Begin typing your search above and press return to search.

హైదరాబాద్ ను భాగ్యనగరంగా మారుస్తాం: యోగి

By:  Tupaki Desk   |   29 Nov 2020 5:10 AM GMT
హైదరాబాద్ ను భాగ్యనగరంగా మారుస్తాం: యోగి
X
జీహెచ్ఎంసీని కొట్టాలని బీజేపీ దూకుడుగా ముందుకెళుతోంది. పార్టీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డాతో గ్రేటర్ లో ప్రచారం నిర్వహించిన బీజేపీ.. ఈరోజు కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షాను కూడా రంగంలోకి దింపుతున్నారు. ప్రధాని మోడీ కూడా వ్యాక్సిన్ కోసం వచ్చి జోష్ నింపారు.

ఇప్పటికే కేంద్రమంత్రులు.. ఇతర రాష్ట్రాల ఎంపీలు, ఎమ్మెల్యేలు కూడా హైదరాబాద్ లో మోహరించారు. . తాజాగా యూపీ సీఎం యోగి ఆధిత్యనాథ్ కూడా గ్రేటర్ ప్రచారంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా కేసీఆర్ పై, ఎంఐఎం పార్టీపై నిప్పులు చెరిగారు.

గ్రేటర్ లో బీజేపీకి అధికారం అప్పగించాలని యోగి ఆధిత్యనాథ్ ప్రజలను కోరారు. తమకు పట్టం కడితే హైదరాబాద్ ను భాగ్యనగరం చేస్తామన్నారు. ఇప్పటికే పలు నగరాల పేర్లు మార్చామని.. హైదరాబాద్ ఎందుకు భాగ్యనగరంగా మారకూడదని అన్నారు. మూసీనదిని ఎంఐఎం, టీఆర్ఎస్ కబ్జా చేశాయని ఆరోపించారు.

జమ్మూకాశ్మీర్ లో హైదరాబాదీ భూమి కొనొచ్చు అని.. బీజేపీని గెలిపించి ఢిల్లీ నుంచి నిధులను తెచ్చుకోవాలని సూచించారు. ప్రధాని మోడీ ఆర్టికల్ 370ని తొలగించారని.. 400 ఏళ్లుగా కార్యరూపం దాల్చని రామమందిరం నిర్మించుకుంటున్నామని చెప్పారు.

నిజాం రూపంలో వస్తున్న మరో నయా నిజాం పథకాన్ని పారనివ్వకూడదని.. ఎంఐఎంతో కలిసి టీఆర్ఎస్ ప్రభుత్వం నగరవాసులకు అన్యాయం చేస్తోందని యోగి ధ్వజమెత్తారు. ఎంఐఎం బెదిరింపులు భరించాలా అంటూ యోగి ప్రజలను ప్రశ్నించారు.

కేసీఆర్ ప్రభుత్వం వరదసాయం పేరిట మోసం చేసిందని.. టీఆర్ఎస్ కార్యకర్తల కోసమే ఈ నగదును పంపిణీ చేయలేదని యోగి ఆరోపించారు.