Begin typing your search above and press return to search.

వీళ్లే మ‌న భ‌విష్య‌త్తు శ్రీ‌మంతులు!

By:  Tupaki Desk   |   27 Aug 2016 9:13 AM GMT
వీళ్లే మ‌న భ‌విష్య‌త్తు శ్రీ‌మంతులు!
X
భార‌త‌దేశంలో శ్రీ‌మంతులు పెరుగుతున్నారు. ప్రపంచంలోని టాప్ ధ‌న‌వంతుల స‌ర‌స‌న భార‌తీయులు చేరుతున్నారు. మ‌న‌దేశంలో అంబానీ - అదానీ - మిట్ట‌ల్ కుటుంబాలు ప్ర‌పంచ‌వ్యాప్తంగా టాప్ ధ‌నిక ఫ్యామిలీస్ స‌ర‌స‌న ఎప్పుడో చేరాయి. ఇప్పుడు వారి త‌రువాత త‌రం హ‌వా మొద‌లైంది. త‌ల్లిదండ్రుల ఆశ‌యాల‌కు అనుగుణంగా త‌మ వ్యాపార సామ్రాజ్యాలని మరింత విస్త‌రింపజేయాల‌న్న ల‌క్ష్యంతో భార‌తీయ శ్రీ‌మంతులు వార‌సులు కూడా రంగంలోకి దిగారు. స్టార్ట‌ప్‌ ల‌తో విజ‌యాల‌ను సాధిస్తున్నారు. దీంతో ధ‌నిక వ్యాపారుల పిల్ల‌లు అత్య‌ధికంగా ఉన్న దేశంగా కూడా భార‌త్ కు ప్ర‌పంచ‌వ్యాప్త గుర్తింపు ల‌భిస్తోంది. అంబానీల వార‌సులు - అదానీల వార‌సులు - మిట్ట‌ల్ వార‌సులు వ్యాపార రంగంలో దూసుకుపోతూ.. తమ తండ్రుల‌కు మించిన సంప‌ద‌ను సృష్టించే దిశ‌గా ఉర‌క‌లు వేస్తున్నారు.

ముందుగా అంబానీ పిల్ల‌లు గురించి చెప్పుకోవాలంటే... ముఖేష్‌ - నీతా అంబానీల‌కు ఒక అమ్మాయి - ఒక అబ్బాయి. ఇషా - ఆకాష్ అంబానీలు 2015 నుంచే రిల‌య‌న్స్ సామ్రాజ్యంలోకి అడుగుపెట్టారు. రిల‌య‌న్స్ రిటైల్స్‌ - రిల‌య‌న్స్ జియోకామ్ కంపెనీల‌కు డైరెక్ట‌ర్లుగా ఉన్నారు. ఈ ఫ‌ర్మ్ విలువ రూ. 75,000 కోట్లు! బిర్లా వార‌సురాలిగా వ్యాపార రంగంలోకి దిగారు అన‌న్య‌శ్రీ బిర్లా. కుమార మంగ‌ళం బిర్లా - నీర‌జా బిర్లాల ముద్దుల కుమార్తె. 2012లో స్వ‌తంత్ర మైక్రో ఫైనాన్స్ అనే కంపెనీని సొంత‌గా ప్రారంభించారు అన‌న్య‌శ్రీ‌. ప్ర‌స్తుతం దాని విలువ రూ. 46.91 కోట్లు.

విప్రో వ్య‌వ‌స్థాప‌కుడు అజీం ప్రేమ్ - యాస్మీన్ ప్రేమ్‌ జీల కుమారుడు ర‌షీద్ ప్రేమ్ జీ. విప్రో టెక్ సంస్థ‌కు ఛీప్ స్ట్రాట‌జీ ఆఫీస‌ర్ గా బాధ్య‌త‌లు స్వీక‌రించాడు. ఈ కంపెనీ విలువ 7.3 మిలియ‌న్ అమెరిక‌న్ డాల‌ర్లు. ప్ర‌ముఖ కంపెనీ హెచ్‌.సి.ఎల్‌. వ్య‌వ‌స్థాప‌కులు శివ్ నాడార్ - కిర‌ణ్ నాడార్ ల వార‌సురాలిగా కంపెనీ బాధ్య‌త‌లు తీసుకున్నారు రోష్ణి నాడార్‌. ఎగ్జిక్యూటివ్ డైరెక్ట‌ర్ గా కంపెనీలో చేరి - ఏడాదిలోగా సీయీవోగా బాధ్య‌త‌లు స్వీక‌రించారు. ఇప్పుడా కంపెనీ విలువ 11.9 బిలియ‌న్ డాల‌ర్లు. భార‌తీ కమ్యూనికేష‌న్ ప్రారంభించిన సునిల్ మిట్ట‌ల్ వార‌సుడిగా రంగంలోకి దిగారు కెవిన్ మిట్ట‌ల్‌. కెవిన్ బిగాన్ హైక్ మేనేజ‌ర్స్ అనే సంస్థ‌కు సొంతంగానే స్థాపించారు. దీని విలువ 1 బిలియ‌న్ డాల‌ర్స్‌.

మ‌న‌దేశంలో అదానీల ఫ్యామిలీ ఎంత‌టి శ్రీ‌మంతులో అంద‌రికీ తెలిసిందే. గౌత‌మ్ అదానీ - ప్రీతీ అదానీల కుమారుడు కిర‌ణ్ అదానీ ఇప్పుడు అదానీ పోర్ట్స్ అండ్ ఎస్‌.ఇ.జెడ్‌. లిమిటెడ్ కంపెనీక‌లు సీయీవోగా బాధ్య‌త‌లు అందుకున్నారు. ఈ ఫ‌ర్మ్స్ విలువ 240 మిలియ‌న్ డాల‌ర్లు. ఇన్ఫోసిస్ నారాయ‌ణ మూర్తి - సుధామూర్తిల కుమారుడు రోషన్ మూర్తి కూడా తండ్రికి త‌గ్గ త‌న‌యుడు అనిపించుకునే ప‌నిలో ఉన్నారు. తండ్రి త‌రువాత ఇన్ఫోసిస్ బాధ్య‌త‌లు స్వీక‌రించారు. కంపెనీలో త‌న సొంత‌షేర్ వేల్యూ 347 మిలియ‌న్ డాల‌ర్లు.

ఈ విధంగా భార‌తీయ వ్యాపార దిగ్గ‌జాల‌కు ధీటుగా వారి వార‌సులు కూడా రాణిస్తున్నారు. ఉడుకు ర‌క్తంతో త‌మ తండ్రులు సాధించిన దానికి మించి సాధించాల‌ని ఉర‌క‌లు వేస్తున్నారు. సో.. భ‌విష్య‌త్తులో సంప‌న్నులైన వ్యాపార‌వేత్త‌ల జాబితాలో మ‌నవాళ్ల పేర్లే వ‌రుస‌గా ఉన్నా ఆశ్చ‌ర్య‌పోన‌క్క‌ర్లేదు.