Begin typing your search above and press return to search.

అసెంబ్లీకి గవర్నర్ వస్తుంటే గేటుకు తాళం వేశారు..ఎక్కడంటే?

By:  Tupaki Desk   |   5 Dec 2019 9:30 AM GMT
అసెంబ్లీకి గవర్నర్ వస్తుంటే గేటుకు తాళం వేశారు..ఎక్కడంటే?
X
మూర్తీభవించిన మొండితనంతో ఉన్న వారు పాలకులు అయితే ఎలాంటి పరిస్థితులు ఎదురవుతాయన్న విషయాన్ని ప్రధాని మోడీ.. తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ మాత్రమే కాదు.. పశ్చిమబెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ లాంటివారు తరచూ చూపిస్తుంటారు. ఎప్పుడూ లేని రీతిలో తాజాగా ఆమె రాజ్యంలో చోటు చేసుకున్న ఉదంతం ఇప్పుడు సంచలనంగా మారింది.

పశ్చిమబెంగాల్ గవర్నర్ జగదీప్ ధన్ కర్ ఈ రోజు (గురువారం) అసెంబ్లీ సందర్శనకు వచ్చారు. ఆయన వస్తున్న వేళ.. సాధారణంగా ఆయనకు రాచమర్యాదలు చేస్తూ స్వాగతం పలుకుతారు. గవర్నర్ మీద కారాలు మిరియాలు నూరుతున్న దీదీ సర్కారు పుణ్యమా అని.. అసెంబ్లీ గేటుకు తాళం దర్శనమిచ్చి షాకిచ్చేలా చేసింది. అదే సమయంలో మరో గేటు నుంచి మీడియా.. అధికారుల కోసం ఏర్పాటు చేసి లోపలకు రానిచ్చిన వైనం సంచలనంగా మారింది.

బెంగాల్ రాష్ట్ర అసెంబ్లీలో ప్రవేశ పెట్టాల్సిన బిల్లులకు గవర్నర్ నుంచి ఆమోదం లభించలేదు. దీంతో సభను రెండు రోజుల పాటు అంటే డిసెంబరు ఐదు వరకూ వాయిదా వేస్తున్నట్లుగా స్పీకర్ బీమన్ బెనర్జీ ప్రకటించారు. ఇదిలా ఉంటే.. తాను అసెంబ్లీని సందర్శిస్తానని.. అక్కడి సౌకర్యాల్ని పరిశీలిస్తానని లేఖ ద్వారా స్పీకర్ కు సమాచారం అందించారు. నిబంధనల ప్రకారం గవర్నర్ రాకపోకల కోసం అసెంబ్లీలోని గేట్ నెంబరు 3ను ఏర్పాటు చేశారు.

ముందస్తు సమాచారం అందించి వచ్చిన గవర్నర్ కు షాక్ తగిలేలా.. అసెంబ్లీ గేటుకు తాళం దర్శనమిచ్చింది. దీంతో ఆగ్రహానికి గురయ్యారు గవర్నర్. గేటు ముందే మీడియా సమావేశానని ఏర్పాటు చేసి.. ప్రభుత్వం తీరును తప్పు పట్టారు. తాను అసెంబ్లీకి వస్తానని ముందు రోజు సమాచారం ఇచ్చినా గేటుకు తాళం ఎందుకు వేసినట్లు? అని ప్రశ్నించారు. ప్రజాస్వామ్య భారతానికి ఈ ఉదంతం సిగ్గుచేటుగా అభివర్ణించారు. ఈ వ్యవహారం చూస్తే.. రెండు మదపటేనులు ఒకదానితో మరొకటి ఢీ కొట్టుకుంటే ఎలా ఉంటుందో? పశ్చిమబెంగాల్ సీన్ ఇంచుమించు అలానే ఉందన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది.