Begin typing your search above and press return to search.

దేశవిదేశాల్లో మోడీ సర్కారును డ్యామేజ్ చేసిన ‘చట్టం’ లో ఏముంది?

By:  Tupaki Desk   |   10 Dec 2020 8:36 AM GMT
దేశవిదేశాల్లో మోడీ సర్కారును డ్యామేజ్ చేసిన ‘చట్టం’ లో ఏముంది?
X
సమస్యల మీద ధర్నాలు.. రాస్తారోకోలు.. నిరసనలు నిర్వహించటం మామూలే. యావత్ దేశంలో నిత్యం ఏదో ఒక అంశం మీద ప్రతి చోట జరిగేవే. చాలా అరుదుగా మాత్రమే యావత్ దేశాన్ని కదిలిస్తుంటాయి. ఇటీవల మోడీ సర్కరు తెచ్చిన వ్యవసాయ చట్టాలపై పంజాబ్.. హర్యానా రైతులు ఆగ్రహం వ్యక్తం చేయటమే కాదు.. వినూత్న నిరసన చేపట్టారు. వణికించే చలిలో ఉక్కిరిబిక్కిరి అవుతూ రోడ్ల మీదనే ఉండిపోతున్న వారి తీరు దేశం మొత్తానికి కొత్త స్ఫూర్తిని ఇవ్వటమే కాదు.. రైతాంగ సమస్యల మీద ఇంత భారీగా పోరాటం ఇదే తొలిసారి అని చెబుతున్నారు.

అంతేకాదు.. విదేశాల్లోనూ ఈ చట్టాల మీద వ్యతిరేకత వ్యక్తం కావటమే కాదు.. పలు దేశాల నేతలు వీటిపై మాట్లాడుతున్నారు. ఒక్కమాటలో చెప్పాలంటే..దేశ విదేశాల్లోనూ మోడీ ఇమేజ్ ను దారుణంగా దెబ్బ తీశాయని చెప్పాలి. ఆరేళ్లుగా అప్రతిహతంగా సాగటమే కాదు.. ఆయన తీసుకున్న నిర్ణయానికి తిరుగు ఉండదన్నట్లుగా ఉండే పరిస్థితి నుంచి.. మా నిర్ణయాల్లో కొన్ని మార్పులు చేసుకుంటాం.. మీరు చేపట్టిన నిరసనను విరమించండి అంటూ ప్రతిపాదిస్తున్న పరిస్థితి. దీనికి రైతులు.. రైతు సంఘాల వారు నో అంటే నో అనేస్తారు.

ఇంతకీ.. అసలు సమస్య ఎక్కడ ఉంది? వ్యవసాయ చట్టాల్లో ఏముంది? రైతులు ఎందుకంతగా వ్యతిరేకిస్తున్నారు? వారికున్న అభ్యంతరాలు ఏమిటి? కేంద్రం చెబుతున్నదేమిటి? రైతులు ఏమని వాదిస్తున్నారు? తాజాగా ప్రభుత్వ ప్రతిపాదనలు ఏమిటి? దానికి రైతులు చెబుతున్న మాటేమిటి? అన్న ప్రశ్నలకు సమాధానాలు వెతికితే..

నూతన వ్యవయసాయ చట్టం పేరుతో మూడు చట్టాల్ని కేంద్రంలోని మోడీ సర్కారు లోక్ సభ.. రాజ్యసభలల్లో ఆమోదించింది. ప్రభుత్వానికి ఉన్న బలంతో ఇది సాధ్యమైంది. తెలంగాణ రాష్ట్ర సర్కారు ఈ బిల్లుపై తొలుత అభ్యంతరం వ్యక్తం చేసింది. అదే సమయంలో ఏపీ ప్రభుత్వం మద్దతు ఇచ్చింది. ఈ చట్టాల కారణంగా రైతులకు ఎదురయ్యే సమస్యల్లో ప్రధానమైనది.. వ్యవసాయ ఉత్పత్తుల్ని అమ్మే అవకాశం ప్రభుత్వ సంస్థలు కాకుండా పూర్తిగా ప్రైవేటు చేతుల్లోకి వెళుతుంది. దీంతో.. భారీ ఎత్తున సరుకును సమీకరించే కార్పొరేట్ శక్తుల చేతుల్లో మార్కెట్ మాత్రమే కాదు.. రైతులు బంధీలుగా మారతారు. అదే జరిగితే.. ధరను వారే డిసైడ్ చేసే వీలుంది. దీంతో.. రైతులు తీవ్ర ఇబ్బందులకు గురవుతారన్నది రైతుల వాదన.

దీనికి ప్రభుత్వం చెబుతున్నదేమంటే.. కొత్త చట్టాల్లో ప్రభుత్వ సేకరణ వ్యవస్థలో జోక్యం చేసుకునే ప్రతిపాదన లేదు. ఎంఎస్పీ కేంద్రాల్ని రాష్ట్రాలు ఏర్పాటు చేస్తాయి. మండీలను ఏర్పాటు చేసే అవకాశం ఉంది. ఎమ్మెస్పీ వ్యవస్థ బలపడటంతో పాటు.. ఎమ్మెస్పీపై కేంద్రంలిఖిత పూర్వక హామీ ఇస్తుందని. కేంద్రం తెచ్చిన వ్యవసాయ చట్టాల్ని రద్దు చేయాలని డిమాండ్ చేస్తే.. అందుకు ప్రభుత్వం ఇస్తున్న సమాధానం.. సాధ్యం కాదని. కావాలంటే.. రైతులకు ఉండే అభ్యంతరాల్ని చర్చించి.. వాటితో మార్పులు చేస్తామంటున్నారు.

మరో కీలకమైన అంశం.. రైతులు పండించే పంటను ప్రభుత్వం కొనుగోలు చేయటం ఆపేస్తే.. ఆ స్థానంలో కొనుగోళ్లు మొత్తం కార్పొరేట్ల చేతుల్లోకి వెళుతుంది. అదే జరిగితే.. ప్రైవేటు వారి చేతుల్లోకి వెళ్లే వీలుంది. అలా ఉండదని ప్రభుత్వం చెబుతున్నా.. రైతుల సందేహాల్ని తీర్చలేకపోతున్నారు. కొత్త చట్టంతో రైతుల భూమిని పారిశ్రామికవేత్తలు ఆక్రమించుకునే అవకాశం ఉంది. అదే జరిగితే రైతు భూమిని కోల్పోతాడు. దీనికి ప్రభుత్వం ఇస్తున్న సమాధానం.. రైతు భూమిలో ఏదైనా నిర్మాణం జరిగితే..ఒప్పందం పూర్తి అయిన తర్వాత పంట కొనుగోలుదారు వాటిని తీసేయాలి. పంట కొనేవారు దానిపై రుణాన్ని తీసుకోలేదు. నిర్మాణాన్ని తన అధీనంలో ఉంచుకోలేదు. కానీ.. ఆచరణలో ఈ సమస్యను అధిగమించటం అంత తేలికైన విషయం కాదు.

ప్రభుత్వం నిర్వహించే మండీలు బలహీనమై.. ప్రైవేటు మండీలదే రాజ్యమవుతుందన్నది రైతుల సందేహం. దానికి ప్రభుత్వం ఇస్తున్న సమాధానం మండీలు కాకుంటే.. నేరుగా ఫ్యాక్టరీలలో అమ్ముకునే అవకాశం కల్పించామని. కానీ.. రైతుల అభ్యంతరాల నేపథ్యంలో ప్రభుత్వం చేస్తున్న తాజా ప్రతిపాదన.. రాష్ట్ర ప్రభుత్వాలే ప్రైవేటు మండీలన నమోదు చేసేలా చట్టాన్ని మారుస్తామని. కానీ.. ఆచరణలో సాధ్యమవుతుందా? అన్నది సందేహం.

ఈ చట్టం మీద రైతులకున్న మరో పెద్ద సందేహం.. రైతుల భూమిని అటాచ్ చేస్తుందని. దీనికి ప్రభుత్వం చెబుతున్న దాని ప్రకారం.. రికవరీ కోసం రైతుల భేూమిని అటాచ్ చేసే అవకాశమే లేదు. ఇదే విషయాన్ని కత్త చట్టంలోని సెక్షన్ 15లో స్పష్టంగా పేర్కొన్నమాని చెబుతున్నారు. ఈ రూల్ ను ఉల్లంఘిస్తే కొనుగోలుదారుకు 150 శాతం ఫైన్ వేస్తామని చెబుతున్నారు. అవసరమైతే.. ఈ అభ్యంతరం మీద మరింత స్పష్టత ఇస్తామని కేంద్రంచెబుతోంది.

రైతుల అభ్యంతరాల్లో మరోకీలకమైనది.. వివాదం ఏదైనా ఉంటే.. రైతులు సివిల్ కోర్టుకు వెళ్లలేరని. అయితే.. దీనికి ప్రభుత్వం చెబుతున్న సమాధానం ఏమంటే.. 30 రోజుల్లో సమస్య పరిష్కారానికి నిబంధన ఉందని.. ఒక బోర్డు ద్వారా ఇరు వర్గాల మధ్య సయోధ్యకు అవకావం ఉందంటున్నారు. కావాలంటే.. నిరసనలు విరమిస్తే.. సివిల్ కోర్టుకు వెళ్లేలా అవకాశం ఇస్తామని.. అందుకు తగ్గట్లే చట్టంలో మార్పులు చేస్తామంటున్నారు. రైతులు తమ భూమిని ఎవరికైనా సాగు చేసేందుకు ఇస్తే.. అందుకురిజిస్ట్రేషన్ చేసే విధానం లేదన్నది అభ్యంతరం. దీనిపై ప్రభుత్వం చెప్పేదేమంటే.. రాస్ట్ర ప్రభుత్వాలు రిజిస్ట్రేషన్ వ్యవస్థను మొదలుపెట్టొచ్చొని. అవసరమైతే.. రాష్ట్ర ప్రభుత్వాలు రిజిస్ట్రేషన్ సౌకర్యం ఏర్పాటు చేసే వరకు.. వ్యవసాయ ఒప్పందం ద్వారా 30 రోజుల్లో కాపీని ఎస్ డీఎం ఆఫీసుల్లో సమర్పించే వీలుంది.

పంట వ్యర్థాల్ని తగలబెడితే శిక్షిస్తామని కొత్త చట్టం చెబుతోంది. తాజా ఆందోళన నేపథ్యంలో ఆ అభ్యంతరాల్ని దూరం చేస్తామని హామీ ఇస్తోంది. విద్యుత్ సవరణ బిల్లును రద్దు చేయాలని రైతులు డిమాండ్ చేస్తే.. దానికి ప్రభుత్వ చెబుతున్నదేమంటే.. విద్యుత్ బిల్లు చెల్లించే విధానంలో ఏ మార్పు లేదని. ఇన్ని అభ్యంతరాల నేపథ్యంలో రైతులు కోరుతున్న డిమాండ్లను ప్రభుత్వం ఏ మేరకు నమ్మకం కలిగేలా చేస్తుందన్నది పెద్ద సమస్య. అదే సమయంలో మొన్నటి దాకా మొండిగా ఉన్న ప్రభుత్వం.. ప్రస్తుతం ఉన్న ఒత్తిడితో ఓకే అని చెప్పినా.. చివరకు చెప్పినట్లు చేస్తుందా? రైతులకు ఎలాంటి ఇబ్బంది కలగదన్న భరోసా ఇవ్వగలదా? అన్నది అసలు ప్రశ్న.