Begin typing your search above and press return to search.

రుణమాఫీ పవర్ తెలుసుకున్నారా స్వామీ?

By:  Tupaki Desk   |   15 Oct 2016 4:45 AM GMT
రుణమాఫీ పవర్ తెలుసుకున్నారా స్వామీ?
X
మిగిలిన రాష్ట్రాల్లోని సంగతి కాసేపు పక్కనపెడితే తెలుగు రాష్ట్రాల్లో ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ లో 2014 సార్వత్రిక సమయంలో ఒక అంశం చాలా ప్రాధాన్యతను సంతరించుకుంది.. అదే రుణమాఫీ! అవును 2014 ఎన్నికల సమయంలో అటు తెలంగాణలోనూ - ఇటు ఆంధ్రప్రదేశ్ లోనూ ఈ హామీ చేసిన హడావిడి, ఫలితంగా వచ్చిన ఫలితాలు చిన్నవిషయం కాదు. ఆ స్థాయిలో రైతు రుణమాఫీ - బంగారంపై రుణమాఫీ అంటూ ఏపీలో టీడీపీ ప్రచారం హోరెత్తించింది. అయితే ఎన్నికల అనంతరం అధికారంలోకి వచ్చిన తర్వాత రుణమాఫీ సంగతి ఏమైంది అనే విషయం కాసేపు పక్కనపెడితే, ఇదే అంశంపై ప్రస్తుతం తెలంగాణలోకూడా కాంగ్రెస్ పార్టీ ఉద్యమం మొదలుపెడుతోంది. ఈ క్రమంలో రుణమాఫీ విషయంలో సంచలన వ్యాఖ్యలు చేశారు కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి కుమార స్వామి.

రుణమాఫీ అనే అంశం ఎంత పవర్ ఫుల్లో తెలుగురాష్ట్రాల ఫలితాలతో తెలుసుకున్నారో ఏమో కానీ... రాష్ట్రంలో జేడీఎస్‌ అధికారంలోకి వచ్చిన 24 గంటల్లో రుణమాఫీ చేసేస్తామని ఆ పార్టీ అధ్యక్షుడు కుమారస్వామి చెబుతున్నారు. కర్ణాటక రైతులు కష్టాలలో ఉన్నారని - నదీజలాలు లభించడం లేదని - కొన్నేళ్లుగా సాగు చేసిన పంట చేతికి రావడం లేదని.. దీనివల్ల రైతులు చాలా ఇబ్బందులు పడుతున్నారని, ఇదే సమయంలో రైతుల ఆత్మహత్యలు తనను ఎంతో బాదపెట్టాయని చెబుతున్నారు. ప్రభుత్వం మాత్రం రైతు ఆత్మహత్యలను సున్నితమైన అంశంగా భావించడం లేదని విమర్శించారు.

ఈ సందర్భంగా చేసిన అప్పులు తీర్చుకోలేక రైతులంతా ఆత్మహత్యలు చేసుకుంటున్నారని, తాను గతంలో ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు రూ.2,500 కోట్లు రుణమాఫీ చేశానని చెబుతున్న కుమార స్వామి... ఇదే క్రమంలో మరోసారి తనకు ప్రజలు అధికారం అప్పగిస్తే, అలా అధికారంలోకి వచ్చిన 24 గంటల్లోపే రుణమాఫీ చేస్తానని ప్రకటించారు. ఈ విషయాన్నే ప్రజల్లోకి తీసుకెళ్లే క్రమంలో నవంబరు నుంచి రాష్ట్ర వ్యాప్తంగా పర్యటించనున్నారు కుమార స్వామి!

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/