Begin typing your search above and press return to search.

బోస్ మరణానికి కొద్దిగంటల ముందు..?

By:  Tupaki Desk   |   4 Jan 2016 7:06 AM GMT
బోస్ మరణానికి కొద్దిగంటల ముందు..?
X
స్వాతంత్ర్య సమరయోధుల్లో సుభాష్ చంద్రబోస్ తీరు చాలా విలక్షణంగా ఉంటుంది. భారత్ కు స్వాతంత్ర్యాన్ని సాధించేందుకు వీలుగా.. పలు దేశాల సాయం తీసుకోవాలని భావించటం తెలిసిందే. బ్రిటీష్ వారి గుండెల్లో నిద్రపోయి.. వారికి కంటి నిండా కునుకు లేకుండా చేశారు. అలాంటి ఆయన మరణం ఒక మిస్టరీగా మారటం.. ఆయన చివరి రోజులు ఎలా గడిచాయి? ఏం జరిగింది? ఆయన నిజంగా మరణించారా? లేదా? అన్న ప్రశ్నలకు నేటికి సంతృప్తికర సమాధానాలు లభించని దుస్థితి.

ఇదిలా ఉంటే.. బోస్ మరణం చుట్టూ నెలకొన్న ప్రశ్నలకు సమాధానాలు వెతికేందుకు ఆయన మనమడు అశిష్ రే విపరీతంగా శ్రమిస్తున్నారు. వివిధ ప్రాంతాల్లో పర్యటించటం.. పెద్ద ఎత్తున పత్రాల్ని సంపాదించటం.. వాటిని అధ్యయనం చేస్తున్నారు. తాజాగా.. బోస్ మరణించారని చెబుతున్న కొద్ది గంటల ముందు అసలేం జరిగింది? బోస్ ఏం చేశారు? లాంటి ప్రశ్నలకు ఆయన సమాధానాలు చెప్పే ప్రయత్నం చేశారు. తనకు లభించిన సమాచారాన్ని ఆయన ఒక వెబ్ సైట్ లో బొస్ మరణానికి కొన్ని గంటల ముందు ఏం జరిగిందన్న దానిపై వివరాలు ఉంచారు.

1945 ఆగస్టు 17న బోస్ బృందం బ్యాంకాక్ నుంచి విమానంలో వియత్నాంలోని సైగాన్ చేరుకున్నారని.. ఈశాన్య ఆసియాకు వెళ్లాల్సి ఉన్నా.. రెండో ప్రపంచ యుద్ధంలో జపాన్ లొంగిపోవటంతో షెడ్యూల్ మారిందని వెల్లడించారు. నేతాజీ నేతృత్వంలోని భారత జాతీయ సైన్యానికి.. జపాన్ కు మధ్యవర్తిగా ఉన్న హికరి కి కన్జ్ సంస్థ జనరల్ ఇసోదాతో సమావేశమయ్యారు

లెఫ్టినెంట్ జనరల్ షిదెయ్ సూచనతో చైనాలోని మంచూరియా వెళ్లేందుకు బోస్ అంగీకరించారు. ఆలస్యంగా బయలుదేరిన విమానం.. పైలెట్ చేసిన సూచనతో తొరేన్ లో ఆ రాత్రి విశ్రాంతి తీసుకున్నట్లు బోస్ మనమడు వెల్లడించారు. రానున్న రోజుల్లో మరిన్ని వివరాలు ఆయన బయటపెట్టనున్నట్లు చెబుతున్నారు. ప్రయత్నం ఎవరిదైనా.. బోస్ మరణంపై దేశ ప్రజలకు స్పష్టత రావాల్సిన అవసరం ఎంతైనా ఉంది.