Begin typing your search above and press return to search.

దేశ ప్ర‌జ‌ల‌కు కొత్త టాస్క్ ఇచ్చిన మోడీ..!

By:  Tupaki Desk   |   30 Jun 2019 9:40 AM GMT
దేశ ప్ర‌జ‌ల‌కు కొత్త టాస్క్ ఇచ్చిన మోడీ..!
X
ప్ర‌త్య‌ర్థులపై నిప్పులు చెరిగే తీరు ప్ర‌ధాని మోడీలో కొట్టొచ్చిన‌ట్లుగా క‌నిపిస్తుంది. రాజ‌కీయ ప్ర‌యోజ‌నం కానీ.. ఎన్నిక‌ల స‌మ‌యాల్లో త‌ప్పించి మిగిలిన స‌మ‌యాల్లో మాత్రం మేనేజ్ మెంట్ గురు మాదిరి వ్య‌వ‌హ‌రిస్తుంటారు ప్ర‌ధాని. చ‌క్క‌టి భాష‌తో.. భావోద్వేగంతో క‌నెక్ట్ అయ్యే మాదిరి ఆయ‌న మాట‌లు ఉంటాయి. నీతులు చెప్పేందుకు ఆయ‌న తెగ ఆస‌క్తిని ప్ర‌ద‌ర్శిస్తారు. మ‌రి.. ఇదే నీతిని మీరు అనుస‌రిస్తారా మోడీ సాబ్‌? అన్న ప్ర‌శ్న‌ను సంధించే అవ‌కాశం ఇవ్వ‌కుండా వ్య‌వ‌హ‌రించే తీరు మోడీకి మాత్ర‌మే సొంతం.

ఈ ఆదివారం కోసం తానెంతో వెయిట్ చేశార‌ని. ఎంతో ఆస‌క్తిగా ఎదురుచూసిన‌ట్లుగా చెప్పిన మోడీ..ఇంత‌కూ ఎందుకంటారా? దేశ ప్ర‌జ‌ల్ని ఉద్దేశించి త‌న మ‌న‌సులోని మాట‌ను చెప్పే మ‌న్ కీ బాత్ కార్య‌క్ర‌మం కోసం. ఎన్నిక‌ల నేప‌థ్యంలో తన మాన‌స‌పుత్రిక అయినా మ‌న్ కీ బాత్ ను నిర్వ‌హించే అవ‌కావం ఇవ్వ‌కుండా ఎన్నిక‌ల కోడ్ అమ‌ల్లోకి రావ‌టం తెలిసిందే. దీంతో.. సార్వ‌త్రిక ఎన్నిక‌ల కోడ్ ముగిసే వ‌ర‌కూ ఆయ‌న త‌న ప్రోగ్రాంను ఆపేశారు.

తాజాగా ఈ రోజున ఆయ‌న త‌న మ‌న్ కీ బాత్ కార్య‌క్ర‌మాన్ని తిరిగి శ్రీ‌కారం చుట్టారు. ప్ర‌ధానిగా రెండోసారి బాధ్య‌త‌లు చేపట్టిన మోడీ.. ఈ ఆదివారం మ‌న్ కీ బాత్ కార్య‌క్ర‌మాన్ని మ‌ళ్లీ షురూ చేశారు. ఈ సంద‌ర్భంగా ఆయ‌న నీటి ప్రాధాన్య‌త గురించి.. దాని అవ‌స‌రం గురించి ప్ర‌త్యేకంగా మాట్లాడారు. దేశ వ్యాప్తంగా ఆందోళ‌న క‌లిగిస్తున్న నీటి స‌మ‌స్య‌ను ప్ర‌స్తావించిన మోడీ.. జ‌ల‌సంర‌క్ష‌ణ‌కు క‌లిసిక‌ట్టుగా కృషి చేయాల్సిన అవ‌స‌రాన్ని చెప్పారు.

ప్ర‌తి నీటి బొట్టును ఒడిసిప‌ట్టేందుకు చ‌ర్య‌లు చేప‌ట్టిన‌ట్లు చెప్పిన ఆయ‌న‌.. నీటి ప‌రిర‌క్ష‌ణ కోసం పెద్ద ఎత్తున ప్ర‌చారాన్ని నిర్వ‌హించాల‌ని పెద్ద‌ల్ని.. ప్ర‌ముఖుల్ని కోరారు. జ‌ల సంర‌క్ష‌ణ కోసం ప‌ని చేసే ఎన్జీవోలు.. వ్య‌క్తుల గురించి స‌మాచారం తెలిస్తే.. వారి వివ‌రాల్ని అంద‌రికి తెలిసేలా అప్ లోడ్ చేయాల‌న్నారు. జ‌ల‌సంర‌క్ష‌ణ కోసం సంబంధించిన ఏ అంశాన్ని అయినా హ్యాష్ టాగ్ జ‌న్ శ‌క్తి ఫ‌ర్ జ‌ల్ శ‌క్తికి అప్ లోడ్ చేయాల‌న్న సూచ‌న చేశారు. మ‌రి.. మోడీ పిలుపున‌కు ఎలాంటి స్పంద‌న వ‌స్తుందో చూడాలి.