Begin typing your search above and press return to search.
భయం వీడని టెకీలు.. ఇంకా వర్క్ ఫ్రమ్ హోమే
By: Tupaki Desk | 21 May 2020 11:30 PM GMTమహమ్మారి కట్టడిలో భాగంగా విధించిన లాక్‌డౌన్ పాక్షికంగా కొనసాగుతోంది. పెద్దమొత్తంలో సడలింపులు ఇవ్వడంతో సాధారణ పరిస్థితులు నెలకొన్నాయి. కార్యాలయాలు పని చేయడం మొదలుపెట్టాయి. ప్రజల రద్దీ రోడ్లపై పెరిగింది. తెలుగు రాష్ట్రాలతోపాటు దేశవ్యాప్తంగా సాధారణ జన జీవనం పునఃప్రారంభమైంది. ముఖ్యంగా హైదరాబాద్ లో పరిస్థితి పూర్వరూపం సంతరించుకుంది. ప్రభుత్వ - ప్రైవేటు సంస్థలు వంద శాతం సిబ్బందితో కార్యకలాపాలు నిర్వహించుకునేందుకు అనుమతి రావడంతో యథావిధిగా కార్యకలాపాలు ప్రారంభమయ్యాయి. ఆంక్షలు వంద శాతం సడలించారు. అయితే ఐటీ రంగంలో మాత్రం భయాందోళన మాత్రం వీడడం లేదు. అందుకే ఉద్యోగులు పరిమిత సంఖ్యలో విధులకు హాజరవుతున్నారు. వారు ఇంకా వర్క్ ఫ్రమ్ హోం చేసేందుకు మొగ్గు చూపుతున్నారు. ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ రంగంలో ఆ మహమ్మారి భయం తొలగలేదు.
వాస్తవంగా భారతదేశంలో మార్చి 22వ తేదీ నుంచి లాక్ డౌన్ అమలు చేస్తున్నారు. అంతకుముందు నెల రోజుల నుంచే అన్ని ఐటీ కంపెనీలు ‘వర్క్ ఫ్రమ్ హోమ్’ విధానం అమలుచేశాయి. ఉద్యోగులకు ఇళ్ల నుంచే పని చేయాలని వెంటవెంటనే ఆదేశాలు పంపాయి. దీంతో ఉద్యోగులంతా వర్క్ ఫ్రమ్ హోమ్ చేశారు. 95 శాతం మంది ఐటీ ఉద్యోగులు ఇంటి నుంచే పనిచేశారు. ఈ సందర్భంగా వారికి అవసరమైన ల్యాప్ టాప్ లు - బ్రాడ్ బ్యాండ్ కనెక్షన్ - డాంగుల్స్ వంటి వాటిని కూడా ఐటీ కంపెనీలు తమ ఉద్యోగులకు అందించాయి.
ప్రస్తుతం లాక్ డౌన్ నిబంధనలు సడలించి పూర్తిగా వంద శాతం ఉద్యోగులతో కార్యకలాపాలు కొనసాగించేందుకు ప్రభుత్వం అనుమతించింది. అయితే ఐటీ కంపెనీల్లో మాత్రం ఉద్యోగులు చాలా తక్కువ సంఖ్యలో 8 నుంచి పది శాతం లోపే కార్యాలయానికి వస్తున్నారు. హైదరాబాద్ లో పరిస్థితులు భయంకరంగానే ఉన్నాయి. అందుకే ఉద్యోగులు వర్క్ ఫ్రమ్ హోమ్ చేసేందుకు ఆసక్తిగా ఉన్నారు. ఆ వైరస్ పై భయాందోళన ఉండడంతో పాటు ముందుజాగ్రత్తగా ఇప్పుడిప్పుడే కార్యాలయాలకు వచ్చేందుకు ఉత్సాహం చూపడం లేదు. కంపెనీలు కూడా కార్యాలయాలకు రావాలని పెద్దగా ఒత్తిడి చేయడం లేదు. జూన్ నెలాఖరు వరకు వర్క్ ఫ్రమ్ హోం విధానం కొనసాగించే అవకాశాల ఉన్నాయి.
సడలింపులు ఇవ్వడంతో కార్యాలయాలో ఉద్యోగులు పని చేసేలా ఐటీ కంపెనీలు ఏర్పాట్లు చేస్తున్నాయి. అయితే ఆ మహమ్మారి వ్యాపించకుండా కార్యాలయాల్లో శానిటైజేషన్ - భౌతిక దూరం - మాస్క్ లు ధరించడం వంటి వాటికి చర్యలు తీసుకుంటున్నారు. పరిస్థితులను చూస్తుంటే జూలై వరకు సాధారణ పరిస్థితులు వచ్చే అవకాశం ఉంది.