Begin typing your search above and press return to search.

122 సంవత్సరాల తర్వాత మళ్లీ అంత ఎండలు.?

By:  Tupaki Desk   |   1 May 2022 4:30 PM GMT
122 సంవత్సరాల తర్వాత మళ్లీ అంత ఎండలు.?
X
రాబోయే 48 గంటలు జనాలందరూ అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ తీవ్రంగా హెచ్చరిస్తోంది. తెలంగాణాలోని కొన్నిచోట్ల కొద్దిపాటి వర్షం పడినా వేడిగాలులు, అత్యధిక ఉష్ణోగ్రతతో జనాలంతా ఇబ్బందులు పడిపోతున్నారు. రాబోయే 48 గంటల్లో విపరీతమైన వేడి ఖాయమని వాతావరణ శాఖ వార్నింగులు జారీచేసింది. 122 సంవత్సరాల క్రితం నమోదైన ఉష్ణోగ్రతలు మళ్ళీ ఇపుడు నమోదవుతున్నట్లు చెప్పింది.

జనాలందరూ తగిన జాగ్రత్తలు తీసుకోకపోతే మండిపోతున్న ఎండలకు మాడిపోవాల్సిందే అని గట్టిగా చెబుతోంది. గడచిన మూడు రోజులు వరుసగా 47 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. రాబోయే రెండు మూడు రోజులు మరింత వేడి ఖాయమంటున్నారు. ముఖ్యంగా ఆదిలాబాద్, కొమరంభీమ్, ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, నిజామాబాద్, జగిత్యాల, రాజన్న సిరిసిల్ల, కరీంనగర్, పెద్దపల్లి జిల్లాల్లో పాటు సింగరేణి బొగ్గు గనులున్న ప్రాంతాల్లో అత్యధిక ఉష్ణోగ్రతలు తప్పవని వాతావరణ శాఖ హెచ్చరిస్తోంది.

చెట్లను యధేచ్చగా కొట్టేయడం, రెగ్యులర్ గా వర్షాలు పడకపోవటం, అందరికీ ఇళ్ల నిర్మాణం పేరుతో కాంక్రీటు అడవులు పెరిగిపోతుండటం లాంటి అనేక కారణాలతో వాతావరణంలో విపరీతమైన మార్పులు చోటుచేసుకుంటున్నాయి. వాతావరణంలో విపరీతమైన మార్పుల కారణంగా ఉష్ణోగ్రతలు పెరిగిపోవటంతో ఎండలు మండిపోతున్నాయి. దీని ప్రభావం ఎక్కువగా పిల్లలు, వృద్ధులపైనే ఉంటుందని కూడా వాతావరణ శాఖ పదే పదే చెబుతోంది.

దేశంలోని అనేక ప్రాంతాల్లో ఏప్రిల్ 15వ తేదీ తర్వాత ఒక్కసారిగా వేడి పెరిగిపోయింది. 29, 30 తేదీల్లో రికార్డు స్ధాయిలో ఉష్ణోగ్రతలు 47 డిగ్రీలుగా నమోదయ్యియి. మే 1, 2 తేదీల్లో కూడా ఇదేస్ధాయిలో ఉష్ణోగ్రతలు రికార్డయ్యే అవకాశాలున్నట్లు వాతావరణ శాఖ ఆందోళన వ్యక్తం చేసింది.
అందుకనే జనాలందరినీ ముందు జాగ్రత్తలు తీసుకోమని హెచ్చరిస్తోంది. పనులేవన్నా ముంటే ఉదయం 11 లోపు పూర్తి చేసుకోవాలని, ముఖ్యంగా మధ్యాహ్నం 12 నుండి సాయంత్రం 4 గంటలవరకు ఎవరూ బయట తిరగద్దని వాతావరణ శాఖ ప్రకటించింది. ఎందుకైనా మంచిది జనాలు వాతావరణశాఖ హెచ్చరికలను గమనంలోకి తీసుకోవాలి. లేకపోతే మాడిపోవటం ఖాయమే.