Begin typing your search above and press return to search.

వానొచ్చె వ‌ర‌దొచ్చె రోడ్డేది స‌ర్?

By:  Tupaki Desk   |   21 Jun 2022 6:30 AM GMT
వానొచ్చె వ‌ర‌దొచ్చె రోడ్డేది స‌ర్?
X
రాష్ట్రంలో రుతు ప‌వ‌న ప్ర‌భావంతో వాన‌లు ప‌డుతున్నాయి. కాస్తో కూస్తో చెరువులు నిండుతున్నాయి. ఖ‌రీఫ్ ప‌నులు కూడా ప్రారంభం అయి ఉన్నాయి. విత్త‌నాలు కూడా స‌ర‌ఫ‌రా అవుతున్నాయి. కానీ రోడ్డు ప‌నులే జ‌ర‌గ‌లేదు. కాదు జ‌రిపించ‌లేదు అని రాయాలి. ఇదీ ఆంధ్రావ‌నిలో నెల‌కొన్న ప్ర‌ధాన స‌మ‌స్య‌పై వైసీపీ ప్ర‌భుత్వం తీసుకుంటున్న చ‌ర్య‌ల‌కు తార్కాణం అని విప‌క్షం అయిన జ‌న‌సేన మండిప‌డుతోంది.

ఇప్ప‌టికే రోడ్డు మ‌ర‌మ్మ‌తులకు రెండు వేల కోట్ల రూపాయ‌లు కేటాయించ‌మ‌ని చెబుతున్న జ‌గ‌న్ ఆ మేర‌కు ప‌నులు మాత్రం చేయించ‌లేక‌పోయారు అన్న వాద‌న వినిపిస్తోంది. అప్ప‌టికీ జ‌న‌సేన అనేక చోట్ల వీలున్నంత వ‌ర‌కూ (పూర్తి స్థాయిలో కాక పోయినా త‌మ ప‌రిధిలో ఉన్నంత‌లో) మ‌ర‌మ్మ‌తులు చేసి మ‌రీ ! నిర‌స‌న‌లు తెలిపింది. అయినా కూడా ఇప్ప‌టిదాకా ప‌నుల్లో క‌ద‌లిక లేదు.

ఇక భూగ‌ర్భ డ్రైనేజీ వ్య‌వ‌స్థ నిర్వ‌హ‌ణ‌పై ఎప్ప‌టి నుంచో కొన్ని ప్ర‌తిపాదన‌లు ఉన్నాయి. అదేవిధంగా కొన్ని ప‌నులు కూడా జ‌రిగాయి. కానీ బిల్లుల చెల్లింపుల్లో తాత్సారం కార‌ణంగా సంబంధిత ప‌నులు అన్నీ ఆగిపోయాయి.

గుంటూరు మొద‌లుకుని క‌డప వ‌ర‌కూ ఇదే విధంగా ప‌నులు ఆగిపోయాయి అని తెలుస్తోంది. ప్ర‌తిపాదిత ప్రాంతాల‌లో ప‌నులు చేప‌ట్టేందుకు కాంట్రాక్ట‌ర్లు ఇక ముందుకు రారు అని కూడా తేలిపోయింది.

గుంటూరు జిల్లాలో 903.82కోట్ల రూపాయ‌ల‌తో పనులు చేప‌ట్టాల్సి ఉండ‌గా ఇప్ప‌టిదాకా రూ.454 కోట్లు వెచ్చించారు. ఈ ప‌నులు 2016 లో మొద‌లై 2021తో పూర్తి కావాల్సి ఉంది. కానీ ప‌నులు మాత్రం ఎక్క‌డివ‌క్క‌డే నిలిచిపోయాయి. నెల్లూరులో 580.85కోట్ల రూపాయ‌ల‌తో ప‌నులు చేప‌ట్టాల్సి ఉండ‌గా, ఇప్ప‌టిదాకా భూగ‌ర్భ డ్రైనేజీ కోసం 471 కోట్లు వెచ్చించారు అని తెలుస్తోంది.

ఈ ప‌నులు 2016లో మొద‌లై 2019లో ముగియాల్సి ఉంది. అదేవిధంగా విశాఖ‌లో 1074కోట్ల రూపాయ‌ల‌తో ప‌నులు చేప‌ట్టాల్సి ఉంది. కానీ ఇప్ప‌టిదాకా 350 కోట్లు మాత్ర‌మే వెచ్చించారు. ఈ ప‌నులు 2019లో మొద‌లయి, 2024 నాటికి ముగియాల్సి ఉంది. క‌డ‌ప లో 166.50 కోట్ల రూపాయ‌ల‌తో చేప‌ట్టాల్సిన ప‌నులకు గాను ఇప్ప‌టిదాకా 72 కోట్ల రూపాయ‌ల‌ను మాత్ర‌మే వెచ్చించారు. ఇక్క‌డ ప‌నులు 2008లో మొద‌లై 2012లో ముగియాల్సి ఉంది. కానీ ఆ మేరకు చ‌ర్య‌ల‌న్న‌వి లేవు అని తెలుస్తోంది.