Begin typing your search above and press return to search.

దక్షిణాదిన ఎండలు.. ఉత్తర భారతం మునక.. 40 ఏళ్లలో రికార్డు వాన

By:  Tupaki Desk   |   9 July 2023 4:58 PM GMT
దక్షిణాదిన ఎండలు.. ఉత్తర భారతం మునక.. 40 ఏళ్లలో రికార్డు వాన
X
జూలై 10వ తేదీ వచ్చినా దక్షిణాదిన వేడి వాతావరణం నెలకొంది. సాయంత్రం 7 అవుతున్నా చీకటి పడడం లేదు. తెలుగు రాష్ట్రాల్లో వానలు పడక రోజులు గడుస్తోంది. నదులు ఎండిపోతున్నాయి. ప్రాజెక్టుల్లో నీటి మట్టాలు పడిపోతున్నాయి. కానీ, ఉత్తర భారతదేశం మాత్రం తడిసి ముద్దవుతోంది. సహజంగా భారత్ లో నైరుతి రుతుపవనాలు దక్షిణాదిన కేరళ నుంచి వెళ్లి ఉత్తర భారతాన్ని తాకుతాయి. ముందుగా మనకే వర్షాలు పడతాయి. కానీ.. పరిస్థితి ఈసారి భిన్నంగా ఉంది. దక్షిణాదిన వాన చినుకు లేదంటే.. ఉత్తరాన వానకు విరామమే లేదు. హిమాచల్‌ లోని 7 జిల్లాల్లో రెడ్‌ అలర్ట్‌, 3 జిల్లాల్లో ఆరెంజ్ అలర్ట్ ప్రకటించారంటేనే తీవ్రత తెలిసిపోతోంది.

ఎప్పుడు వరదొస్తుందోననే భయం

హిమాలయాలకు దగ్గరగా ఉండే రాష్ట్రాలు కావడంతో మెరుపు వరదలు, కొండచరియలు విరిగిపడే ప్రమాదం ఉత్తరాదిన ఎక్కువ. ప్రస్తుతం వర్షాలకు లో తట్టు ప్రాంతాల్లో నీట మునిగిన ఇళ్లలో ప్రజలు చిక్కుకుపోతున్నారు. ఉత్తరాఖండ్‌ లోని ఉధమ్‌సింగ్‌ నగర్‌ లో వర్షాలకు ఓ ఇల్లు కూలి ఇద్దరు చనిపోయారు. తెహ్రి జిల్లాలో పర్యాటక వాహనం బోల్తా పడింది. ఈ ప్రమాదంలో తెలుగువారు కూడా ఉన్నట్లు సమాచారం.


ఢిల్లీ దడదడ

ఎండా, వాన, చలి అన్నీ ఎక్కువగా ఉండే దేశ రాజధాని ఢిల్లీలో రికార్డు వర్షం కురుస్తోంది. 40 ఏళ్లలో ఎన్నడూ లేనంత స్థాయిలో వానలు పడుతున్నాయి. ఢిల్లీలో 24 గంటల్లో 15.3 సెంటీమీటర్ల వర్షం కురిసింది. ఈ సీజన్‌ లో కురవాల్సిన మొత్తం వర్షంలో ఇది 15 శాతం. ఇంత వానలు 1982 జూలై తర్వాత తొలిసారి. ఆదివారం సైతం ఢిల్లీలో వర్షం జోరున పడుతోంది. రాజస్థాన్‌ లో 24 గంటల్లో వర్షాల ధాటికి నలుగురు ప్రాణాలు కోల్పోయారు. 9 జల్లాలో అతి భారీ వర్షాల ప్రమాదం ఉంది. జమ్మూలోని రెండు జిల్లాల్లో వరద ముప్పు నెలకొంది.