Begin typing your search above and press return to search.

పొత్తుల‌ పై టీడీపీ నేత‌లు ఏమంటున్నారు? వారి ఆలోచ‌న ఏంటి?

By:  Tupaki Desk   |   8 May 2022 3:12 AM GMT
పొత్తుల‌ పై టీడీపీ నేత‌లు ఏమంటున్నారు?  వారి ఆలోచ‌న ఏంటి?
X
ఔను! రాజ‌కీయ పొత్తుల గురించి.. ఇప్పుడు ప్ర‌ధాన ప్ర‌తిప‌క్షం టీడీపీలో ఆస‌క్తిక‌ర చ‌ర్చ సాగుతోంది. గ‌త ఎన్నిక‌ల‌కు ముందు .. ఎలాంటి ప‌రిస్థితి ఉన్నా.. ఇప్పుడు పార్టీలో మెజారిటీ నాయ‌కులు పొత్తులు కోరుకుంటున్నారు. ఇదే విష‌యంపై ఇటీవ‌ల పార్టీ అధినేత‌ చంద్ర‌బాబునాయుడు నిర్వ‌హించిన టెలీ కాన్ఫ‌రెన్స్‌లో.. చాలా మంది నాయ‌కులు.. పొత్తుల‌కు ఇష్ట‌ప‌డ్డార‌నేది తెలిసిందే. ఇలా.. పార్టీలో కీల‌క నేత‌ల నుంచితీసుకున్న అబిప్రాయాల త‌ర్వాతే..చంద్ర‌బాబు పొత్తుల‌పై కొన్ని సంకేతాలు ఇచ్చి ఉంటార‌ని కూడా అంటున్నారు.

తాజాగా చంద్ర‌బాబు తూర్పుగోదావ‌రిలో మాట్లాడుతూ.. వ‌చ్చే ఎన్నిక‌ల్లో త్యాగాలు చేయాల్సి ఉంటుంద‌ని.. పార్టీల‌న్నీ క‌లిసి రావాల‌ని.. వైసీపీ ప్ర‌భుత్వాన్ని గ‌ద్దె దించాల‌ని.. ఇలా కొన్ని కీల‌క వ్యాఖ్య‌లు చేశారు. దీంతో టీడీపీ వ‌చ్చే ఎన్నిక‌ల్లో పొత్తుల‌పై దృష్టి పెట్టింద‌ని.. మీడియా జోరుగా ప్ర‌చారాలు ప్రారంభించింది. మ‌రోవైపు.. పార్టీలోనూ.. ఇదే త‌ర‌హా చ‌ర్చ సాగుతుండ‌డంతో పొత్తుల‌పై కీల‌క నేత‌లు.. ముఖ్యంగా క్షేత్ర‌స్థాయిలో నేత‌లు ఏమ‌నుకుంటున్నార‌నేది ఆస‌క్తిగా మారింది. ఒక‌ప్పుడు పార్టీ ప‌రిస్థితి వేరు.. ఇప్పుడు వేరు.. అని ఎక్కువ మంది నాయ‌కులు బలంగా న‌మ్ముతున్నారు.

మ‌రోవైపు.. వైసీపీ నేత‌లు పొత్తులు కోరుకోవ‌డం ఏంట‌నే ప్ర‌శ్న‌లు వేస్తున్నారు. అయితే.. టీడీపీ నేత‌లు మాత్రం పొత్తుల దిశ‌గానే ఆలోచ‌న చేస్తున్నారు. దీనికి ప్ర‌ధానం గా రెండు కార‌ణాలు క‌నిపిస్తున్నాయి. ఒకటి పార్టీ అధికారంలోకి రావాలి. సంస్థాగ‌తంగా పార్టీ బాగున్న‌ప్ప టికీ.. పొత్తులు లేకుండా.. ఉండే ప‌రిస్థితి లేదు. దీనిని ఎవ‌రూ త‌ప్పు ప‌ట్టాల్సిన అవ‌స‌రం లేద‌ని సీనియర్లు చెబుతున్నారు. ఎందుకంటే.. కేంద్రంలో అత్యంత బ‌లంగా ఉన్న బీజేపీ పార్టీ కూడా పొత్తుల‌తోనే ప్ర‌భుత్వాన్ని న‌డుపుతున్న ప‌రిస్థితి ఉంది. ఒక‌వైపు.. మోడీ ఇమేజ్ ఉంద‌ని చెబుతున్నా.. చిన్నా చిత‌కా పార్టీలో పొత్తు పెట్టుకునే ముందుకు సాగుతున్నారు. వారికి మంత్రి ప‌దవులు కూడా ఇచ్చారు.

ఈ నేప‌థ్యంలో టీడీపీ పొత్తులు పెట్టుకుంటే త‌ప్పేంటనేది .. వీరి మాట‌గా వినిపిస్తోంది. మ‌రోవైపు.. నాయ‌కులు ఇప్ప‌టికే.. ఈ మూడేళ్ల‌లోనే అన్ని రూపాల్లోనూ న‌లిగిపోయారు. ఆర్థికంగానూ ఇబ్బందులు ప‌డుతున్నారు. వీటికితోడు.. వేధింపులు కూడా ఎక్కువ‌గా ఉన్నాయి. సామాజిక వ‌ర్గాల వారీగా కూడా వేధింపులు జ‌రుగుతున్నాయి. ఈ క్ర‌మంలోనే చంద్ర‌బాబు కంటే ముందు గానే పార్టీ నాయ‌కులు.. క్షేత్ర‌స్థాయిలో కార్య‌క‌ర్త‌లు కూడా వ‌చ్చే ఎన్నిక‌ల్లో గెలుపు గుర్రం ఎక్కాల్సిందే! అనే నిర్ణ‌యానికి వ‌చ్చాయి. ఈ నేప‌థ్యంలో పొత్తులు పెట్టుకుంటే త‌ప్పు లేద‌ని.. సీనియర్ నాయ‌కులు అభిప్రాయ‌ప‌డుతున్నారు.

ఇక‌, చంద్ర‌బాబు.. సైతం.. పొత్తుల విష‌యంలో కొంత సంకేతాలు పంపించారంటే.. క్షేత్ర‌స్థాయిలో నాయ‌కుల నుంచి ఆయ‌న అభిప్రాయాలు తీసుకోకుండానే.. వారితో చ‌ర్చించ‌కుండానే.. ఇలా చేస్తార‌ని చెప్పే ప‌రిస్థితి లేదు. ఆయ‌న స్వ‌యంగా కొన్ని నిర్ణ‌యాలు తీసుకున్నా.. ఇలాంటి విష‌యాల్లో పొలిట్ బ్యూరోలో చ‌ర్చించే నిర్ణ‌యానికి వ‌స్తార‌నేది 2014 ఎన్నిక‌ల‌కు ముందు కూడా స్ప‌ష్ట‌మైంది. సో.. అన్ని వైపుల నుంచి చంద్ర‌బాబు ఆలోచించే ఈ నిర్ణ‌యానికి వ‌స్తున్న సంకేతాలు వ‌స్తున్నాయి. దీనిని పార్టీలోని సీనియ‌ర్లు కూడా ఆహ్వానిస్తున్న ప‌రిస్థితి క‌నిపిస్తోంది.

''బ‌ల‌మైన శ‌త్రువును ఢీ కొట్టాలంటే.. కొన్ని కొన్ని సార్లు.. కొన్ని వ్యూహాలు త‌ప్ప‌వు. వాటిలో ఇది కూడా ఒక భాగం. అంతమాత్రాన మా అస్తిత్వానికి వ‌చ్చిన న‌ష్టం ఏమీ లేదు'' అని తూర్పు గోదావ‌రి జిల్లాకు చెందిన ఒక సీనియ‌ర్ నాయ‌కుడు వ్యాఖ్యానించారు.అంటే.. వ‌చ్చే ఎన్నిక‌ల‌ను ఎదుర్కొనేందుకు చంద్ర‌బాబు అనుస‌రించే ఏవ్యూహానికైనా.. నాయ‌కులు , కార్య‌కర్త‌లు సిద్ధంగానే ఉన్నార‌నేది ఆయ‌న చెప్ప‌క‌నే చెబుతున్నారు. దీనిని బ‌ట్టి క్షేత్ర‌స్తాయిలోనూ..చంద్ర‌బాబు తీసుకునే నిర్ణ‌యానికి దాదాపు మార్కులు ప‌డుతున్న‌ట్టుగానే చెబుతున్నారు ప‌రిశీల‌కులు.