Begin typing your search above and press return to search.

పార్టీని వీడే వాళ్లంతా 'చెత్త' అట..సీఎంగారి భాష్యం!

By:  Tupaki Desk   |   18 Jun 2019 11:00 PM IST
పార్టీని వీడే వాళ్లంతా చెత్త అట..సీఎంగారి భాష్యం!
X
తమ పార్టీని వీడే వాళ్లంతా 'చెత్త'తో సమానం అని అంటున్నారు పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ. ఇటీవలి లోక్ సభ సార్వత్రిక ఎన్నికల్లో బెంగాల్ లో బీజేపీ మంచి ఫలితాలు సాధించుకున్న సంగతి తెలిసిందే. ఊహించని స్థాయిలో అక్కడ ఫలితాలను రాబట్టుకుంది బీజేపీ. తద్వారా అసెంబ్లీ ఎన్నికల్లో మమతా దీదీకి గట్టి పోటీ ఇవ్వబోతున్న సంకేతాలను ఇచ్చింది కమలం పార్టీ.

ఇక అక్కడ టీఎంసీ - బీజేపీ కార్యకర్తల మధ్యన కూడా ఫైట్ గట్టిగానే ఉంది. ఈ క్రమంలో బెంగాల్ లో బలపడేందుకు మరింతగా కసరత్తు చేస్తూ ఉంది బీజేపీ. అందు కోసం ఫిరాయింపులను ప్రోత్సహించేందుకు కూడా ఆ పార్టీ వెనుకాడటం లేదు.

ఆ క్రమంలో ముందుగా మున్సిపాలిటీలు - కార్పొరేషన్ల స్థాయిలోని నేతలను బీజేపీ చేర్చుకుంటూ ఉంది. టీఎంసీ నుంచి వచ్చే కార్పొరేటర్లకు - మున్సిపల్ కౌన్సిలర్లకు బీజేపీ రెడ్ కార్పేట్ పరుస్తూ ఉంది. ఇలాంటి క్రమంలో ఈ అంశంపై మమత స్పందించారు.

తమ పార్టీని వీడి బయటకు వెళ్లే వాళ్లంతా అవినీతి పరులు - దురాశపరులు అని ఆమె వ్యాఖ్యానించారు. అలాంటి వారు చెత్తతో తో సమానం అని, అలాంటి చెత్తను బీజేపీ ఏరుకుంటోందని మమతా బెనర్జీ వ్యాఖ్యానించారు.

మరి వెళ్లే వాళ్లు చెత్తనా - బంగరమా.. అనే అంశం బెంగాల్ అసెంబ్లీ ఎన్నికలు జరిగితే కానీ ఎవరికీ స్పష్టత రాకపోవచ్చు!