Begin typing your search above and press return to search.

మోడీ గ‌ద్దె దిగ‌ట‌మే కావాలి.. ప్ర‌ధాని ప‌ద‌వి అక్క‌ర్లేద‌ట‌!

By:  Tupaki Desk   |   16 May 2019 10:06 AM GMT
మోడీ గ‌ద్దె దిగ‌ట‌మే కావాలి.. ప్ర‌ధాని ప‌ద‌వి అక్క‌ర్లేద‌ట‌!
X
నేను పాస్ కాకున్నా ఫ‌ర్లేదు.. వాడు మాత్రం క‌చ్చితంగా ఫెయిల్ కావాల్సిందే.. అంటూ కొంత‌మంది మాట్లాడుకోవ‌టం చూసి ఉంటాం. దాదాపు అలాంటి ప‌రిస్థితే జాతీయ రాజ‌కీయాల్లో నెల‌కొంది. ఐదేళ్ల మోడీ పాల‌న త‌ర్వాత విప‌క్షాలు దాదాపు ఒకవైపున‌కు వ‌చ్చేయ‌ట‌మే కాదు.. మోడీ చేతికి ప‌వ‌ర్ రాకుండా ఉండ‌టానికి దేనికైనా సిద్ధ‌మ‌న్న‌ట్లుగా వ్యాఖ్యానిస్తున్నాయి.

మోడీ ఓట‌మితో ప్ర‌ధాన‌మంత్రి సీట్లో కూర్చోవాల‌ని త‌పిస్తున్న ప్రాంతీయ పార్టీల‌కు పెద్ద‌న్న కాంగ్రెస్ ఇప్పుడు ఇబ్బందిక‌రంగా మారింది. కాంగ్రెస్ చేతికి పెద్ద‌గా సీట్లు రాన‌ప్ప‌టికి.. త‌మ మీద పెత్త‌నం చేస్తూ పీఎం కుర్చీలో రాహుల్ కూర్చోవ‌టానికి కొంత‌మంది సుముఖంగా లేరు. ఇలాంటివేళ‌.. త‌మ ప్ర‌ధ‌మ శ‌త్రువైన మోడీ చేతికి ప‌వ‌ర్ అంద‌కుండా ఉండేందుకు కాంగ్రెస్ భారీ త్యాగానికి సిద్ధ‌మ‌వుతోంది.

ఇప్ప‌టికే ప్ర‌ధాని ప‌ద‌వి మీద ఆశ లేద‌న్న మాట య‌ధాలాపంగా చెబుతున్న రాహుల్ మాట‌ను.. ఈసారి కాంగ్రెస్ సీనియ‌ర్ నేత‌.. ఏఐసీసీ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి గులాం న‌బీ అజాద్ ఆస‌క్తిక‌ర వ్యాఖ్య చేశారు. కాంగ్రెస్ పార్టీకి ప్ర‌ధాని ప‌ద‌వి ద‌క్క‌కున్నా ఫ‌ర్లేదని చెప్పేశారు. దేశ‌వ్యాప్తంగా ప్ర‌తిప‌క్షాల‌న్ని మోడీకి వ్య‌తిరేకంగా ఒక కూట‌మిగా మారుతున్న వేళ‌.. మోడీని గ‌ద్దె దించ‌ట‌మే త‌మ ల‌క్ష్య‌మ‌ని స్ప‌ష్టం చేస్తున్నారు.

తాజాగా ఇదే విష‌యాన్ని గులాం న‌బీ అజాద్ మ‌రోసారి వెల్ల‌డించారు. ఎన్నిక‌ల ప్ర‌చారంలో పాల్గొన్న అజాద్ మాట్లాడుతూ.. త‌మ స్టాండ్ ఏమిటో తాము ఇప్ప‌టికే స్ప‌ష్టం చేశామ‌ని.. అన్ని పార్టీలు క‌లిసి ఒక కూట‌మిగా ఏర్ప‌డితే.. ఆ కూట‌మి ప్ర‌భుత్వాన్ని ఏర్పాటు చేస్తుంద‌న్నారు.

ప్ర‌ధాని ప‌ద‌వి కాంగ్రెస్‌ కు ద‌క్క‌కున్నా.. తాము బాధ‌ప‌డ‌మ‌ని.. ఎందుకంటే.. బీజేపీని గ‌ద్దె దించ‌ట‌మే త‌మ క‌ర్త‌వ్య‌మ‌న్నారు. అంద‌రిని క‌లుపుకు వెళ్ల‌టం త‌మ ల‌క్ష్యంగా చెప్పిన ఆయ‌న‌.. మిత్ర‌ప‌క్షాల మ‌ధ్య విభేదాలు రాకుండా చూసుకోవ‌ట‌మే త‌మ ముందున్న ల‌క్ష్య‌మ‌న్నారు. అదే ప‌నిగా మిత్ర‌ప‌క్షాల ప్ర‌ధాని అభ్య‌ర్థి ఎవ‌రంటూ కేంద్ర‌మంత్రి రాజ్ నాథ్ సింగ్ విమ‌ర్శ‌లు చేస్తున్న దానికి ప్ర‌తిగా గులాం న‌బీ అజాద్ తాజా వ్యాఖ్య‌లు చేయ‌టం గ‌మ‌నార్హం.