ప్రస్తుతం తమిళనాడులో కావేరీ జలాల వివాదంపై తీవ్రస్థాయిలో ఆందోళనలు జరుగుతోన్న సంగతి తెలిసిందే. కావేరీ వాటర్ మేనేజ్ మెంట్ బోర్డు ఏర్పాటు విషయంలో కేంద్రం వైఖరికి నిరసనగా తమిళనాట నిరసనలు జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో చెన్నైలో జరగబోతోన్న ఐపీఎల్ మ్యాచ్ లపై నీలినీడలు కమ్ముకున్నాయి. కావేరీ వాటర్ బోర్డు ఏర్పాటయ్యే వరకు చెన్నైలో ఐపీఎల్ మ్యాచ్ లు నిర్వహించవద్దని ఇప్పటికే పలు రాజకీయ - ప్రజాసంఘాలు డిమాండ్ చేస్తున్నాయి. ఈ నేపథ్యంలో నేడు రాత్రి జరగబోతోన్న చెన్నై - కోల్ కతా మ్యాచ్ ని నిర్వహించవద్దని హెచ్చరించాయి. అయితే, ఈ మ్యాచ్ ను రాజకీయాలతో ముడిపెట్టవద్దని ఐపీఎల్ నిర్వాహకులు నచ్చజెప్పేందుకు యత్నించారు. ఈ నేపథ్యంలో తమ మాట కాదని మ్యాచ్ ను నిర్వహిస్తే స్టేడియంలోకి పాములను వదులుతామని పీఎంకే నేత వేల్‌మురుగన్ సంచలన ప్రకటన చేశారు.
చెన్నైలో మ్యాచ్ నిర్వహణ దృష్ట్యా దాదాపు 4 వేల మంది పోలీసులను స్టేడియం వద్ద మోహరించారు. నల్లటి వస్త్రాలతో మ్యాచ్ లకు హాజరై నిరసన తెలపాలని ఆందోళనకారులు పిలుపునిచ్చారు. కానీ - నల్లటి వస్త్రాలు - రిస్ట్ బ్యాండ్స్ - బ్యాడ్జెస్ లతో వస్తే స్టేడియంలోకి అనుమతించబోమని నిర్వాహకులు తెగేసి చెప్పారు. అంతేకాదు, ఎటువంటి వస్తువులు తీసుకురావద్దని - హెల్మెట్స్ - కెమెరాలు - గొడుగులు - బయటి ఫుడ్ - మైదానంలోకి విసరడానికి అనువుగా ఉండే ఏవస్తువును అనుమతించేది లేదని చెన్నై పోలీసులు తెలిపారు. మరోవైపు - నేటి మ్యాచ్ కు భద్రత కల్పిస్తామని తమిళనాడు ప్రభుత్వం - చెన్నై పోలీసులు హామీయిచ్చారని ఐపీఎల్ కమిషనర్ రాజీవ్ శుక్లా తెలిపారు. ఉద్రిక్త పరిస్థితులు - హెచ్చరికల నేపథ్యంలో మ్యాచ్ సందర్భంగా ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ఆటగాళ్లకు భద్రత కల్పిస్తామని వారు భరోసాయిచ్చినట్టు శుక్లా చెప్పారు. ఈ నేపథ్యంలో నేడు జరిగే మ్యాచ్ ఆసక్తికరంగా మారింది.