Begin typing your search above and press return to search.

ప్రజలే హైకమాండ్‌ గా భావిస్తాం..ఒకసారి అవకాశం ఇవ్వండి: ప్రధాని మోదీ!

By:  Tupaki Desk   |   25 Feb 2021 12:30 PM GMT
ప్రజలే హైకమాండ్‌ గా భావిస్తాం..ఒకసారి అవకాశం ఇవ్వండి: ప్రధాని మోదీ!
X
దేశంలో పలు రాష్ట్రాల్లో త్వరలో ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో ఆయా రాష్ట్రాల్లో బీజేపీ పాగా వేసేలా వ్యూహాలు రచిస్తూ , పలు కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు ప్రధాని మోదీ. ఈ క్రమంలోనే నేడు తమిళనాడు, పుదుచ్చేరిలో పర్యటిస్తున్నారు. ఈ సందర్భంగా పుదుచ్చేరి పలు అభివృద్ధి పనులకు పునాది రాయి వేశారు. పుదుచ్చేరిలోని కరైకల్‌ జిల్లా పరిధిలోని విల్లుపురం నుంచి నాగపట్నం వెళ్లే 56 కిలోమీటర్ల నాలుగులైన్ల జాతీయ రహదారికి శంకుస్థాపన చేశారు. కేంద్రం ఈ ప్రాజెక్ట్ కి రూ.2,426 కోట్లు కేటాయించింది. పుదుచ్చేరిలోని జవహర్‌ లాల్ ఇనిస్టిట్యూట్‌ ఆఫ్ పోస్ట్‌ గ్రాడ్యుయేట్‌ మెడికల్‌ ఎడ్యుకేషన్‌ అండ్‌ రీసెర్చ్‌ లో బ్లడ్‌ బ్యాంక్‌ సెంటర్‌ ను ప్రారంభించారు. త్వరలో నే ఇక్కడ అసెంబ్లీ ఎన్నికలు జరుగనున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో ప్రచార ర్యాలీలో ప్రధాని మోడీ ప్రసంగించారు.

గతంలో భారత ప్రభుత్వాన్ని బిట్రీష్ ప్రభుత్వంతో పోల్చడాన్ని ఈ సందర్భంగా ఖండించారు. బ్రిటీష్ పరిపాలకులు డివైడ్ అండ్ రూల్ పాలసీని అమలు చేస్తే, కాంగ్రెస్ మాత్రం డివైడ్, లై, రూల్ పాలసీని అమలు చేస్తోందని మోడీ విమర్శించారు. అప్పుడు ఆ పార్టీ నేతలు ప్రాంతాలు, వర్గాల మధ్య చిచ్చులుపెడతారని మండిపడ్డారు. ఓ కాంగ్రెస్ నేత కేంద్రంలో మత్స్యశాఖ లేదంటూ వ్యాఖ్యలు చేయడం నాకు నిజంగా ఆశ్చర్యాన్ని కలిగించింది. అయితే, అసలు నిజం ఏంటంటే.. ఇప్పటికే కేంద్రంలో ఆ శాఖ ఉంది. 2019లోనే కేంద్రంలో మత్స్యశాఖను ఎన్డీఏ ప్రభుత్వం ఏర్పాటు చేసింది అని రాహుల్ గాంధీ చేసిన వ్యాఖ్యలకి కౌంటర్ ఇచ్చారు ప్రధాని మోడీ.

ఇదే నేపథ్యంలో నారాయణ స్వామి ప్రభుత్వం ప్రజల కోసం కంటే కాంగ్రెస్ హై కమాండ్ కోసం ఎక్కువ పనిచేసింది అంటూ విమర్శలు చేశారు. వచ్చే ఎన్నికల్లో ఎన్డీఏ ను గెలిపిస్తే ప్రజలే హైకమాండ్‌ గా భావించి మంచి పాలన అందిస్తాం అంటూ హామీ ఇచ్చారు. ఇక్కడి ప్రజలకు ఇప్పటివరకు ప్రభుత్వం నుంచి ఎలాంటి సహకారం లేదు. కేంద్రం నుంచి వచ్చిన నిధులను ఇక్కడి ప్రభుత్వం సద్వినియోగం చేయలేదు. తీర ప్రాంతంలోని మత్స్యకారుల కోసం చేపట్టిన పథకాలను అమలు చేయలేదు. ప్రజలకు నిజాలు చెప్పాల్సింది పోయి.. సీఎం నారాయణ స్వామి అబద్ధాలు చెబుతున్నారు అని మోదీ తీవ్ర విమర్శలు చేశారు.