Begin typing your search above and press return to search.

ఏమిటీ అడ్జువెంట్? మనల్ని దెబ్బేసలా బైడెన్ సర్కారు తీరు?

By:  Tupaki Desk   |   21 April 2021 1:32 AM GMT
ఏమిటీ అడ్జువెంట్? మనల్ని దెబ్బేసలా బైడెన్ సర్కారు తీరు?
X
ప్రపంచంలో మరే దేశానికి లేనంత ఉదారత మోడీ మాష్టారి సొంతం. దేశం ఏదైనా.. తొలుత తమ దేశ ప్రజలు.. ఆ తర్వాతే ఇరుగుపొరుగు దేశాలు..ప్రపంచ ప్రజలు. కానీ.. ఘనత వహించిన మోడీ మాత్రం అందుకు భిన్నంగా.. మన దేశంలో తయారు చేసిన టీకాల్ని.. విదేశాలకు ఇచ్చేందుకు ఉదారత ప్రదర్శించి.. ప్రపంచ వ్యాప్తంగా అందరి మన్ననలు పొందుతున్నారు. ఆయన తీసుకున్న పుణ్యమా అని.. మన దేశంలో వ్యాక్సినేషన్ ఆలస్యం కావటమే కాదు.. కరోనా సెకండ్ వేవ్ కు దేశ ప్రజలు ఆగమాగమయ్యే పరిస్థితి.

సామాన్యుడి నుంచి సెలబ్రిటీ వరకు కరోనా కోరల బారిన పడకుండా తప్పించుకోవటం చాలా కష్టమవుతోంది. ఇలాంటి వేళ.. వ్యాక్సినేషన్ ఎంత భారీగా విస్తరించటం తప్పించి మరో మార్గం లేదు. కరోనాను కంట్రోల్ చేసే వ్యాక్సిన్ తయారీలో.. మన దేశీయ సంస్థలు ప్రయత్నిస్తున్నా.. అందుకు అగ్రరాజ్యం అమెరికా అడ్డుపుల్ల వేయటం ఇబ్బందికరంగా మారింది. ప్రపంచ దేశాల విషయంలో మనం ప్రదర్శించే ఉదారతకు భిన్నంగా అమెరికా తీరు ఉంటుందన్నది తెలిసిందే. ప్రపంచం ఏమై పోయినా ఫర్లేదు. తమ దేశం.. తమ దేశ ప్రజలకు పెద్ద పీట వేసే అగ్రరాజ్యం.. టీకా తయారీలో అవసరమైన కీలక ముడి పదార్థాల ఎగుమతుల్ని అడ్డుకోవటం గమనార్హం.

నాలుగు రోజుల క్రితం ఫూణెకు చెందిన సీరం సంస్థ అధినేత అధర్ పూనావాలా అమెరికా అధ్యక్షుడు బైడెన్ ను ట్యాగ్ చేస్తూ ఒక ట్వీట్ చేసి సంచలనంగా మారారు. ప్రపంచ వ్యాప్తంగా చర్చ జరిగేలా చేయటంలో ఆయన సక్సెస్ అయ్యారు. వ్యాక్సిన్ తయారీకి అవసరమైన ముడిపదార్థాలపై అమెరికా విధించిన ఆంక్షల్ని తొలగిస్తేనే ఉత్పత్తిని వేగవంతం చేయగలమన్న సందేశాన్ని ట్వీట్ రూపంలో చేశారు. దీనికి అమెరికా నుంచి సానుకూల స్పందన రాకపోగా.. తామేమీ చేయలేమన్న అమెరికా ప్రముఖుడి స్పందన షాకింగ్ గా మారింది.

అధర్ పూనావాల చేసిన ట్వీట్ కు స్పందించిన అమెరికా అధ్యక్షుడి చీఫ్ మెడికల్ అడ్వైజర్ ఆంటోనీ ఫౌఛీ స్పందిస్తూ.. తానేమీ చేయలేనని.. తనను క్షమించాలన్నారు. ప్రస్తుతానికి తన చేతుల్లో ఏమీ లేదని.. తర్వాతి రోజుల్లో కచ్ఛితంగా స్పందిస్తామని చెప్పటం చూస్తే.. వ్యాక్సిన్ తయారీలో కీలకమైన ‘అడ్జువెంట్’ను భారత్ కు అందించే విషయంలో తానెలాంటి సాయం చేయలేనన్న విషయాన్ని చెప్పకనే చెప్పేశారు.

ఇంతకీ ఈ అడ్జువెంట్ అంటే ఏమిటి? అన్న విషయంలోకి వెళితే.. వ్యాక్సిన్ లో కీలకమైన వస్తువు. సీరం ప్రస్తుతం తన కోవీ షీల్డ్ తో పాటు.. ఈ ఏడాది చివరకు నోవావాక్సో అనే అమెరికా కంపెనీ తయారు చేసిన కోవిడ్ టీకాను తయారు చేయాల్సి ఉంది. దీనికి సంబంధించిన కీలక ముడి పదార్థం ‘అడ్జువెంట్’ అమెరికా నుంచి రావాల్సి ఉంది. బైడెన్ సర్కారు అధికారంలోకి వచ్చిన వెంటనే.. ఈ ముడి పదార్థాన్ని విదేశాలకు పంపే విషయంలో నిర్ణయాధికారం మొత్తం డిఫెన్స్ ప్రొడక్షన్ యాక్ట్ కిందకు తీసుకొచ్చారు. దీంతో.. ముందు అమెరికా ప్రయోజనాల తర్వాతే వేరే దేశాల సంగతి చూస్తారు.

తాజాగా చర్చకు వచ్చిన అడ్జువెంట్ విషయానికి వస్తే.. మన కుంకుడు కాయ లాంటి ఒక చెట్టు నుంచి తీసిన క్విల్లాజా సపోనిన్స్ ను వ్యాక్సిన్ లో వినియోగిస్తారు. ఇది.. శరీరంలోని టీ కణాల్ని బలోపేతం చేయటమే కాదు.. వ్యాక్సిన్ మరింత ప్రభావవంతంగా చేసేందుకు సాయం చేస్తుంది. కాకుంటే.. నోవావాక్స్ కంపెనీ వినియోగించే టీకాలో వాడే ముడిపదార్థాలు చాలా వరకు పేటెంట్ తో ఉన్నవి. దీంతో అమెరికా ఆంక్షలకు తలొగ్గాల్సి వస్తోంది.

ఇలాంటి వేళలో.. మన దేశానికి దన్నుగా నిలిచేందుకు ప్రధాని మోడీ అమెరికా అధ్యక్షుడికి ఎందుకు విన్నపం చేయకూడదు. కరోనా విరుచుకుపడిన వేళలో.. అమెరికాకు రెమ్ డెసివర్ అవసరమైనప్పుడు ట్రంప్ ఏం చేశారన్నది మర్చిపోకూడదు. తమ దేశ ప్రయోజనాల కోసం.. అవసరమైతే బెదిరింపులకు దిగిన ఆయనంతలా కాకున్నా.. మన స్థాయికి తగ్గట్లు రిక్వెస్టు చేయొచ్చు కదా? వ్యాక్సిన్ తయారీలో కీలకమైన సీరం సంస్థ ఇబ్బంది పడటమంటే.. దేశానికి. . దేశ ప్రజలకు ఇబ్బందే కదా? అలాంటప్పుడు మోడీ మాష్టారు కల్పించుకుంటే బాగుంటుందన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది.