Begin typing your search above and press return to search.

రూ.4.34 లక్షల కోట్ల అప్పు చేస్తాం: కేంద్రం

By:  Tupaki Desk   |   1 Oct 2020 2:40 PM IST
రూ.4.34 లక్షల కోట్ల అప్పు చేస్తాం: కేంద్రం
X
కరోనా లాక్ డౌన్ తో దేశ ఆర్థిక వ్యవస్థ కుప్పకూలింది. ఈ క్రమంలోనే కేంద్రంలోని బీజేపీ సర్కార్ కు కూడా అప్పులు చేయక తప్పడం లేదు. ఒకటికాదు రెండు కాదు.. ఏకంగా లక్షల కోట్లు అప్పులు చేస్తున్నట్టు తాజాగా ఆర్థిక శాఖ తెలిపింది.

ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2020-21) ద్వితీయార్థంలో కేంద్ర ప్రభుత్వం రూ.4.34 లక్షల కోట్ల అప్పులు చేయనున్నట్లు ఆర్థిక శాఖ తెలిపింది. ఈ ఆర్థిక సంవత్సరంలో రూ.12 లక్షల కోట్ల రుణ లక్ష్యానికి కట్టుబడి ఉన్నట్లు ఆర్థిక వ్యవహారాల కార్యదర్శి తరుణ్ బజాజ్ తెలిపారు.

ఇప్పటికే కేంద్రం సెప్టెంబర్ తో ముగిసిన ప్రథమార్థంలో రూ.7.66 లక్షల కోట్ల రుణం తీసుకుంది. ఈ ఏడాది రూ.12 లక్షల కోట్ల రునాలు తీసుకుంటామని మే నెలలో ప్రభుత్వం ప్రకటించింది. కరోనా కారణంగా దీనిని 50శాతం పెంచి రూ.12 లక్షల కోట్లకు పెంచవలసిన పరిస్థితి ఏర్పడింది.

బుధవారం విడుదల చేసిన డేటా ప్రకారం ఆగస్టు చివరి నాటికి కేంద్ర ఆర్థిక ద్రవ్యలోటు రూ.8.7 లక్షల కోట్లుగా ఉంది. పూర్తి ఏడాదికి బడ్జెట్ లో అందించిన రూ.7.96 లక్షల కోట్ల కంటే 9.3శాతం ఎక్కువ. అయితే ద్రవ్యలోటు రూ.14 లక్షల కోట్ల నుంచి రూ.18 లక్షల కోట్ల మధ్య ఉండవచ్చునని నిపుణుల అంచనా.

ప్రభుత్వానికి కరోనాతో ఆదాయం పడిపోయిన నేపథ్యంలో రుణ లక్ష్యం రూ.12 లక్షల కోట్లకు కట్టుబడి ఉన్నట్టు చెబుతున్నారు. రుణాల్లో మార్పు లేదని ప్రకటించిన నేపథ్యంలో ప్రస్తుతానికి కేంద్రం భారీ ఉద్దీపనకు ముందుకు వెళ్లకపోవచ్చని భావిస్తున్నారు.