Begin typing your search above and press return to search.

ఏపీతో నీటిఫైట్: షర్మిల మద్దతు ఎవరికంటే?

By:  Tupaki Desk   |   28 Jun 2021 4:12 PM GMT
ఏపీతో నీటిఫైట్: షర్మిల మద్దతు ఎవరికంటే?
X
ఏపీ ఆడకూతురు తెలంగాణలో రాజకీయం చేస్తోంది. ఆంధ్రా బిడ్డ తెలంగాణ ఇంటి కోడలుగా ఇక్కడి ప్రజల కోసం పోరాడుతోంది. అయితే తెలంగాణ సీఎం కేసీఆర్ ఇప్పుడు ఏపీతో నీటి యుద్ధానికి దిగారు. మరి ఈ ఏపీ ఆడబిడ్డ మద్దతు ఎటు? వైఎస్ షర్మిల తను పుట్టిన రాయలసీమ కరువుకు సపోర్టు చేస్తుందా? తెలంగాణలో రాజకీయం చేస్తున్నందున ఈ ప్రాంతానికి మద్దతు ఇస్తుందా? అసలు కేసీఆర్ ఈ అంశాన్ని లేవనెత్తి ఇరుకునపెట్టాడే అని విశ్లేషణలు సాగాయి.

ఎట్టకేలకు తెలంగాణ, ఏపీ మధ్య నెలకొన్న నీటి వివాదంపై వైఎస్ షర్మిల స్పందించారు. వైఎస్ షర్మిల తన మద్దతు తెలంగాణకే అని చాటిచెప్పారు. ‘తెలంగాణకు సంబంధించిన ఒక్క నీటి చుక్కను కూడా వదలుకోమని’ వైఎస్ షర్మిల పేర్కొన్నారు. అందుకు అవసరం అయితే ఎవరితో అయినా పోరాడడానికైనా తాను సిద్ధమని షర్మిల చెప్పుకొచ్చారు.

దీన్ని తెలంగాణ నీటి ప్రయోజనాల కోసం సొంత రాయలసీమ నేతలతో.. ఆఖరుకు అన్నయ్య, సీఎం జగన్ తోనూ పోరాడుతానని షర్మిల స్పష్టం చేసినట్టైంది. తెలంగాణలో రాజకీయం చేస్తున్న షర్మిల ఇప్పుడు తన సొంత ప్రాంతంతోనే పోరాడటం రాజకీయవర్గాల్లో చర్చనీయాంశమైంది.

తెలంగాణలో త్వరలో పార్టీ పెట్టి రాజకీయం చేయబోతున్న షర్మిల ఈ క్లిష్ట సమస్యపై తెలంగాణకే మద్దతు తెలిపారు. ఏపీ కంటే తనకు తెలంగాణ ప్రజల సమస్యలే మిన్న అని చాటిచెప్పారు. ఇప్పటికే తెలంగాణ సమస్యలపై అధికార టీఆర్ఎస్ పై దుమ్మెత్తి పోస్తున్నారు.

ఏపీలో స్వయంగా షర్మిల అన్న, సీఎం జగన్ అధికారంలో ఉన్నారు. ఇప్పుడు నీటి వివాదంలో తెలంగాణపై ఆయన పోరాడుతున్నారు. ఈ నీటి వివాదంపై ఇన్నాళ్లు మౌనంగా ఉన్న షర్మిల ఏలా స్పందిస్తుందో అని అందరూ ఎదురుచూశారు. కానీ రాజకీయం ముందు అన్న, సొంత ప్రాంతం సెంటిమెంట్ తనకు లేదని నిరూపించారు.