24 గంటల్లో జరగనున్న నెల్లూరు జిల్లా ఆత్మకూరు ఉప ఎన్నికపై వైసీపీ పెట్టుకున్న సంక్షేమం ఆశలు ఒట్టి మాటే అవుతోందా? అక్కడ సంక్షేమానికి ప్రజలు ఎన్నికల బూత్‌ల ముందుకు వచ్చే పరిస్థితి లేదా? అంటే.. ఔననే అంటున్నారు వైసీపీ నాయకు లు. ప్రస్తుతం వైసీపీ ప్రభుత్వ మూడు సంవత్సరాల పాలనకు గీటు రాయిగా భావిస్తున్న ఆత్మకూరు ఉప ఎన్నిక.. సంక్షేమానికి పెద్ద పీట వేసే అవకాశం లేదని వైసీపీ నేతల మధ్యే జోరుగా చర్చ సాగుతోంది. నిజానికి తాము భారీ ఎత్తున సంక్షేమం అమలు చేస్తున్నామని.. స్వతంత్ర దేశంలో ఏ రాష్ట్రం కూడా అమలు చేయలేదని.. సీఎం జగన్ చెబుతున్నారు.
ఈ సంక్షేమమే తమను గట్టెక్కిస్తుందని.. మూడు పదుల పదవీ యోగం తమదేనని వైసీపీ నేతలు ఊదర గొడుతున్నారు. అయితే.. తాజాగా ఇక్కడ ప్రారంభమైన ఆత్మకూరు ఉప ఎన్నికలో చేయించిన అంతర్గత సర్వేలో.. సంక్షేమానికి మైలు రాళ్లు కనిపించడం లేదని.. తేలిపోయిందని వైసీపీ నాయకులు గుసగుసలాడుతున్నారు.
ఈ నేపథ్యంలోనే ఇంటింటికీ రూ.500 చొప్పున ఓటుకు పంచుతున్నారని.. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు బహిరంగ విమర్శలకు దిగారు.. ఇవిగో సాక్ష్యాలు అంటూ.. ఆయన కొన్ని ఆధారాలతో ఎన్నికల సంఘానికి ఫిర్యాదు కూడా చేశారు.
సరే.. ఈ ఫిర్యాదుల పరిస్థితి ఎలా ఉన్నా.. తాము బలంగా విశ్వసించిన సంక్షేమం ఇప్పుడు ఓట్లు రాల్చే పరిస్థితి లేదని.. వైసీపీలో గుసగుస వినిపిస్తుండడమే ఆ పార్టీలో ప్రమాద సంకేతాలను నింపుతోంది. మరో రెండేళ్లలోనే సార్వత్రిక సమరానికి ఏపీ సిద్ధమవుతున్న నేపథ్యంలో పూర్తిగా రాష్ట్ర అభివృద్దిని సైతం పక్కన పెట్టి..
సంక్షేమ పేరిట పంపకాలు చేపట్టిన వైసీపీ.. ఇది ఫలించే అవకాశం లేదని తెలియడే ఇప్పుడు ప్రశ్నగా మారింది. ఆత్మకూరులో సింపతీ పనిచేస్తుందని.. దీనికి సంక్షేమం కలిసి వస్తుందని.. దీంతో తమ అభ్యర్థి విక్రమ్ రెడ్డి లక్షకు పైగా.. ఓట్ల మెజారిటీ సాధిస్తారని.. ఆది నుంచి వైవీ సుబ్బారెడ్డి, సజ్జల రామకృష్ణారెడ్డి వంటివారు చెబుతున్నారు.
అయితే.. ప్రచారం పర్వం మొదలయ్యాక.. ప్రజానాడి తెలిసిపోయిందనేది వైసీపీ నేతల మాట. అందుకే ఇప్పుడు డబ్బుల గలగలలు తప్ప.. మరేమీ పనిచేయబోవని.. అంటున్నారు. ఇదే నిజమైతే.. జగన్‌కు రెండు రకాల ఇబ్బందులు తప్పేలా కనిపించడం లేదని అంటున్నారు. ఒకటి సంక్షేమం అమలు చేసినా.. ప్రజల మనసును దోచుకోలేక పోయిన నాయకుడిగా ఆయన పేరు తెచ్చుకోవడంతోపాటు.. రాష్ట్రాన్ని ఎలాంటి అభివృద్ది లేకుండా చేశారనే అపవాదును ఆయన మోయాల్సి వుంటుందని.. అంతర్గత చర్చల్లో వైసీపీ నాయకులు చెబుతుండడం గమనార్హం. మరి ఏం జరుగుతుందో చూడాలి.