Begin typing your search above and press return to search.

మా గర్వాన్ని దెబ్బ తీసే ఏ సూపర్ పవర్ కైనా ధీటుగా జవాబిస్తాం

By:  Tupaki Desk   |   15 Jan 2021 4:06 AM GMT
మా గర్వాన్ని దెబ్బ తీసే ఏ సూపర్ పవర్ కైనా ధీటుగా జవాబిస్తాం
X
ఏదో వంకన తరచూ కెలికే డ్రాగన్ ను చూసి భయపడే రోజులు పోయి చాలా కాలమే అయ్యింది. గతానికి భిన్నంగా మోడీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత నుంచి చైనాను చూసి దడుచుకోవటం కంటే కూడా.. దానికి అలవాటైన తీరులోనే ఎదురుదెబ్బ తీయటం అలవాటు చేసుకున్న సంగతి తెలిసిందే. నువ్వు ఒకటి అంటే.. నేను రెండు అంటా అన్న చందంగా ఇప్పటికే పలుమార్లు నిరూపించిన భారత్.. తనకు తానుగా కెలకనని.. అలా అని ఉత్తిపుణ్యానికే కెలికితే మాత్రం ఊరుకునేది లేదన్న విషయాన్ని కేంద్ర రక్షణ శాఖామంత్రి రాజ్ నాథ్ సింగ్ స్పష్టం చేశారు.

తమకు శాంతి.. స్నేహపూర్వక సంబంధాలు కొనసాగించేందుకే ప్రాధాన్యం ఇస్తామన్న ఆయన.. చైనాతో కొనసాగుతున్న సరిహద్దు వివాదాన్ని ఉద్దేశించి రాజ్ నాథ్ మాట్లాడుతూ.. ‘మేం ప్రతి ఒక్కరితోనూ స్నేహ సంబంధాల్నే కోరుకుంటాం. పొరుగు దేశాలతో వివాదాలు కోరుకోవటం లేదు. భారత్ యుద్ధాన్ని కోరుకోవటం లేదు. ఒకవేళ ఎవరైనా సూపర్ పవర్.. భారతజాతి గర్వాన్ని దెబ్బ తీసేందుకు ప్రయత్నిస్తే ధీటుగా జవాబు ఇవ్వగలిగే సైనికులు ఉన్నారు’ అని కీలక వ్యాఖ్యల్ని కుండబద్ధలు కొట్టేసినట్లు తేల్చేశారు.

బెంగళూరులోని భారతీయ వాయుసేన ప్రధాన కార్యాలయంలో నిర్వహించిన సాయుధ దళాల వెటరన్స్ డే కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. పొరుగు దేశాలతో శాంతి.. స్నేహపూర్వక సంబంధాలే కోరుకుంటున్నామన్నారు. ‘ఈ తీరు మన రక్తం.. మన కల్చర్ లోనే ఉంది. గతంలో ఎన్నడూ చూడనివి కొన్నిఈసారి చోటు చేసుకున్నాయి’ అని పేర్కొన్నారు. భారత సైనిక దళాలు సాహసోపేతమైన కార్యకలాపాల్ని చేపట్టటాన్ని ఎవరూ ఊహించలేరన్న ఆయన.. దీనికి సంబంధించిన వివరాల్ని మాత్రం తాను ప్రస్తావించలేనని చెప్పటం గమనార్హం. ఏమైనా.. సూపర్ పవర్ ఎవరైనా సరే.. మన జోలికి వస్తే ఎవరినైనా వదిలిపెట్టమన్న విషయాన్ని రాజ్ నాథ్ చెప్పటం విశేషం.