Begin typing your search above and press return to search.

మాస్కు ధరించాలా? లేదా? అన్నది మీ ఇష్టం.. తేల్చేసిన తెలంగాణ

By:  Tupaki Desk   |   1 April 2022 5:03 AM GMT
మాస్కు ధరించాలా? లేదా? అన్నది మీ ఇష్టం.. తేల్చేసిన తెలంగాణ
X
దాదాపు రెండేళ్ల క్రితం ఇదే సమయానికి భయంతో ఉక్కిరిబిక్కిరి కావటమే కాదు.. బయటకు వచ్చేందుకు సైతం తెగ సందేహానికి గురి కావాల్సి వచ్చేది. ఎవరింట్లో వారు ఉండిపోవటమే కాదు.. ఎవరిని ఇంటికి రానిచ్చే పరిస్థితి కూడా ఉండేది కాదు. ఇక.. ముఖానికి మాస్కు అయితే బయటే కాదు ఇంట్లో కూడా పెట్టుకోవటం తప్పనిసరి అన్నట్లుగా ఉండేది.

అలాంటి పరిస్థితి తాజాగా మారినట్లే. ఎందుకంటే.. నిన్నమొన్నటి వరకు ముఖానికి మాస్కు తప్పనిసరి కావటం.. పక్కాగా ముఖానికి మాస్కు ధరించాలన్న నియమం ఉండేది. అంతేనా.. ముఖానికి మాస్కు లేకుంటే ఫైన్ వేసేందుకు వీలుగా పోలీసులకు నిబందనల్ని ఫ్రేం చేసింది ప్రభుత్వం.

ఇదిలా ఉంటే.. తాజా పరిణామాల నేపథ్యంలో ముఖానికి మాస్కు పెట్టుకోవటం తప్పనిసరి కాదు.. ఛాయిస్సే (ఎవరి ఇష్టం వారిదే) అంటూ తేల్చేశారు తెలంగాణ రాష్ట్ర ప్రజా ఆరోగ్య సంచాలకులు గడల శ్రీనివాసరావు. కరోనా ముప్పు పూర్తిగా తొలిగిపోలేదు కానీ.. మాస్కులు ధరించే విషయంలో ఎవరికి వారు నిర్ణయం తీసుకోవచ్చన్నారు.

కాకుంటే.. పెద్ద వయస్కులు.. దీర్ఘకాలిక వ్యాధిగ్రస్తులు వీలైనంతవరకు మాస్కులు పెట్టుకోవటం మంచిదని చెబుతున్నారు. రద్దీగా ఉన్న ప్రాంతాల్లో తిరిగే వేళలోనూ.. బయట ఉన్నప్పుడు ముఖానికి మాస్కు ముంద జాగ్రత్తగా పనికి వస్తుందని చెబుతున్నారు.

అయితే..కరోనా కేసులు తెలంగాణ రాష్ట్రంలో భారీగా తగ్గిపోవటమే కాదు.. రాష్ట్రం మొత్తమ్మీదా రోజుకు 20-40 కేసులు కూడా నమోదు కాని పరిస్థితి. తెలంగాణ రాష్ట్రంలోని 20 జిల్లాల్లో ఒక్క కేసు కూడా నమోదు కాని పిరిస్థితి ఉందని చెబుతున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో ముఖానికి మాస్కు లేకుండా బయటకు వచ్చిన వారిపై కేసులు నమోదు చేసే విషయంలో పోలీసులు చూసీ చూడనట్లుగా వ్యవహరించాలని గడల కోరారు.

చైనా.. ఆస్ట్రేలియా లాంటి దేశాల్లో కరోనా కేసులు నమోదు అవుతున్నప్పటికీ.. మన దేశంలో మాత్రం పలు వేరియంట్లు వచ్చి పోయినట్లుగా పేర్కొన్నారు. ఈ ఏడాది చివరకు కరోనా ఎండమిక్ దశకు చేరుకుంటుందని.. ఏదో ఒక ప్రాంతానికి అది పరిమితమయ్యే పరిస్థితి ఉంటుందని చెబుతున్నారు. ఎన్ని వేరియంట్లు వచ్చినా తట్టుకునే పరిస్థితుల్లోకి మనం వచ్చినట్లుగా ఆయన పేర్కొన్నారు. కరోనా ముప్పుతో భయపడే వారికి ఈ మాట ఒక శుభవార్తగా మారుతుందన్న అభిప్రాయం కలుగక మానదు.