Begin typing your search above and press return to search.

కుంభమేళాకు వెళ్లి వచ్చారా.. అయితే , క్వారంటైన్ తప్పనిసరి !

By:  Tupaki Desk   |   24 April 2021 7:30 AM GMT
కుంభమేళాకు వెళ్లి వచ్చారా.. అయితే , క్వారంటైన్ తప్పనిసరి !
X
దేశంలో కరోనా సెకండ్ వేవ్ కొనసాగుతుంది. గత మూడు రోజులుగా రోజుకి మూడు లక్షలకి పైగా పాజిటివ్ కేసులు నమోదు అవుతున్నాయి. ఇదిలా ఉంటే... ఉత్తరాఖండ్ రాష్ట్రం లోని హరిద్వార్ లో మహా కుంభమేళా లో స్నానాలు చేసిన వారిలో అనేక మంది కరోనా వైరస్‌ బారిన పడ్డారు. దేశ వ్యాప్తంగా కరోనా మహమ్మారి విలయ తాండవం చేస్తున్న పరిస్థితుల్లో గంగానది పుణ్య స్నానాలు ప్రజల పాలిట పాపాలుగా మారుతున్నాయి. కుంభమేళా లో రోజూ లక్షల సంఖ్యలో భక్తులు గంగా స్నానం కోసం దేశంలోని అన్ని ప్రాంతాల నుంచి వెళ్లారు. తెలంగాణ రాష్ట్రం నుంచి కూడా పలువురు కుంభమేళాకు వెళ్లారు. ఈ నేపథ్యంలో కుంభేమేళాకు వెళ్లి వచ్చిన వారి పట్ల తెలంగాణ ప్రభుత్వం అప్రమత్తమైంది. కుంభమేళాకు వెళ్లి వచ్చిన వారికి ప్రభుత్వం క్వారంటైన్ తప్పనిసరి చేసింది.

ఈ మేరకు డీహెచ్‌ శ్రీనివాస్ ఆదేశాలు జారీ చేశారు. ఖచ్చితంగా 14 రోజులపాటు కుటుంబ సభ్యులకు దూరంగా ఉండాలని సూచించారు. ఇంట్లోనూ మాస్క్‌ ధరిచాలన్నారు. జలుబు, దగ్గు, గొంతు నొప్పి, తలనొప్పి, జ్వరం వంటి లక్షణాలు కనిపిస్తే, వెంటనే కరోనా‌ నిర్ధారణ పరీక్షలు చేయించుకోవాలని చెప్పారు. మూడు షాహీ స్నానాల సమయంలో ఒక్కరోజులో కనీసం 20 లక్షల మంది హాజరయ్యారని అధికారులు అంచనా వేశారు. గంగా స్నానం చేసి తమ ప్రాంతాలకు తిరిగి వెళుతున్న అనేక మందిలో కరోనా లక్షణాలు కనిపించాయి. కుంభమేళాలో పాల్గొని తిరిగి వస్తున్న యాత్రికులకు కర్ణాటక ప్రభుత్వం ఆర్టీ-పీసీఆర్‌ పరీక్షను తప్పనిసరి చేసింది.

ఉత్తరాఖండ్ కరోనా రాష్ట్ర‌ కంట్రోల్‌ రూమ్‌ గణాంకాల ప్రకారం, ఏప్రిల్‌ 10- 14 మధ్య హరిద్వార్‌ లో పరీక్షలు చేయించుకున్న వారిలో 1700 మందికి పైగా కరోనా పాజిటివ్‌ గా గుర్తించారు. మహా కుంభమేళా లో పాల్గొన్న అనేకమంది సాధువులకు కూడా కరోనా పాజిటివ్ నిర్దారణ అయింది. నిర్వాణి అఖాడాకు చెందిన మహా మండలేశ్వర్‌ కపిల్ ‌దేవ్‌ కరోనా వైరస్ తో మరణించారు. కుంభమేళాలో పాల్గొనేందుకు మధ్యప్రదేశ్‌ నుంచి ఆయన హరిద్వార్‌ కు వెళ్ళారు. అయితే అక్కడ కుంభ్‌ మేళాలో పాల్గొన్న అనంతరం జరిపిన పరీక్షలో పాజిటివ్ ‌గా నిర్ధారణ కావడంతో ఆయనకు డెహ్రాడూన్ లోని కైలాష్‌ హాస్పిటల్ లో ట్రీట్మెంట్ అందించారు. కరోనాతో పోరాడుతూ ఆయన తుది శ్వాస విడిచారు. కుంభ్‌మేళా సమయంలో కరోనా వైరస్‌ సంక్రమణతో మరణించిన మొదటి ప్రధాన సాధువు కపిల్‌ దేవ్‌.