Begin typing your search above and press return to search.

దేశంలోనే వీక్ ఎంపీలు అంటే ఏపీ వాళ్లేనా ?

By:  Tupaki Desk   |   29 Nov 2021 1:30 AM GMT
దేశంలోనే వీక్ ఎంపీలు అంటే ఏపీ వాళ్లేనా ?
X
పార్ల‌మెంటు శీతాకాల స‌మావేశాలు త్వ‌ర‌లోనే ప్రారంభం కానున్నాయి. ఈ స‌మావేశాల్లో ఏపీ ప్ర‌యోజాల కోసం గ‌ట్టిగా డిమాండ్ చేయాల‌ని అధికార వైసీపీతో పాటు, టీడీపీ ఎంపీల‌కు ఆ పార్టీల అధినేత‌లు మార్గ‌నిర్దేశం చేస్తున్నారు. అయితే ఇక్క‌డ ట్విస్ట్ ఏంటంటే రెండు పార్టీల ఎంపీల‌కు ఆ పార్టీ అధినేత‌లు గ‌తంలో ఎప్పుడూ లేన‌ట్టుగా ఒకే త‌ర‌హా ఆదేశాలు ఇచ్చారు. ఏపీకి సంబంధించి సంవ‌త్స‌రాలుగా పెండింగ్‌లో ఉన్న ప్ర‌త్యేక హోదా, ప్ర‌త్యేక రైల్వే జోన్‌, పోల‌వ‌రం ప్రాజెక్టు రివైజ్డ్ అంచ‌నాల నిధుల గురించే ఏపీ ఎంపీలు ప్ర‌ధానంగా పోరాటం చేయాలి.

పార్ల‌మెంటు స‌మావేశాలు ఎప్పుడు జ‌రిగినా ఏపీ ఎంపీలు అంద‌రికి ఆ పార్టీల అధినేత‌లు పై అంశాల‌పైనే గైడెన్స్ ఇస్తూ ఉంటారు. అయితే ఈ డిమాండ్ల‌ను ప్ర‌ధాన‌మంత్రి నరేంద్ర‌మోడీ కాని.. అటు కేంద్ర మంత్రులు కాని ఎప్పుడూ ప‌ట్టించుకోరు. చెవిటి వాడి ముందు శంఖం ఊదిన ప‌రిస్థితే ఉంటుంది. వాటి గురించి పార్ల‌మెంటులో ప్ర‌స్తావించినా ఉప‌యోగం ఉండ‌ద‌ని తెలిసినా కూడా ఎంపీలు మాత్రం డ్రామాలు ఆడుతూనే ఉంటారు. అయితే రెండు పార్టీల ఎంపీలు మాత్రం స‌మ‌ష్టిగా క‌సితో రాష్ట్ర ప్ర‌యోజ‌నాల కోసం పోరాటం చేసిన దాఖ‌లాలు లేవు.

పార్ల‌మెంటులో టీడీపీ ఎంపీలు మాట్లాడితే జ‌గ‌న్‌పై, జ‌గ‌న్ ప్ర‌భుత్వంపై విమ‌ర్శ‌లు చేస్తూ ఉంటాయి. ఎంత వ‌ర‌కు పార్ల‌మెంటు సాక్షిగా జ‌గ‌న్ ప్ర‌భుత్వాన్ని ఎండ‌గ‌ట్ట‌డానికే టైం కిల్ చేస్తారు. ఇక వైసీపీ ఎంపీలు మాట్లాడితే ఎంత వ‌ర‌కు టీడీపీ హ‌యాంలో జ‌రిగిన త‌ప్పులంటూ మాట్లాడ‌తారు. పార్ల‌మెంటు బ‌య‌ట కూడా చంద్ర‌బాబు చేసిన మోసం వ‌ల్లే ఏపీకి ఈ ప‌రిస్థితి ఉంద‌ని చెపుతుంటారు. ఇలా వీరిలో వీళ్లు విమ‌ర్శించుకోవ‌డంతో దేశ స్థాయిలో మిగిలిన రాష్ట్రాల ఎంపీల ముందు మ‌న రాష్ట్ర ఎంపీలు, పార్టీల నేత‌లు చుల‌క‌న అవుతున్నారు.

ఇక కేంద్రంలో బ‌లంగా స‌పోర్ట్ ఉన్న మోడీ ప్ర‌భుత్వానికి అస‌లు ఏపీ ఎంపీల మ‌ద్ద‌తు అవ‌స‌ర‌మే లేదు. ఇక రాజ్య‌స‌భ‌లో మాత్రం కొంత అవ‌స‌రం ఉంది. అయినా కూడా అధికారంలో ఉన్న వైసీపీ కొంత వ‌ర‌కు అయినా డిమాండ్ చేసి త‌మ కోరిక‌లు నెర‌వేర్చుకునే ప‌రిస్థితి లేదు. ర‌క‌ర‌కాల కార‌ణాల‌తో ముఖ్య‌మంత్రి జ‌గ‌న్ కేంద్రం ముందు ముందే మోక‌రిల్లాల్సిన ప‌రిస్థితి. అటు చంద్ర‌బాబు ఇప్పుడు బీజేపీకి ద‌గ్గ‌ర‌య్యేందుకు అర్రులు చాస్తోన్న ప‌రిస్థితి.

ఈ క్ర‌మంలోనే మోడీని, కేంద్ర ప్ర‌భుత్వాన్ని నిల‌దీసే సీన్ మ‌న ఎంపీల‌కు లేద‌నే చెప్పాలి. ఈ క్ర‌మంలోనే వీరిపై ఏపీ జ‌నాలు పెట్టుకున్న ఆశ‌ల్లో చిల్లిగ‌వ్వంత కూడా నెర‌వేరే ప‌రిస్థితి లేదు.