Begin typing your search above and press return to search.

హుజూరాబాద్ ఎలక్షన్ దృష్టి మరల్చడానికి వాట్ ఏ ప్లాన్ !

By:  Tupaki Desk   |   1 July 2021 3:59 PM GMT
హుజూరాబాద్ ఎలక్షన్ దృష్టి మరల్చడానికి వాట్ ఏ ప్లాన్ !
X
అందుకే కేసీయార్ అని అంటారు. అపర చాణక్యుడు అని కూడా అంటారు. ఆయన వ్యూహాలు ఎవరి వూహకు కూడా అసలు అందవు. కేసీయార్ కి మొన్నటి వరకూ గుండెల్లో కుంపటి మాదిరిగా మాజీ మంత్రి ఈటల రాజేందర్ ఉన్నాడు. ఈటల సామాన్యుడు కాదు, మిగిలిన నాయకుల మాదిరిగా పొమ్మంటే పోవడానికి పార్టీ అధికారంలోకి వచ్చినపుడు చేరిన వారు కానే కాదు. తెలంగాణా ఉద్యమంలో ఉన్నారు. అష్టకష్టాలు పడ్డారు. కేసీయార్ వెంట ఎన్నో ఆటుపోట్లను తట్టుకుని నిలబ‌డ్డారు. ఉద్యమంతో పూర్తిగా తడిసిన వాడు ఈటల. అటువంటి ఈటలను బయటకు పంపడం అంటే చిన్న విషయం కాదు.

బయటకు వెళ్ళిన ఈటల గులాబీ తోటకు చిచ్చు పెట్టే చిచ్చర పిడుగు అవుతాడు అని కేసీయార్ కి తెలియని విషయం కానే కాదు. ఈటల బీసీ నేత. మంచి వాక్చాతుర్యం ఉన్న వాడు. అన్నిటికీ మించి కేసీయార్ గుట్లూ పట్లూ అన్నీ తెలిసిన వాడు. ఇపుడు ఆయన బయటకు వెళ్ళడంతో సానుభూతి ఉంది. ఏడేళ్ళ టీయారెస్ పాలన మీద ఎటూ వ్యతిరేకత ఉంది. ఇక దొరపాలన సాగుతోందని, ఉద్యమ కాలం నాటి వారికి టీయారెస్ లో ఎక్కడా చోటు లేదన్న ప్రచారాన్ని నిజం చేస్తూ ఈటలను బయటకు పంపారు. దాంతో ఈటల చర్చ కనుక మీడియాలో వస్తే బదనాం అయ్యేది కచ్చితంగా టీయారెస్ మాత్రమే.

అందుకే ఈటల మీద ఉన్న ఫోకస్ అంతా ఒక్కసారిగా మళ్ళించేశారు కేసీయార్. రాయలసీమ ఎత్తి పోతల పధకం ఆయనకు ఒక్కసారిగా గుర్తుకు రావడం వెనక రహస్యం ఇదేనని రాజకీయ వర్గాలలో గట్టిగా వినిపిస్తోంది. మా నీళ్ళు దోచుకుంటారా, మా వాటా హక్కులు కాదంటారా అంటూ టీయారెస్ మంత్రులు రంకెలు వేయడం వెనక కూడా అసలు కధ ఇదేనని అంటున్నారు. దీంతో మొత్తం సోషల్ మీడియాలో టాపిక్ కంప్లీట్ గా డైవర్ట్ అయిపోయింది. ఈటల ఇపుడు ఎక్కడ ఉన్నారు అన్నది వెతుక్కోవాల్సి వస్తోంది. ఆయన మీడియా మీటింగ్స్ కి గతంలో వచ్చిన ప్రాధాన్యత లేకుండా పోతోంది. ఇపుడు అంతా ఆంధ్రా, తెలంగాణా జల జగడాల మీదనే. అందుకే కేసీయార్ ఇలా తీసుకువచ్చారు అంటున్నారు.

గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల వేళ రాయలసీమ పధకం గుర్తుకు రాలేదు, నాగార్జున సాగర్ ఎన్నికలపుడు అసలు గుర్తు లేదు. దుబ్బాక ఉప ఎన్నికల వేళ ఆ ఊసే లేదు. మరిపుడు ఎందుకు ఇంత ఫోకస్ అంటే. ఈటలను దెబ్బకొట్టే వ్యూహంలో భాగమే ఇదంతా అంటున్నారు. దీన్ని చూసిన వారు అమ్మో కేసీయార్ అనకుండా ఉంటారా.