Begin typing your search above and press return to search.

ఎదురుగా వస్తున్న బస్సును ఢీ కొన్న పెళ్లి బస్సు.. 11 మంది మృతి

By:  Tupaki Desk   |   26 Jun 2023 12:11 PM GMT
ఎదురుగా వస్తున్న బస్సును ఢీ కొన్న పెళ్లి బస్సు.. 11 మంది మృతి
X
ఒడిశాలో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. ఈ విషాద ఉదంతంలో పదకొండు మంది ప్రాణాలు కోల్పోయారు. సరదాగా పెళ్లి వేడుకల్ని ముగించుకొని ఇంటికి వస్తున్న పెళ్లి బస్సు ఎదురుగా వస్తున్న ఆర్టీసీ బస్సును ఢీ కొన్న ఉదంతంలో భారీ విషాదం చోటు చేసుకుంది.

బ్రహ్మపురకు చెందిన యువతి పెళ్లి ఆదివారం జరిగింది. పెళ్లి కుమార్తెను.. ఆమె కుటుంబ సభ్యులు అత్తవారింట్లో వదిలేసి.. తిరిగి ప్రయాణమయ్యారు. విందును పూర్తి చేసుకొని స్వస్థలానికి చేరుకునేందుకు తాము ఏర్పాటు చేసుకున్న ప్రైవేటు బస్సులో వారి ప్రయాణం మొదలైంది.

అర్థరాత్రి దాటిన తర్వాత బ్రహ్మపుర-తప్తపాణి రోడ్డులో ఎదురుగా వస్తున్న ఒడిశా ప్రభుత్వ ఆర్టీసీ బస్సును.. పెళ్లి బస్సు డ్రైవర్ ఢీ కొట్టారు. అతి వేగం.. నిద్రమత్తులో ఈ ఘోర ప్రమాదం జరిగిందని భావిస్తున్నారు. ఈ దారుణ ఘటనలో పదకొండు మరణిస్తే.. వారిలో ఏడుగురు ఒకే కుటుంబానికి చెందిన వారు కావటం గమనార్హం.

మరింత విషాదకరం ఏమంటే.. ప్రాణాలు కోల్పోయిన వారిలో పెళ్లి కుమార్తె అక్కాచెల్లెళ్లు ఇద్దరు ఉన్నారు. ఈ ఉదంతంలో మరో ఎనిమిది మంది గాయపడ్డారు. వారిని సమీపంలోని ఆసుపత్రికి తరలించి చికిత్స చేస్తున్నారు.

వీరిలో ఒకరి పరిస్థితి విషమంగా ఉండటంతో కటక్ పెద్దాసుపత్రికి తరలించారు. ఈ ప్రమాదంపై ఒడిశా ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్ దిగ్భ్రాంతిని వ్యక్తం చేశారు. మరణించిన కుటుంబాలకు రూ.3 లక్షల పరిహారాన్ని చెల్లిస్తామన్నారు. గాయపడిన వారి చికిత్స నిమిత్తం రూ.30వేల చొప్పున పరిహారం ఇవ్వనున్నారు.