. అయితే ఎంత చేసినా అక్కడ రెడ్లదే ఆధిపత్యం. తమకు ద్వితీయ స్థానమే అన్న అసంతృప్తి వారికి ఉంది. దాని నుంచి పుట్టిందే తెలుగుదేశం పార్టీ అనుకోవాలి. వారి వ్యూహం పక్కాగా ఫలించి టీడీపీ ద్వారా ముఖ్యమంత్రి పీఠం దక్కించి. ఎన్టీయార్ చంద్రబాబు జమానాలలో జాతీయ స్థాయిలో కూడా కీర్తిని గడించి అంతటా విస్తరించారు.

అయితే 2000 తరువాత ఉమ్మడి ఏపీలో జరిగిన అనేక పరిణామాల వల్ల కమ్మలకు ఇబ్బంది ఏర్పడింది. ముఖ్యంగా తెలంగాణా ఉద్యమం వల్ల తెలంగాణాలో రాజకీయ అస్థిత్వం దెబ్బతింది. ఇక వైఎస్సార్ కాంగ్రెస్ సీఎం అయ్యాక టీడీపీకి పెను సవాల్ ఎదురైంది. దాని వల్ల కూడా ఆ పార్టీని ఎక్కువగా అంటిపెట్టుకుని ఉన్న కమ్మలకు ఇబ్బంది వచ్చిపడింది. ఈలోగా రాష్ట్ర విభజన జరిగింది. తొలిసారి అధికారంలోకి టీడీపీ వచ్చి అమరావతి రాజధాని నిర్మాణం చేపట్టేందుకు అడుగులు వేసింది.

అదే విధంగా మరింతకాలం ఏపీలో పవర్ లో టీడీపీ ఉంటుందనుకునేలోగానే వైసీపీ రూపంలో భారీ సవాల్ ఎదురైంది. ఇక టీడీపీ చరిత్రలో ఎన్నడూ లేని విధంగా దారుణమైన ఓటమి కూడా వరించింది. గత మూడేళ్ళూఅ చూస్తే అమరావతి మీద రాజకీయ రచ్చ సాగడం, ప్రత్యేకించి కమ్మలను టార్గెట్ చేయడంతో వారు రగిలిపోతున్నారు. మరోవైపు తాము రాజకీయంగా ఆశ్రయం అనుకున్న టీడీపీ ఎత్తిగిల్లలేకపోవడం కూడా కలవరం కలిగిస్తోంది.

ఈ నేపధ్యంలో వైసీపీకి చెందిన కొందరు నాయకులు కులం పేరుతో కామెంట్స్ చేయడం తమనే టార్గెట్ చేయడంతో కమ్మలు రగిలిపోతున్నారు. దాంతో తాజాగా గుంటూరులో ఒక సమావేశం ఏర్పాటు చేసి మరీ తమ సత్తా చూపిస్తామని గట్టి ప్రతిన పూనారు. ఏపీలో తమ సామాజిక వర్గం మీద మూడేళ్ళుగా దుష్ప్రచారం సాగుతోందని కమ్మలు మండిపడుతున్నారు.

తాజాగా గుంటూరులో కాకతీయ సేవా సమాఖ్య నిర్వహించిన కమ్మ కులస్తుల సమావేశానికి నాలుగు రాష్ట్రాలకు చెందిన కమ్మ సంఘాల నాయకులు హాజరవడం విశేషం. వారు తమ సామాజికవర్గం అభ్యున్నతితో పాటు ఏపీలో జరుగుతున్న సామాజిక రాజకీయ కార్యకలాపాల మీద కూడా చర్చించినట్లుగా తెలుస్తోంది. ఇక వైసీపీకి చెందిన హిందూపురం ఎంపి గోరంట్ల మాధవ్ వ్యవహారం కూడా ఇదే సమావేశంలో చర్చించారన్ చెబుతున్నారు.

ఈ సందర్భంగా ఈ మీటింగ్ ఒక స్పష్టమైన సందేశాన్ని పంపించింది. కమ్మ కులం ఏ రాజకీయ పార్టీకి, ఏ ఇతర సామాజిక వర్గాలకు వ్యతిరేకం కాదని పేర్కొనడం విశేషం. అయితే హిందూపురం ఎంపీ తానుగా నగ్నంగా కనిపించి దానికి కమ్మ కులస్థులను విమర్శించడం దారుణమని కమ్మ నాయకులు అన్నారు. కమ్మ సామాజిక వర్గం ఎపుడూ సామాజ హితానికి ఉపయోగపడుతుంది తప్ప వేరేదీ కాదని కూడా చెప్పడం విశేషం. గత కొన్ని శతాబ్దాలుగా కమ్మ సామాజిక వర్గం వారు ప్రజల కోసం సమాజం కోసం ఎన్నో మంచి కార్యక్రమాలు చేశారని పేర్కొనడం కూడా గమనార్హం.

ప్రస్తుతం ఏపీలో జరుగుతున్న పరిణామాల పట్ల కమ్మ కులస్థులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఏకంగా ఉన్నత స్థానాలలో ఉన్న వారే కులాన్ని టార్గెట్ చేసి మాట్లాడుతున్నారని కూడా అంటున్నారు. అలాగే సమాజం నుంచి కమ్మలను వేరు చేయాలని భారీ ఒక కుట్ర సాగుతోందని కూడా అభిప్రాయపడుతున్నారు. మరి దీనికి తగిన విధంగా కౌంటర్ ఇవ్వకపోతే తమ కులానికే నష్టమని కూడా వారు భావిస్తున్నారు. మొత్తానికి చూస్తే ఏపీలో కమ్మలు రగులుతున్నారు. తమ పూర్వ వైభవానికి వారు గట్టిగా ప్రతిన పూనుతున్నారు. మరి రానున్న రోజుల్లో వారు ఏం చేయబోతున్నారు అన్నది మాత్రం ఆసక్తికరమే అంటున్నారు.