Begin typing your search above and press return to search.

విచారణలో రైల్వే పోలీసులకు సికింద్రాబాద్ నిందితులు ఏం చెప్పారు?

By:  Tupaki Desk   |   21 Jun 2022 4:36 AM GMT
విచారణలో రైల్వే పోలీసులకు సికింద్రాబాద్ నిందితులు ఏం చెప్పారు?
X
పెను సంచలనంగా సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ విధ్వంస ఘటన చోటు చేసుకోవటం తెలిసిందే. దాదాపు 2 వేల మంది వరకు ఆందోళనలో పాల్గొనటం.. రైళ్లను ధ్వంసం చేయటం.. తగలబెట్టటం లాంటివి చేయటం తెలిసిందే. దీనికి సంబంధించి రైల్వే పోలీసులు 56 మందిని అదుపులోకి తీసుకోవటం తెలిసిందే. ఆదివారం రాత్రి నుంచి సోమవారం తెల్లవారుజాము వరకు కస్టడీలో ఉన్న నిందితులను పోలీసులు ప్రశ్నించటం తెలిసిందే. దీనికి సంబంధించిన వివరాల్ని రిమాండ్ రిపోర్టులో పేర్కొంటూ కోర్టుకు సమర్పించారు.

పోలీసుల విచారణలో నిందితులు చెప్పిన అంశాల్లో ముఖ్యమైనది.. అసలు ఎందుకీ విధ్వంసానికి పాల్పడ్డారు? వారి ఆందోళనకు.. ఆవేశానికి కారణం ఏమిటి? అన్న అంశాలపై ప్రశ్నలు వేయగా.. కరోనా కారణంగా రెండేళ్లుగా ఉమ్మడి ప్రవేశ పరీక్షను కేంద్రం నిర్వహించలేదని.. ఒకవేళ అగ్నిపథ్ పరీక్షలో ఫెయిల్ అయితే వయసు పరిమితి దాటి.. మరోసారి రాసే వీలుండదని.. ఆ అంశం వారిలో ఆగ్రహానికి కారణమైందంటున్నారు.

అంతేకాదు.. ఇప్పుడు కాకుంటే ఇంకెప్పటికి జవాన్లను కాలేమన్న ఆలోచన కూడా విధ్వంసానికి కారణంగా చెబుతున్నారు. తమ ఆందోళనలో భాగంగా బిహార్.. రాజస్థాన్ లో మాదిరి రైళ్లను తగలబెట్టేయాలని తాము అనుకున్నట్లుగా చెప్పినట్లు సమాచారం.

రైల్వే విధ్వంసం కేసులో మొత్తం 56 మంది ఉంటే.. వారిలో 51 మంది 20 ఏళ్లు దాటిన వారే. ప్రవేశ పరీక్షకు అర్హత సాధించిన 2 వేల మందిలో 20 ఏళ్లు దాటిన వారంతా అగ్నిపథ్ ను అడ్డుకోవాలని భావించినట్లుగా చెబుతున్నారు.

ఈ కేసులో ఏ2గా ఉన్న ప్రథ్వీరాజ్ వయసు కేవలం 23 ఏళ్లు మాత్రమే కావటం గమనార్హం. ఆందోళనకారులు ఆందోళనను కొన్ని డిఫెన్సు అకాడమీలు సహకరించటంతో పాటు విధ్వంసాన్ని జరిపేలా రెచ్చగొట్టినట్లుగా చెబుతున్నారు. ఇందులో భాగంగా ఎనిమిది వాట్సాప్ గ్రూపుల్ని ఏర్పాటు చేయాన్ని రిమాండ్ రిపోర్టులో పేర్కొన్నారు. వరంగల్.. కరీంనగర్.. ఖమ్మం.. రంగారెడ్డి జిల్లాల్లో ఉన్న డిఫెన్సు అకాడమీల ప్రతినిధులు కీలకంగా వ్యవహరించి.. బుధవారం రాత్రి నుంచే ప్లానింగ్ షురూ చేసినట్లు చెబుతున్నారు.

తెలంగాణలోని పలు జిల్లాలకు చెందిన వారిని హైదరాబాద్ కు రావాలంటూ వాట్సాప్ సందేశాల్ని పంపారు. ఇందులో భాగంగా సికింద్రాబాద్.. విశాఖపట్నం.. విజయవాడ.. గుంటూరు రైల్వే స్టేషన్లలో విధ్వంసాన్ని క్రియేట్ చేయాలని.. నాలుగైదు రోజులు బయటే ఉండేలా ఏర్పాట్లు చేసుకొమ్మని చెబుతూ సందేశాలు పంపటం గమనార్హం. తెలంగాణలోని వివిధ జిల్లాల నుంచి వచ్చిన 1500 మంది యువకులను సికింద్రాబాద్ స్టేషన్ నుంచి 10 కిలోమీటర్ల దూరంలో వసతి కల్పించినట్లుగా గుర్తించారు.