Begin typing your search above and press return to search.

బెంగాల్ తొలి దశ పోలింగ్..ఈవీఎంలు ట్యాంపరింగ్‌ ఆరోపణలు - 4 గంటల్లో ఎంతశాతం పోలింగ్ అంటే!

By:  Tupaki Desk   |   27 March 2021 8:04 AM GMT
బెంగాల్ తొలి దశ పోలింగ్..ఈవీఎంలు ట్యాంపరింగ్‌ ఆరోపణలు - 4 గంటల్లో ఎంతశాతం పోలింగ్ అంటే!
X
తృణమూల్ కాంగ్రెస్, బీజేపీ మధ్య సాగిన బెంగాల్ దంగల్ ‌లో 30 సీట్లకు తొలి దశ పోలింగ్ ఈ రోజు ఉదయం 7 గంటలకి ప్రారంభమైంది. అలాగే అసోంలో 47 సీట్లకు పోలింగ్ జరుగుతోంది. అసోంలో ఎన్నికలపై దేశ ప్రజల్లో అంతగా ఆసక్తి లేదు. కానీ ,బెంగాల్‌ లో ఏకంగా 8 దశల్లో ఎన్నికలు జరుగుతుండటం , ఈసారి ఎలాగైనా అధికారంలోకి రావాలని బీజేపీ రకరకాల రాజకీయ అస్త్రశస్త్రాలు ప్రయోగించడంతో బెంగాల్ వార్ ‌లో హీట్ బాగా పెరిగింది. తృణమూల్ కాంగ్రెస్ సైతం ఎప్పుడూ లేనంతగా పోరాటం చేయాల్సి రావడంతో గెలుపు ఎవరిది అనే టెన్షన్ రాజకీయ వర్గాల్లో కనిపిస్తోంది. తొలిదశకే ఓ రేంజ్‌లో అగ్రనేతల ప్రచారం సాగడంతో నేటి పోలింగ్ సరళి పై అందరిలో ఆసక్తి పెరిగిపోయింది.

ఉదయం 7 గంటలకు మొదలైన పోలింగ్‌లో మహిళా ఓటర్లు భారీ ఎత్తున పోలింగ్ కేంద్రాలకు తరలివచ్చారు. తొలి నాలుగు గంటల్లో రాష్ట్రంలో 28.13 శాతం పోలింగ్‌ నమోదైనట్లు ఎన్నికల సంఘం వెల్లడించింది. పశ్చిమబెంగాల్లో ఎన్నికల జరుగుతున్న పూరూలియా, మిడ్నాపూర్‌ జిల్లాల్లో మావోయిస్టుల ప్రభావం అధికంగా ఉన్నందున భారీ భద్రత ఏర్పాటు చేశారు. అయినా ఓటర్లు నిర్భయంగా పోలింగ్ కేంద్రాలకు చేరుకుని ఓటు హక్కు వినియోగించుకుంటున్నారు. నిన్న మిడ్నాపూర్‌ లో బీజేపీ కార్యకర్త హత్య మినహా ఇతరత్రా అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోలేదు. కాశీపూర్‌ నియోజకవర్గంలో పోలింగ్‌ ప్రక్రియపై అధికార తృణమూల్‌ కాంగ్రెస్‌ అసంతృప్తి వ్యక్తం చేసింది. ఇక్కడ తృణమూల్‌కు ఓటేస్తే బీజేపీకి పడుతుందన్న ఆరోపణలు రావడంతో టీఎంసీ నేతలు విమర్శలకు దిగారు. బీజేపీ ఈవీఎంలను ట్యాంపర్‌ చేసి ఎన్నికల్లో లబ్ది పొందాలని చూస్తోందని టీఎంసీ ఆరోపించింది. పలు చోట్ల బీజేపీ నేతలు బూత్‌ల ఆక్రమణలు పాల్పడి ఓటర్లను పోలింగ్ కేంద్రాలకు రానివ్వకుండా చేస్తున్నారని కూడా ఆరోపణలు చేసింది.

ఈసారి బెంగాల్ రాజకీయాల్లో జై శ్రీరామ, నమఃశివాయ నినాదాలు హోరెత్తాయి. బీజేపీ హిందు ఓట్ కార్డ్ ‌ని బలంగా ప్రజల్లోకి తీసుకెళ్లాలని ప్రయత్నించగా బెంగాల్‌లో కాళికామాత తర్వాత ఎక్కువగా పూజించే , పరమేశ్వరుణ్ని దీదీ నమ్ముకుంది. ఓవైపు బీజేపీ జై శ్రీరామ్ నినాదంతో ముందుకు వెళ్లగా అందుకు పూర్తి వ్యతిరేకమైన వాణి వినిపిస్తూ మమతా బెనర్జీ ప్రజల్లోకి వెళ్లారు. అందువల్ల ప్రజలు ఎటువైపు ఉన్నారనేది ఆసక్తిగా మారింది.