Begin typing your search above and press return to search.

బాల్యవివాహాలు వద్దంటావా..! పెద్దాయనకు 12 ఏళ్లు గ్రామ బహిష్కరణ.. రాజస్థాన్​లో కాప్​పంచాయత్​లదే రాజ్యం

By:  Tupaki Desk   |   19 Oct 2020 12:30 AM GMT
బాల్యవివాహాలు వద్దంటావా..! పెద్దాయనకు 12 ఏళ్లు గ్రామ బహిష్కరణ.. రాజస్థాన్​లో కాప్​పంచాయత్​లదే రాజ్యం
X
ఈ రోజుల్లోనూ కొన్ని గ్రామాల్లో అనాగరిక ఆచారాలు, కట్టుబాట్లు కొనసాగుతూనే ఉన్నాయి. బాల్యవివాహాలు వద్దని వారించినందుకు ఓ వృద్ధుడి(65)ని 12 ఏండ్లు గ్రామం నుంచి బహిష్కరించారు. ఈ అమానవీయ ఘటన రాజస్థాన్ రాష్ట్రంలో చిత్తోర్​ఘడ్​ జిల్లాలో చోటు చేసుకున్నది. ఆ వృద్ధుడు ఈ ఘటనపై పోలీసులకు ఫిర్యాదు చేయడంతో మొత్తం 25 మందిపై కేసులు నమోదయ్యాయి. రాజస్థాన్​ రాష్ట్రంలోని నింబహేరా గ్రామంలో శివలాల్​ అనే వృద్ధుడి కుటుంబం నివాసం ఉంటోంది. నింబహేరా కాప్​ పంచాయతీ బాల్యవివాహాలను ఆమోదిస్తూ దీనపై ప్రజాభిప్రాయం చేపట్టింది. ఈ ప్రజాభిప్రాయ సేకరణలో శివలాల్​ ‘తాను బాల్యవివాహాలకు వ్యతిరేకం’ అంటూ తన అభిప్రాయం చెప్పాడు. ఈ విషయం పంచాయతీ పెద్దలకు కోపం తెప్పించింది.

దీంతో సెప్టెంబర్ 30న ఆ గ్రామంలో మరోసారి కాప్​ పంచాయతీ పెట్టారు. పంచాయతీ పెద్దలంతా శివలాల్​ కుటుంబానికి 12 ఏళ్ల పాటు ‘హుక్కా పానీ బంద్​’(గ్రామ బహిష్కరణ) విధించారు. దీన్ని ఎవరైనా ఉల్లంఘిస్తే వారికి రూ. 1.10 లక్షల జరిమాన విధిస్తామని తీర్మానంలో పేర్కొన్నారు. స్థానిక మహదేవ్​ దేవాలయంలో ఈ మేరకు పెద్దలు తీర్మానం చేశారు. దీంతో శివలాల్​ పోలీసులను, మీడియాను ఆశ్రయించారు. 12 ఏళ్ల పాటు తన కుటుంబం ఊరిని విడిచిపెట్టి ఎలా బతకాలని పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఈ ఘటనపై పోలీసులు 25 మందిపై కేసులు నమోదుచేశారు.

అయితే రాజస్థాన్​ రాష్ట్రంలో కాప్​పంచాయత్​లు పెట్టడం చాలా కామన్​. ఇది వరకు అక్కడ ఇటువంటి ఘటనలు ఎన్నో చోటుచేసుకున్నాయి. గతంలోనూ వివాహేతర సంబంధం పెట్టుకున్నదని ఓ మహిళను చెప్పుల మెడకు కట్టి ఊరేగించారు. అక్కడ ఇటువంటి తీర్పులు పరిపాటిగా మారాయి. అగ్రవర్ణాల దాష్టికాలు అక్కడ మామూలే. పోలీసులు కేసు నమోదు చేసినా.. తర్వాత రాజకీయ ఒత్తిళ్లకు భయపడి వెనక్కి తీసుకుంటారు. కాప్​పంచాయతీ చేసే పెద్ద మనుషులకు స్థానిక ఎమ్మెల్యేలు, ఎంపీలతో సన్నిహిత సంబంధాలు ఉండటమే అందుకు కారణం.