Begin typing your search above and press return to search.

ఇంటర్‌ పరీక్షలు.. కొడుకు కంటే తల్లికి ఎక్కువ మార్కులు!

By:  Tupaki Desk   |   26 May 2023 10:43 PM GMT
ఇంటర్‌ పరీక్షలు.. కొడుకు కంటే తల్లికి ఎక్కువ మార్కులు!
X
పశ్చిమ బెంగాల్‌ లో అద్భుతం చోటు చేసుకుంది. తల్లీ కుమారుడు ఇంటర్మీడియెట్‌ పరీక్షలు రాయగా ఇద్దరూ ఉత్తీర్ణులయ్యారు. అయితే ఇందులో వింతేముంది అనుకుంటున్నారా.. తన కుమారుడి కంటే తల్లికి ఎక్కువ మార్కులు వచ్చాయి. కుమారుడికి 500 మార్కులకుగానూ 284 మార్కులు రాగా, తల్లికి 324 మార్కులు వచ్చాయి. అంటే కుమారుడి కంటే తల్లికి 40 మార్కులు అదనంగా వచ్చాయి.

ఈ ఘటన వివరాల్లోకి వెళ్తే పశ్చిమ బెంగాల్‌ లో శాంతిపూర్‌ పట్టణంలో 42 ఏళ్ల లతిక మండల్‌ నివసిస్తున్నారు. ఆమె కుమారుడు సౌరవ్‌ మండల్‌ కు 18 ఏళ్లు. వీరిద్దరూ కలసి ఈ ఏడాది ఇంటర్మీడియెట్‌ సెకండియర్‌ పరీక్షలు రాశారు. ఈ క్రమంలో తన కుమారుడు సౌరవ్‌ మండల్‌ కంటే తల్లి లతిక మండల్‌ 40 మార్కులు అధికంగా సాధించి రికార్డు సృష్టించారు.

లతిక మండల్‌ పెళ్లి తర్వాత ఆమె చదువుకు బ్రేక్‌ పడింది. అయితే చదువుకోవాలన్న ఆకాంక్ష ఆమెకు అడుగడుగునా ఉంది. ఈ నేపథ్యంలో అడ్డంకులను అధిగమించి, ఈ వయసులో చదువేంటి అనే విమర్శలు, సామాజిక వైరుధ్యాలను బద్దలు కొట్టి ఆమె పరీక్షలకు సిద్ధమయ్యారు.

ఒకరికొకరు తల్లీ కుమారుడు పరస్పరం ప్రోత్సహించుకోవడం, సందేహాలను నివృత్తి చేసుకోవడం ద్వారా ఇద్దరూ ఇంటర్మీడియెట్‌ సెకండియర్‌ పరీక్షల్లో ఉత్తీర్ణులయ్యారు.

దీంతో బంధువులు, ఇరుగుపొరుగువారు తల్లీకొడుకును అభినందిస్తున్నారు. పత్రికల్లోనూ, టీవీ చానెళ్లలోనూ, సోషల్‌ మీడియాలోనూ తల్లీ కుమారుడి గురించి వేయడంతో ఈ విషయం అందరికీ తెలిసిపోయింది. దీంతో వారింటికి ఇరుగుపొరుగువారు, బంధువులు క్యూ కట్టి తల్లీ కుమారుడిని అభినందనలతో ముంచెత్తుతున్నారు.

ఈ సందర్భంగా తల్లి లతిక మండల్‌ మాట్లాడుతూ తాను, తన కుమారుడు ఇద్దరం పరీక్షల్లో ఉత్తీర్ణత చెందడం పట్ల సంతోషం వ్యక్తం చేసింది. అయితే తన కొడుక్కి తన కంటే ఎక్కువ మార్కులు వస్తే బాగుండేదని చెప్పారు. ‘‘మా అబ్బాయికి నేను సాధించిన మార్కులు వస్తే మరింత సంతోషించేదానిని.. భవిష్యత్తులో ఆ మార్కులు అతడికి ఉపయోగపడేవి’’ అని లతిక మండల్‌ తన తల్లి ప్రేమను బయటపెట్టుకున్నారు.

మరోవైపు కుమారుడు సౌరవ్‌ మండల్‌ సైతం తన తల్లి కష్టానికి తగిన ఫలితం దక్కిందని సంతోషం వ్యక్తం చేశాడు. ‘‘మా అమ్మ తన కలలను సాకారం చేసుకోగలిగినందుకు నేను సంతోషిస్తున్నాను. నేను కొన్ని మార్కులు కోల్పోయి ఉండవచ్చు, కానీ నేను ఏదో ఒకవిధంగా పాస్‌ అయ్యాను’’ అని అతను వ్యాఖ్యానించాడు.

‘సుమారు 20 సంవత్సరాల క్రితం నేను నా భర్తతో వివాహం అయ్యాక చదువుకు పుల్‌ స్టాప్‌ పడింది. ఆర్థిక ఇబ్బందులు కారణంగానూ చదువుకోలేకపోయాను. అయితే నా పిల్లల పుస్తకాలను జాగ్రత్తగా చూసుకోవడం నన్ను ఆకట్టుకుంది.. దీంతో నేను కూడా చదువుకున్నాను’’ అని లతిక మండల్‌ తెలిపారు.
ఇప్పుడు ఇంటర్‌ సెకండియర్‌ పాస్‌ కావడంతో బ్యాచిలర్‌ డిగ్రీ లో చేరడానికి తల్లీ కుమారుడు సిద్ధమవుతున్నారు. ఇప్పుడు ఈ తల్లీకొడుకు పలువురికి ఆదర్శంగా నిలిచారు. సాధించాలన్న తపన ఉండాలే కానీ వయసు, ఇతర అడ్డంకులు ఇబ్బంది కావని నిరూపించారు.