Begin typing your search above and press return to search.

మ్యాచ్‌ ఫిక్సింగ్‌ కలకలం.. ఆ క్రికెటర్‌ పై వేటు!

By:  Tupaki Desk   |   24 May 2023 4:00 PM GMT
మ్యాచ్‌ ఫిక్సింగ్‌ కలకలం.. ఆ క్రికెటర్‌ పై వేటు!
X
మ్యాచ్‌ ఫిక్సింగ్‌ భూతం ఇప్పుడున్నది కాదు. హోరాహోరీగా తలపడి, తమ ప్రతిభా పాటవాలను చాటుకుని మ్యాచుల్లో విజయాలు సాధిస్తే ఆ మజానే వేరు. అలా కాకుండా ముందుగానే డబ్బులకు, ఇతర తాయిలాలకు అమ్ముడుపోయి కావాలనే ఔట్‌ అయిపోయి మ్యాచ్‌ ఫిక్సింగ్‌ కు పాల్పడ్డ ఆటగాళ్లు చరిత్రలో మాయని మచ్చగా నిలిచిపోయారు. గతంలో భారత క్రికెటర్‌ మహ్మద్‌ అజారుద్దీన్‌. దక్షిణాఫ్రికా మాజీ కెప్టెన్‌ హాన్సీ క్రోనే తదితరులపై మ్యాచ్‌ ఫిక్సింగ్‌ ఆరోపణలు కలకలం రేపాయి. వారిపై ఈ ఆరోపణల నేపథ్యంలో వేటు కూడా పడింది.

ఇప్పుడు ఇదే కోవలో వెస్టిండీస్‌ క్రికెటర్‌ పై అంతర్జాతీయ క్రికెట్‌ మండలి (ఐసీసీ) వేటు వేసింది. వెస్టిండీస్‌ వికెట్‌ కీపర్, బ్యాటర్‌ డెవాన్‌ థామస్‌ మ్యాచ్‌ పిక్సింగ్‌ కు పాల్పడ్డాడనే ఆరోపణలపై ఐసీసీ అతడిని ఇకపై మ్యాచులు ఆడకుండా సస్పెండ్‌ చేసింది.


శ్రీలంక ప్రీమియిర్‌ లీగ్‌ 2021లో ఫిక్సింగ్‌ కు పాల్పడ్డాడన్న అభియోగాల నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఐసీసీ తెలిపింది. అలాగే యూఏఈ, కరీబియన్‌ లీగ్‌ ల్లో బుకీలు తనను కలిసిన విషయాన్ని అతడు దాచిపెట్టాడని, వీటిపై విచారణకు ఏమాత్రం సహకరించడం లేదని ఐసీసీ వెల్లడించింది. ఈ నేపథ్యంలో అతyì పై వేటు వేసినట్టు వెల్లడించింది.

డెవాన్‌ థామస్‌ పై సస్పెన్షన్‌ తక్షణమే అమల్లోకి వస్తుందని.. శ్రీలంక క్రికెట్, ఎమిరేట్స్‌ క్రికెట్‌ బోర్డ్, కరీబియన్‌ ప్రీమియర్‌ లీగ్‌ అవినీతి నిరోధక కోడ్‌ ల ప్రకారం అతనిపై ఏడు అభియోగాలు మోపినట్లు ఐసీసీ తెలిపింది.

తనపై మోపిన అభియోగాలపై స్పందించేందుకు థామస్‌కు 14 రోజుల గడువు ఇచ్చింది. చివరిగా గతేడాది ఆగస్టులో వెస్టిండీస్‌ తరఫున ఆడిన 33 ఏళ్ల థామస్‌ ను త్వరలో యూఏఈతో జరిగే వన్డే సిరీస్‌ కు ఎంపిక చేశారు.

కాగా వెస్టిండీస్‌ కు చెందిన డెవాన్‌ థామస్‌ గతేడాదే టెస్ట్‌ అరంగేట్రం చేశాడు. అతను విండీస్‌ తరఫున ఒక టెస్ట్, 21 వన్డేలు, 12 టీ20లు ఆడాడు. ఇందులో మొత్తంగా 320 పరుగులు, 36 క్యాచ్‌లు, 4 రనౌట్లు, 8 స్టంపింగ్‌లు చేశాడు. టెస్ట్‌ ల్లో, వన్డేల్లో బౌలింగ్‌ సైతం చేసిన థామస్‌.. ఫార్మాట్‌కు 2 చొప్పున 4 వికెట్లు పడగొట్టాడు.