Begin typing your search above and press return to search.

కంచుకోట‌లో మ‌మ‌త గెలిచేనా ? స‌ర్వ‌త్రా ఉత్కంఠ..!!

By:  Tupaki Desk   |   20 March 2021 12:30 PM GMT
కంచుకోట‌లో మ‌మ‌త గెలిచేనా ?  స‌ర్వ‌త్రా ఉత్కంఠ..!!
X
బెంగాల్ ముఖ్య‌మంత్రి, వ‌రుస‌గా ప‌దేళ్లుగా రాష్ట్రాన్ని ఏలుతున్న తృణ‌మూల్ కాంగ్రెస్ అధినేత మ‌మ‌తా బెన‌ర్జీకి గొప్ప చిక్కే వ‌చ్చిప‌డింద‌ని అంటున్నారు ప‌రిశీల‌కులు. దీనికి కార‌ణం.. ఆమెకు కంచుకోట‌గా ఉన్న నందిగ్రామ్ నియోజ‌క‌వ‌ర్గాన్ని బీజేపీ నేత‌లు టార్గెట్ చేయ‌డ‌మే. ఇక్క‌డ గెలిచి తీరుతామ‌ని.. బీజేపీ నేత‌లు స‌వాళ్లు రువ్వుతున్నారు. అంతేకాదు.. ఇక్క‌డ మ‌మ‌త‌ను ఓడించేందుకు వ్యూహాత్మ‌కంగా అడుగులు వేస్తున్నారు. దీంతో ఈ నియోజ‌క‌వ‌ర్గం ఇప్పుడు దేశ‌వ్యాప్తంగా హాట్ టాపిక్‌గా మారిపోయింది.

నందిగ్రామ్‌.. టీఎంసీ కంచుకోట. 2007లో భూసేకరణకు వ్యతిరేకంగా నందిగ్రామ్‌లో జరిగిన ఉద్యమా లు బెంగాల్‌ను సుదీర్ఘ కాలం ఏలిన వామపక్ష ఫ్రంట్‌ పునాదిని కదిలించాయి. టీఎంసీ రెండుసార్లు అధికారం కైవసం చేసుకోవడానికి ఈ గడ్డపై జరిగిన ఉద్యమాలు కీలకపాత్ర పోషించాయి. ఇటీవలే టీఎంసీ నుంచి బీజేపీలోకి చేరిన సువేందు అధికారి.. దమ్ముంటే నందిగ్రామ్‌ నుంచి పోటీ చేయాలని సీఎం మమతా బెనర్జీకి సవాల్‌ విసిరిన విష యం తెలిసిందే. దీంతో ఈసారి అసెంబ్లీ ఎన్నికల్లో నందిగ్రామ్‌ నుంచే మ‌మ‌త పోటీ చేస్తున్నారు.

2016లో టీఎంసీ తరఫున సువేందు పోటీ చేసి 67.2% ఓట్లతో ఘన విజయం సాధించారు. బీజేపీ ఈసారి నందిగ్రామ్‌ సీటు ఆయనకే ఇవ్వడంతో బెంగాల్‌లో అత్యంత కీలక యుద్ధానికి తెరలేచింది. నందిగ్రామ్ ‌లో 2.75 లక్షల మంది ఓటర్లు ఉండగా, వారిలో 62 వేల మంది మైనారిటీలు ఉన్నారు. మమత పోటీ చేస్తున్నందున మైనారిటీలంతా ఆమె వైపు సంఘటితమయ్యే అవకాశాలున్నాయని, సువేందు హిందూ ఓట్లే చీలుస్తారని పరిశీలకులు భావిస్తున్నారు.

గత ఎన్నికల్లో ముస్లిం ఓట్లన్నీ తృణమూల్‌కే వెళ్లాయి. 2006లో తృణమూల్‌, సీపీఐ నుంచి ముస్లిం అభ్యర్థులే పోటీ చేశారు. వారిద్దరి ఓట్ల మధ్య వ్యత్యాసం 3.4 శాతమే. 2011లో టీఎంసీ తరఫున ముస్లిం అభ్యర్థి పోటీ చేసి, సీపీఐ హిందూ అభ్యర్థిపై 26 ఓట్ల తేడాతో గెలిచారు. 2016లో నందిగ్రామ్‌ నుంచి సీపీఐ ముస్లిం అభ్యర్థిని నియమించినా టీఎంసీ అభ్యర్థి సువేందుకే అత్యధిక ఓట్లు లభించాయి. ఈ నేప‌థ్యంలో ఇప్పుడు ఇదే ఫార్ములా క‌నుక వ‌ర్క‌వుట్ అయితే.. మ‌మతకు గ‌ట్టి పోటీ త‌ప్ప‌ద‌ని రాజ‌కీయ వ‌ర్గాలు అంచ‌నా వేస్తున్నాయి. దీంతో మ‌మ‌త రాష్ట్రంలో అధికారంలోకి వ‌చ్చేందుకే కాకుండా.. త‌న గెలుపున‌కు కూడా తీవ్రంగా శ్ర‌మించాల్సి వ‌స్తోంది.