Begin typing your search above and press return to search.

సోనూపై ఫ‌త్వా జారీ అయ్యిందిగా!

By:  Tupaki Desk   |   19 April 2017 8:51 AM GMT
సోనూపై ఫ‌త్వా జారీ అయ్యిందిగా!
X
ఆలయాలు, మసీదుల్లో ఏర్పాటు చేస్తున్న లౌడ్ స్పీక‌ర్ల‌పై వివాదాస్పద వ్యాఖ్యలు చేయ‌డమే కాకుండా స‌ద‌రు వ్యాఖ్య‌ల‌పై విమ‌ర్శ‌లు వెల్లువెత్తినా ఏమాత్రం వెన‌క్కు త‌గ్గేది లేద‌ని ప్ర‌క‌టించిన‌ ప్రముఖ బాలీవుడ్‌ గాయకుడు సోనూ నిగమ్‌ పై ఫత్వా జారీ అయిపోయింది. సోనూ గుండు కొడితే 10 లక్షల రూపాయలు ఇస్తానని కోల్‌ కతాకు చెందిన ముస్లిం మత గురువు ప్రకటించారు. ‘సోనూ నిగమ్‌ తల గొరిగి.. అతడి మెడలో పాత చెప్పుల దండ వేసి, దేశమంతా తిప్పిన వారికి వ్యక్తిగతంగా నేను 10 లక్షల రూపాయలు ఇస్తా’అని పశ్చిమ బెంగాల్‌ మైనారిటీ యునైటెడ్‌ కౌన్సిల్‌ ఉపాధ్యక్షుడు సయిద్‌ షా అతిఫ్‌ అలీ ఆల్ ఖాద్రి ప్రకటించారు.

సోనూ నిగమ్‌ కు వ్యతిరేకంగా ఈ నెల 21న ర్యాలీ చేపట్టనున్నట్టు ఖాద్రి తెలిపారు. దీనిపై సోనూ నిగమ్ కూడా ట్విటర్‌ లో ఘాటుగానే స్పందించారు. ఈ రోజు మధ్యాహ్నం ఇంట్లో ఉంటానని, ఎవరైనా వచ్చి తనకు గుండు చేయొచ్చనని ట్వీట్‌ చేశారు. మీడియాను కూడా ఆహ్వానిస్తున్నట్టు ఆయ‌న‌ తెలిపారు.

తన ట్వీట్లు ముస్లింలకు వ్యతిరేకంగా ఉన్నట్టు నిరూపిస్తే ఎక్కడికి రమ్మని చెబితే అక్కడకు వచ్చి క్షమాపణ చెబుతాని తెలిపారు. మసీదుల్లోని లౌడ్ స్పీక‌ర్ల‌ గురించే కాకుండా ఆలయాలు, గురుద్వారాల్లోని మైకుల గురించి కూడా ప్రస్తావించానని గుర్తు చేశారు. లౌడ్‌ స్పీకర్ల ద్వారా మసీదులు, గుళ్లు, హరిద్వారాలు చేసే ఉపన్యాసాలు, ప్రార్థన పిలుపులను ‘గూండాగిరీ’గా అభివర్ణిస్తూ సోనూ నిగమ్‌ ట్వీట్లు చేయడంతో వివాదం రేగిన సంగ‌తి తెలిసిందే.