Begin typing your search above and press return to search.

బెంగాల్ లో బీజేపీ వ్యూహాన్ని ఓపెన్ చేసిన పీకే

By:  Tupaki Desk   |   30 March 2021 6:30 AM GMT
బెంగాల్ లో బీజేపీ వ్యూహాన్ని ఓపెన్ చేసిన పీకే
X
ఆయన గురి పెడితే.. విజయం దాసోహం కావాల్సిందే. సాధారణంగా రాజకీయ రంగంలో విజయం ఎప్పటికప్పుడు చేతులు మారుతూ ఉంటుంది. కానీ.. రాష్ట్రం ఏదైనా కానీ.. రాజకీయ పార్టీ మరేదైనా కానీ.. తాను మద్దతు ఇచ్చిన వారు గెలుపు తీరాలకు వెళ్లేలా ప్లాన్ చేయటంలో ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిశోర్ (పీకే) మించిన వారు ఉండరన్న విషయం ఇప్పటికే పలుమార్లు నిరూపితమైంది. 2019లో జరిగిన ఎన్నికల్లో ఏపీలో వైసీపీకి వ్యూహకర్తగా వ్యవహరించిన ఆయన.. జగన్ ను సీఎం అయ్యేలా చేయటంలో కీలకంగా వ్యవహరించారు.

ఏపీ ఫలితం పీకే గ్రాఫ్ ను మరింతగా పెంచింది. అంతేకాదు.. మోడీషాలు కన్నేసిన బెంగాల్ ను వారికి దక్కకుండా చేయటం కోసం మమత సైతం పీకే సాయాన్ని కోరాల్సి వచ్చింది. తాజాగా జరుగుతున్న ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లో పశ్చిమబెంగాల్ లో పోటీ హోరీహోరీగా సాగుతుంది. పీకే వ్యూహరచన కమలనాథులకు షాకిస్తుందా? అన్నదిప్పుడు ప్రశ్నగా మారింది. ఇప్పుడు కాకుంటే మరెప్పటికి కాదన్నట్లుగా బీజేపీ వ్యవహరిస్తుంటే.. ఈసారి ఎన్నికల్లో మోడీషాలను నిలువరించాల్సిందేనని మమత గట్టి పట్టుదలతో ఉన్నారు.

ఇలాంటివేళ పీకే పెదవి విప్పారు. బెంగాల్లో పోటీ మమత..మోడీకే మధ్యనే తప్పించి.. ఇతర నేతల మధ్య కాదని తేల్చారు. అభ్యర్థులు ఎవరన్నది బెంగాలీలు పట్టించుకోరని ఆయన చెబుతున్నారు. దేశ వ్యాప్తంగా మోడీ ఎంతో పాపులర్ అని.. ఆ విషయంలో మరో మాట లేదన్న పీకే.. బెంగాల్ లో మాత్రం దీదీ పాపులారిటీ ముందు మోడీ పాపులారిటీ పని చేయదన్నారు.

బెంగాల్ లో బీజేపీ అనుసరిస్తున్న ఐదు పద్దతుల గురించి ప్రస్తావించిన ఆయన.. అందుకు తగిన వ్యూహాలు తమ వద్ద ఉన్నట్లుగా ఆయన సంకేతాలు ఇచ్చారు.బీజేపీ అనుసరిస్తున్న ఐదు విధానాల్లో మొదటిది పోలరైజేషన్ అని.. వివిధ వర్గాల్ని ఒకటిగా చేసి తన వైపు తిప్పుకునేలా చేస్తారని. రెండోది దీదీ ప్రాభవాన్ని తగ్గించి ప్రజల్లో ఆమెపై ఆగ్రహాన్ని పెంచేలా చేయటమన్నారు. మూడోది టీఎంసీని అన్నిరకాలుగా పతనం చేయటమని.. నాలుగోది రాష్ట్రంలో షెడ్యూల్ కులాల మద్దతు పొందటం.. ఐదోది మోడీ పాపులారిటీని బెంగాల్ లో వాడుకోవటంగా చెప్పారు.

బీజేపీ వ్యూహాన్ని చెప్పిన పీకే.. వాటిని ఎదుర్కొనే ప్రతివ్యూహాలు తమ వద్ద స్పష్టంగా ఉన్నాయన్న విషయాన్ని స్పష్టం చేశారని చెప్పాలి. వివిధ రాష్ట్రాల్లో పోలరైజేషన్ జరిగిన ప్రతిసారీ బీజేపీ గెలిచిందన్న ఆయన.. దాన్ని అడ్డుకునే అస్త్రాలు తమ వద్ద ఉన్నాయన్న సంకేతాన్ని ఇచ్చారన్నారు.

అన్ని ఎన్నికల కంటే బెంగాల్ ఎన్నికలు ప్రత్యేకమని.. గడిచిన 30-35 ఏళ్లలో బెంగాల్ లో అధికారపార్టీకి ఒక్కసారి కూడా జాతీయ పార్టీ నుంచి పోటీ ఎదురుకాలేదన్నారు. వామపక్ష పార్టీలు అధికారంలో ఉన్నప్పుడు కాంగ్రెస్ ఎప్పుడూ పోటీ ఇవ్వలేదని.. ఇప్పుడు ప్రాంతీయ పార్టీ అయిన టీఎంసీకి జాతీయ పార్టీ అయిన బీజేపీ నుంచి పోటీ ఎదురవుతుందని.. అందుకే ఈ ఎన్నికలు మిగిలిన రాష్ట్రాలతో పోలిస్తే ప్రత్యేకమన్నారు. బెంగాల్ లో బీజేపీ మూడు అంకెల సీట్లు గెలుచుకుంటే రాజకీయ సలహాదారుగా తప్పుకుంటానని మరోసారి తన పాత శపధాన్ని ప్రస్తావించారు పీకే. ఆయన ఆత్మవిశ్వాసం దీదీకి కొండంత అండగా నిలుస్తుందనటంలో సందేహం లేదు. మరి..బెంగాలీల తీర్పు ఏమిటన్నది మే 2న తేలననుంది.,