Begin typing your search above and press return to search.

తండ్రిని చంపినోళ్ల‌ను క్ష‌మించేశామ‌న్న రాహుల్‌

By:  Tupaki Desk   |   11 March 2018 9:48 AM GMT
తండ్రిని చంపినోళ్ల‌ను క్ష‌మించేశామ‌న్న రాహుల్‌
X
విదేశీ ప‌ర్య‌ట‌న‌లో ఉన్న కాంగ్రెస్ అధ్య‌క్షుడు రాహుల్ గాంధీ త‌మ నాన‌మ్మ‌.. నాన్నల మ‌ర‌ణం మీద కీల‌క వ్యాఖ్య‌లు చేశారు. వీరు ఇరువురూ వేర్వేరు ఘ‌ట‌న‌ల్లో హ‌త్య‌కు గురి కావ‌టం తెలిసిందే. త‌న తండ్రి.. మాజీ ప్ర‌ధాని రాహుల్ గాంధీ 1991లో దారుణ హ‌త్య‌కు గురైన ఉదంతంపై మాట్లాడిన రాహుల్‌.. త‌న తండ్రి మ‌ర‌ణాన్ని తాము ముందే ఊహించిందేన‌న్నారు.

త‌న తండ్రి చ‌నిపోతార‌న్న విష‌యం త‌మ‌కు ముందే తెలుస‌న్న‌ట్లుగా మాట్లాడారు. నాన్న చ‌నిపోయిన‌ప్పుడు చాలా ఏళ్లు బాధ‌ప‌డ్డామ‌ని.. కానీ ఆయ‌న్ను చంపిన వారిని క్ష‌మించేశామ‌న్నారు. త‌న తండ్రి మ‌ర‌ణంపై మాట్లాడిన రాహుల్‌.. త‌న నాన‌మ్మ మ‌ర‌ణంపైనా స్పందించారు.

రాజ‌కీయాల్లో త‌ప్పుడు వ్య‌క్తుల కార‌ణంగా. వారికి వ్య‌తిరేకంగా నిలిచినా.. దేని గురించైనా గ‌ట్టిగా పోరాడినా మ‌నం చనిపోతామ‌న్న రాహుల్‌.. త‌న తండ్రి.. నాన‌మ్మ‌లు చ‌నిపోతార‌ని ముందే ఊహించిన‌ట్లుగా చెప్పారు. తాను చ‌నిపోతాన‌ని నాన‌మ్మ ముందే త‌న‌కు చెప్పిన‌ట్లుగా రాహుల్ వెల్ల‌డించారు.

త‌న తండ్రికి మీరు చ‌నిపోతార‌ని తాను చెప్పిన విష‌యాన్ని రాహుల్ గుర్తు చేసుకున్నారు. త‌న తండ్రిని చంపిన ఎల్టీటీఈ అధినేత ప్ర‌భాక‌ర‌న్ 2009లో చ‌నిపోయిన‌ప్పుడు.. అత‌డు నిర్జీవంగా ప‌డి ఉన్న వైనాన్ని చూసిన‌ప్పుడు త‌న మాన‌సిక స్థితి గురించి రాహుల్ వివ‌రించారు.

"అత‌డు నిర్జీవంగా ప‌డి ఉండ‌టం టీవీల్లో చూశాను. అత‌న్ని ఎందుకింత నీచంగా అవ‌మానిస్తున్నార‌నిపించింది. అత‌ను చ‌నిపోవ‌టంతో అత‌డి భార్య‌.. పిల్ల‌లు అనాథ‌లైపోయార‌ని బాధ వేసింది. ఆ త‌ర్వాత నా సోద‌రి ప్రియాంక‌కు ఫోన్ చేశా. నాన్న‌ను చంపేసిన ప్ర‌భాక‌ర‌న్ చ‌నిపోయాడు. దానికి నేను సంతోష‌ప‌డాలి. కానీ.. నాకు ఆ భావ‌న క‌ల‌గ‌టం లేద‌ని చెప్పా. ప్రియాంక కూడా త‌న‌కూ అలాంటి భావ‌నే క‌లుగుతుంద‌ని చెప్పింది" అని నాటి సంగ‌తుల్ని గుర్తు చేసుకున్నారు.