Begin typing your search above and press return to search.

జగన్ కు స్వాగతం చెప్పిన ఖాళీ ఖజానా!

By:  Tupaki Desk   |   30 May 2019 10:07 AM GMT
జగన్ కు స్వాగతం చెప్పిన ఖాళీ ఖజానా!
X
ఆంధ్రప్రదేశ్ ఆర్థిక పరిస్థితి అత్యంత దుర్భరంగా ఉంది! ఎంత దుర్భరంగా అంటే.. ఓవర్ డ్రాఫ్ట్ కు వెళ్లి రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నుంచి అప్పుడు తెచ్చుకునే పరిస్థితి కూడా లేదు! ఖజానాలో ఇప్పుడు ఉన్న డబ్బు కేవలం వంద కోట్ల రూపాయలు మాత్రమే అంటే విస్మయం కలగక మానదు.

ఐదు సంవత్సరాల చంద్రబాబు పాలన ఆసాంతం అప్పులతోనే నడిచింది. ఆ అప్పులు చేసి చంద్రబాబు నాయుడు విలాసాలకు పోయారు. విదేశీ పర్యటనలు మొదలు, దీక్షలు, ధర్నాలు అంటూ చంద్రబాబు నాయుడు ప్రజల సొమ్మును అలా విచ్చలవిడిగా ఖర్చు పెట్టారు. ఇక ఎన్నికల ముందు పసుపు- కుంకుమ, అన్నదాతా సుఖీభవ అంటూ ఓట్ల కొనుగోలు కోసం కోట్ల రూపాయలను వెచ్చించారు.

మే ముప్పైన జగన్ ప్రమాణ స్వీకారం చేశారు. జూన్ ఒకటో తేదీకి ప్రభుత్వం చేతిలోకి ఐదు కోట్ల రూపాయల అవసరం ఉంది. ప్రభుత్వ ఉద్యోగుల జీతాలకు, ఇతర పెన్షన్లకు ఈ మొత్తం అవసరం! ఖజానాలో ఉన్నది కేవలం వంద కోట్ల రూపాయలు!

ఈ పరిస్థితుల్లో ఒకటో తేదీన ఏపీ ప్రభుత్వం ఉద్యోగుల అకౌంట్లలోకి జీతాలను వేయగలదా? అనేది సందేహంగా మారింది. రిజర్వ్ బ్యాంక్ నుంచి అప్పుడు తెచ్చుకునే పరిస్థితి కూడా లేదు. ఏపీ ప్రభుత్వానికి ఐదు వేల కోట్ల రూపాయల వరకూ లోన్ ఎలిజిబులిటీ ఉండేది. అయితే ఎన్నికల ముందు చంద్రబాబు నాయుడు నాలుగు వేల కోట్ల రూపాయలు తెచ్చి.. పసుపు-కుంకుమ కింద పంచారు. ఓట్ల కొనుగోలుకు చంద్రబాబు నాయుడు ఆ పథకాన్ని అమలు పెట్టిన సంగతి తెలిసిందే.

ఈ నేపథ్యంలో ఆర్బీఐ కూడా ఇప్పుడు ఏపీ ప్రభుత్వానికి కేవలం వెయ్యి కోట్ల రూపాయల నిధులు మాత్రమే ఇవ్వగలదని స్పష్టం అవుతోంది. ఆఖరికి ఉద్యోగులకు జీతాలు కూడా ఇవ్వలేని స్థితిలోకి తీసుకొచ్చి చంద్రబాబు నాయుడు మాజీ ముఖ్యమంత్రి అయ్యారు. కనీస అవసరాలకే నిధులు లేవు. ఇలాంటి సందర్భంలో జగన్ మోహన్ రెడ్డి ఏం చేస్తారో, తను చెప్పిన కొత్త పథకాలను ఎలా అమలు చేస్తారో!