Begin typing your search above and press return to search.

పథకాలే కేసీఆర్ కు గుదిబండలు

By:  Tupaki Desk   |   19 Nov 2015 10:30 PM GMT
పథకాలే కేసీఆర్ కు గుదిబండలు
X
తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు ఆలోచనలు అద్భుతం. రాజకీయ నాయకులందరిలోనూ ఆదర్శనీయమైన ఆలోచనలు ఆయనకే వస్తాయి. నిరుపేదలకు మేలు చేయాలనే తలంపు కూడా ఆయనకే ఎక్కువగా ఉంటుంది. కానీ, ఆయన ఆలోచనలే ఆయనకు, ఆయన పార్టీకి ప్రతిబంధకాలు కూడా.

ఉదాహరణకు దళితులకు మూడు ఎకరాల పంపిణీనే తీసుకుందాం. దళితులకు లేదా నిరుపేదలకు ఎకరం అరెకరం ఇస్తే వారి జీవితం మొత్తం ఎలా వెళ్లిపోతుంది? వారికి కనీసం మూడు ఎకరాలు ఇస్తే వారి కుటుంబాలు తరతరాలుగా ఎటువంటి ఇబ్బంది లేకుండా జీవనం సాగిస్తాయి. అయితే, రాష్ట్రంలో కానీ దేశంలో కానీ దళితులందరికీ కుటుంబానికి మూడు ఎకరాల చొప్పున ఇవ్వాలంటే సాధ్యమేనా? దేశంలోని భూమి కొంత కాలానికి మొత్తం దళితుల చేతిలోనే ఉంటుంది. మిగిలిన అవసరాలకు భూమి కావాలన్నా దొరకదు. అందుకే, గత ప్రభుత్వాలు దానికి కొంత పరిమితి విధించాయి. కేసీఆర్ అధికారంలోకి వచ్చిన తర్వాత మూడెకరాల పథకం ప్రవేశపెట్టారు. ఆయన ఎంత మందికి మూడు ఎకరాల చొప్పున ఇవ్వగలిగారు? ఒక్కో జిల్లాలో వేళ్ల మీద లెక్కించదగిన స్థాయిలోనే ఆయన లబ్ధిదారులను ఎంపిక చేశారు. ఐదేళ్లలో మహా అయితే ఓ పది వేలమందికి మినహా భూములు ఇవ్వలేరు.

ఇక డబుల్ బెడ్ రూం పథకాన్నే తీసుకుందాం. ఒక్కో ఇంటిని నిర్మించడానికి పది లక్షలు అవుతుందట. ఇంత భారీ వ్యయంతో ఎన్ని ఇళ్లు నిర్మించగలరు? గతంలో ఏడాదికి 5000 ఇళ్లు నిర్మిస్తే ఇప్పుడు 500 ఇళ్లు మాత్రమే నిర్మించగలరు. ఒకవేళ గతంలోలా ఏడాదికి 5000 ఇళ్లు నిర్మించాలంటే బడ్జెట్ ను పది రెట్లు పెంచాలి. బడ్జెట్ మొత్తానికి ఈ పథకాలకే కేటాయించేస్తే మరి మిగిలిన పథకాల సంగతేమిటి? అభివృద్ధి విషయం ఏమిటి? అప్పులను తీర్చేది ఎలా? ఇటువంటి విషయాలన్నీ వస్తాయి. అందుకే కేసీఆర్ ప్రవేశపెట్టిన మూడెకరాలు, డబుల్ బెడ్ రూం వంటి పథకాలు అద్భతుమే. కానీ, వాటిని పూర్తిస్థాయిలో అమలు చేయడం సాధ్యం కాదు. పదవీ కాలం ముగిసేసరికి అటువంటి పథకాలే కేసీఆర్ కు గుదిబండగా మారనున్నాయి.