Begin typing your search above and press return to search.

విమానాల్లో డ‌బ్బులు త‌ర‌లించిన జ‌ర్న‌లిస్టు

By:  Tupaki Desk   |   1 Sep 2018 1:46 PM GMT
విమానాల్లో డ‌బ్బులు త‌ర‌లించిన జ‌ర్న‌లిస్టు
X
అక్ర‌మ సంపాద‌న విదేశాల‌కు త‌ర‌లివెళ్లిన ప‌ర్వంలో...ఇప్ప‌టికే అనేక లంచ‌గొండుల ఉదంతం సంచ‌ల‌నంగా మారిన సంగతి తెలిసిందే. అయితే దీనికి కొన‌సాగింపుగా మైండ్ బ్లాంక్ అయ్యే అంశాలు తెర‌మీద‌కు వ‌చ్చాయి. అక్ర‌మ సంపాద‌న‌కు సంబంధించిన ధ‌నాన్ని త‌ర‌లించేందుకు ఏకంగా విమానాల‌ను ఉప‌యోగించార‌ని తేలింది. వీఐపీలు ఉప‌యోగించే విమానాల‌తో ఈ అక్ర‌మ‌బాగోతం సాగింద‌ని తేల్చారు. రూ.100 కోట్ల మేర అక్రమ లావాదేవీలు జరిపిన ఉదంతంలో సీనియర్‌ జర్నలిస్టు ఉపేంద్రరాయ్‌ ను ఈ ఏడాది అరెస్టు చేసిన సంగ‌తి తెలిసిందే. ఆయ‌న్ను విచార‌ణ‌లో సంచ‌ల‌న అంశాలు తెర‌మీద‌కు వ‌చ్చాయి. అక్ర‌మ సంపాద‌న‌న‌ను త‌ర‌లించ‌టంతోపాటు సివిల్‌ ఏవియేషన్‌ బ్యూరో సెక్యూరిటీ (బీసీఏఎస్‌)పాస్‌ లు పొంది దేశ భద్రతకు ముప్పు కలిగేలా వ్యవహరించినట్లు తేలింది. దేశ విదేశాలకు పెద్దమొత్తంలో డబ్బును తరలించేందుక వీఐపీలు తమ ప్రయాణాలకోసం వినియోగించే ఛాటర్డ్ విమానాలను ఉపేంద్ర రాయ్ వినియోగించినట్లు ఈడీ అనుమానం వ్యక్తం చేస్తోంది. తప్పుడు పత్రాలతో ఏరోడ్రోమ్‌ ఎంట్రీ పాస్‌ లు పొంది దేశంలోని అన్ని విమానాశ్రయాల్లో అత్యంత భద్రత ఉండే, నిషిద్ధ ప్రాంతాల్లో ప్రవేశానికి అనుమతి పొంది ఈ కొత్త త‌ర‌హా మోసం చేసిన‌ట్లు పేర్కొంది.

ఉపేంద్ర రాయ్ ఇటు భ‌ద్ర‌త ప‌ర‌మైన అంశాలు - అటు సాంకేతిక ప‌రిణామాల‌ను ఆధారంగా చేసుకొని అవినీతికి పాల్ప‌డిన‌ట్లు ఈడీ భావిస్తోంది. స‌హ‌జంగా వీఐపీ విమానాలను పెద్దగా తనిఖీ చేయరు. దీన్నే ఆసరాగా చేసుకుని అందులో కొన్ని ప్రత్యేకంగా రంద్రాలు చేయించి అందులో క్యాష్‌ ను దాచి దేశాలను దాటించే వారని ఈడీ పేర్కొంటోంది. ఓ ఏవియేషన్ ఇంజనీర్‌ తో కలిసి ప్రైవేట్ విమానాల్లో ఎవ్వరికీ కనిపించకుండా ఉండేలా డ‌బ్బును దాట‌వేసేలా ప్ర‌త్యేక పాకెట్స్ తయారు చేయాలని సూచించేవాడని ఈడీ వెల్లడించింది. విమాన యజమానికి తెలియకుండా ఈ పాకెట్స్‌ లో క్యాష్ నింపి దేశాన్ని దాటించేవాడని తెలిపింది. ఇందుకోసం తనిఖీలు తక్కువగా నిర్వహించే వీఐపీ విమానాలనే టార్గెట్‌ గా చేసుకునేవాడని ఈడీ వెల్లడించింది. దేశంలో మొత్తం 400 చిన్న విమానాశ్రయాలుండగా అందులో 100 మాత్రమే కమర్షియల్ ఆపరేషన్స్‌ కు వినియోగిస్తున్నారు. వీఐపీ విమానాల్లో డబ్బును నింపేందుకు ఈ చిన్న విమానాశ్రాయాలను టార్గెట్‌ గా చేసుకుని ఉండొచ్చనే అనుమానం విచారణాధికారులు పేర్కొంటున్నారు.

ఉపేంద్ర రాయ్ చాలా వ్యూహాత్మ‌కంగా వ్య‌వ‌హ‌రించార‌ని ఈడీ తెలిపింది. దేశంలోని అన్ని విమానాశ్రయాలకు ఎంట్రీ పొందేలా పౌరవిమానయాన శాఖ‌తో లాబీయింగ్ చేసుకున్నారు. ఏరోడ్రోమ్‌ లోకి ప్రవేశించేందుకు భద్రతా సిబ్బంది పాస్ జారీ చేసింది. అయితే, ఇందుకోసం ఆయన తప్పుడు డాక్యుమెంట్లను సమర్పించిన అంశంగా తాజాగా వెలుగులోకి వచ్చింది. ఈ పాస్‌ ను అక్ర‌మంగా న‌గ‌దు త‌ర‌లించేందుకే పొంది ఉంటాడ‌ని ప‌లువురు భావిస్తున్నారు. ఉపేంద్ర రాయ్ ఎక్కువగా ఎయిర్ వన్ విమానంనే వినియోగించేవాడని తెలిపిన ఈడీ... దుబాయ్‌లో ఎక్కువ కాలం ఈ విమానాలు పార్క్ చేసి ఉండేవని తెలిపింది. ఎక్కువకాలం విమానం అక్కడే పార్క్ చేసి ఉండటంతో అనుమానం వచ్చినట్లు ఈడీ పేర్కొంది. దుబాయ్ ప్రధాన విమానాశ్రయం కాకుండా అల్ మక్టూమ్ అంతర్జాతీయ విమానాశ్రయంను పార్కింగ్ కోసం వినియోగించేవాడని తెలిపింది. దుబాయ్‌తో పాటు ఎయిర్ వన్ విమానాలు రష్యాకు కూడా వెళ్లేవని ఈడీ వివరించింది.

కాగా, ‘ఢిల్లీకి చెందిన ఉపేంద్ర రాయ్‌ అనే సీనియర్‌ జర్నలిస్ట్ - ఎయిర్‌ వన్‌ ఏవియేషన్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌ భద్రతా అధికారి ప్రసూన్‌ రాయ్‌ మరికొందరితో కలిసి బీసీఏఎస్‌ ను - ఢిల్లీ ఇంటర్నేషనల్‌ ఎయిర్‌ ఫోర్స్ ను మోసం చేశారు. తప్పుడు పత్రాలతో ఏరోడ్రోమ్‌ ఎంట్రీ పాస్‌ లు పొంది దేశంలోని అన్ని విమానాశ్రయాల్లో అత్యంత భద్రత ఉండే, నిషిద్ధ ప్రాంతాల్లో ప్రవేశానికి అనుమతి పొందారు. దేశ భద్రతకు ముప్పు కలిగించేలా వ్యవహరించారు. అక్రమ డబ్బు పెట్టుబడులకు రాహుల్‌ శర్మ - సంజయ్‌ స్నేహి సహకరించారు. 2017లో ఉపేంద్ర ఖాతాలో ఒక్కసారిగా రూ.79 కోట్లు జమయ్యాయి. ఐటీ శాఖలో సెటిల్‌ మెంట్లకు గాను పలు నకిలీ కంపెనీల నుంచి రూ.16 కోట్లు వచ్చాయి’ అని సీబీఐ త‌న చార్జ్‌ షీట్‌ లో పేర్కొంది. తాజాగా, ఇదిలా ఉంటే ఉప్పేంద్ర రాయ్‌ కు సంబంధించిన రూ.26 కోట్ల ఆస్తులను ఈడీ స్వాధీనం చేసుకుంది. అంతేకాదు షెల్ కంపెనీల ద్వారా తన కంపెనీల్లోకి నిధులు బలవంతంగా తరలించేవాడని ఈడీ వెల్లడించింది.