Begin typing your search above and press return to search.

ఇక నాలుగు రోజులే పనిదినాలు!

By:  Tupaki Desk   |   29 Jan 2019 1:30 AM GMT
ఇక నాలుగు రోజులే పనిదినాలు!
X
ఉద్యోగులకు నిజంగా ఇది శుభవార్తే. వారు ఈ మాట విన్నారంటే తప్పక ఎగిరి గంతేస్తారు. వారికి ఉన్న టెన్షన్ అన్ని తీరి హాయిగా రిలాక్స్ అవ్వడం ఖాయం.. ఇప్పటి వరకు వారానికి ఆరురోజులుగా ఉన్న పని దినాలను ఇక మీదట నాలుగు రోజులు చేయాలనే ప్రతిపాదన తెరమీదికి వచ్చింది. దీనికి ప్రపంచ స్థాయిలోని ఆర్థిక వేత్తలు, సైకలాజిస్టులు మద్దతు పలుకుతున్నారు.

వారానికి ఏడురోజులు ఉండగా అందులో ఆరురోజులు పని దినాలు. ఒకరోజు వీక్లీ ఆఫ్ ఉద్యోగులకు ఇచ్చేవారు. అలాగే కొన్ని సంస్థల్లో ఐదు రోజులు పనిదినాలు ఉండగా రెండురోజులు వీక్లీ ఆఫ్ ఇస్తున్నారు. అయితే కార్యాలయాల్లో పని ఒత్తిడి కారణంగా ఉద్యోగులు తమకు వచ్చే వీక్లీ ఆఫ్ కోసం కళ్లు కాయలు కాసేలా ఎదురుచూసేవారు. ఇక సాఫ్ట్ వేర్ ఉద్యోగులకు వారానికి ఐదురోజులు పనిదినాలే అయినా వీకెండ్ కోసం ఎంతో పరితపిస్తుంటారు. వీరికి సోమవారం నుంచి శుక్రవారం దాకా విపరీతంగా పని ఒత్తిడి ఉంటుంది. దీంతో ఎప్పుడు వీకెండ్ అవుతుందా అని ఎదురుచూస్తుంటారు.

ఇదిలావుంటే తాజాగా ప్రపంచవాప్తంగా ఒక వాదన తెరపైకి వచ్చింది. నాలుగు రోజులు పని దినాలు కల్పించినట్లయితే ఉద్యోగులకు ఉపశమనంతోపాటు వారి పనితీరు మెరుగుపడుతుందని సైకలాజిస్టులు, ఆర్థిక వేత్తలు మద్దతు పలుకుతున్నారు. నాలుగు రోజుల పనిదినాలతో చక్కటి ఫలితాలు ఉంటాయని ప్రముఖ సైకాలజిస్టు ఆడమ్ గ్రాంట్ చెబుతున్నారు. అంతేకాదు వారు సంస్థకు విధేయులుగా మారుతారని అంటున్నారు. ఐదు, ఆరు రోజుల పనిదినాలతో ఒత్తిడి కారణంగా ప్రొడక్టివిటీ తగ్గిపోతుందని ఆర్థిక వేత్తలు చెబుతున్నారు.

దావోస్ లో జరిగిన ప్రపంచ ఆర్థిక సదస్సులో ఈ అంశం తెరపైకి వచ్చింది. నాలుగు రోజుల పనిదినాల ప్రతిపాదనను చరిత్రకారుడు, ప్రముఖ ఆర్థిక వేత్త బ్రెగ్ మెన్, ఆడమ్ గ్రాంట్ సమర్థించారు. ఒకటి రెండు రోజులకు బదులు మూడు రోజులు ఉద్యోగులకు సెలవులు ఇస్తే మంచి ఫలితాలు వస్తాయని అభిప్రాయం వ్యక్తం చేశారు. దీనిపై ప్రపంచ స్థాయిలో మద్దతు వస్తుండడంతో ఆయా సంస్థల పాలసీ మేకర్లు ఈ అంశాన్ని పరిశీలించాలని వారు సూచిస్తున్నారు. ఏదిఏమైనా ఇప్పట్లో కాకపోయినా త్వరలోనే మూడు రోజులు సెలవులు, నాలుగు రోజులు పనిదినాల్లో పనిచేసే అవకాశం రావాలని మనం కూడా మనసారా కోరుకుందాం..